Congress |హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పరిపాలన గాడితప్పుతున్నదని, పరిస్థితి క్రమంగా చేయిదాటిపోతున్నదని, గుర్తించిన ముఖ్యనేత వర్గం, తెలివిగా కోవర్టు రాజకీయాన్ని మొదలుపెట్టిందా? భవిష్యత్తులో తనకు పోటీగామారే అవకాశం ఉన్న నేతలను టార్గెట్ చేసి రంగం నుంచి తప్పించేందుకు వ్యూహాన్ని అల్లిందా? ఇందులో భాగంగా రేపటి రోజున అత్యున్నత పదవికి పోటీదారులు కాగలిగే అవకాశం ఉన్న ముగ్గురు కీలక మంత్రులకు ముందస్తుగా పొగబెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయా? ఈ క్రమంలో మొట్టమొదటగా దళిత నేత, ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న ఆ నేత మంత్రి పదవికి గానీ, శాఖలకు గానీ ఎసరు రానుందా? అంటే ‘అవును’ అనే అంటున్నాయి కాంగ్రెస్‌లోని విశ్వసనీయ వర్గాలు.
కొన్ని వారాలుగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. ప్రభుత్వంలోని అనేక శాఖల్లో పైనుంచి కిందిదాకా అవినీతి జరుగుతున్నా, ఆర్థిక శాఖలోని అవినీతి మాత్రమే ప్రధానంగా తెరమీదికి రావడమే కాకుండా అటు సామాజిక మాధ్యమాల్లోనూ ఇటు ప్రధాన స్రవంతి మీడియాలోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది. అన్నిశాఖల్లో అవినీతి జరుగుతున్నా కేవలం ఒక్క శాఖనే బదనాం చేయడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉన్నట్టు కాంగ్రెస్ సీనియర్లు చెవులు కొరుక్కుంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు సదరు నేత కాంగ్రెస్ పార్టీ తరపున గత అసెంబ్లీలో కీలకనేతగా వ్యవహరించారు. పార్టీ ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, గ్యారెంటీల రూపకల్పన తదితర అంశాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్‌కు ఊపుతెచ్చే ప్రయత్నం చేశారు. తదనంతర క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి పదవికి ఆయన ప్రధాన పోటీదారుగా కూడా కనిపించారు.
కాంగ్రెస్ అధిష్ఠానం దళిత అనుకూల ఎజెండా తీసుకున్న నేపథ్యంలో ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయన్న వాదన కూడా వినిపించింది. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఎంపిక కోసం జరిగిన కసరత్తులో కూడా ఆయన ప్రధాన పోటీదారుగా నిలిచారు. అనేక రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకున్న అధిష్ఠానం రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది.
అదే సమయంలో దళిత వర్గానికి చెందిన ఆ నేతకు సీఎం తర్వాతి స్థానం ఇచ్చి బలమైన మంత్రిత్వశాఖను అప్పగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్‌గా విడిపోయి ఉన్న పరిస్థితుల్లో ఒరిజినల్ కాంగ్రెస్‌కు ఆ నేత ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఏనాటికైనా రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చాల్సి వస్తే ఆ అవకాశం ఈయనకే ఎక్కువగా ఉంటుందనే రాజకీయ విశ్లేషణలు కూడా అప్పట్లో వినిపించాయి. అటు ప్రభుత్వంలో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.
ముఖ్యమంత్రి ఎప్పుడు ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినా ఆయన వెంట సదరు నేత కూడా ఉండటం, అన్ని సమావేశాల్లోనూ పాల్గొనడం ఆనవాయితీగా మారింది. దీంతో హైకమాండ్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. ఆ తర్వాతే పరిణామాలు వేగం గా మారడం మొదలయ్యాయి. ఒకవైపు ప్రస్తు త కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటూ రావడం, పరిపాలన సరైన క్రమంలో సాగలేదన్న అభిప్రాయం ప్రబలుతుండటంతో ఏనాటికైనా సదరు దళిత నేతతో తనకు ప్రమాదం తప్పదనే అంచనాకు వచ్చిన ముఖ్యనేత వర్గం, ఆయనను టార్గెట్ చేసుకొని వేగంగా పావులు కదిపిందని కాంగ్రెస్‌లోని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆయన పరపతిని, పలుకుబడిని తగ్గించి పలుచన చేసేందుకు పక్కా ప్లాన్ ప్రకారం ఉచ్చులోకి లాగారని , సదరు దళిత నేతతో సన్నిహితంగా మెలిగే కాంగ్రెస్ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. ప్రభుత్వంలో తనకు పోటీగా మారే అవకాశం ఉన్న ముగ్గురు మంత్రులపై ముఖ్యనేత నిఘా పెంచారని మిగతా నేతల సన్నిహితులు పేర్కొన్నారు. ‘మంత్రుల వద్దకు వివిధ పనులపై పథకం ప్రకారం కొంతమంది రావటం, డబ్బులు చేతులు మారటంపై పక్కా ఆధారాలతో నివేదికలు అధిష్ఠానానికి పంపించారు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం.. వ్యూహాత్మకంగా ఎవరికీ అనుమానం లేకుండా జరిగింది. ఢిల్లీకి నిధులు కావాలంటూ ముఖ్యనేత వర్గం వేసిన ఎత్తుగడలో ముగ్గురు మంత్రులు ఇరుక్కుపోయారు’ అని పార్టీ సీనియర్ నేత ఒకరు వివరించారు.
ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ముగ్గురు మంత్రుల్లో ఎక్కువ ప్రమాదకరంగా భావిస్తున్న దళిత నేతను సదరు వర్గం టార్గెట్‌గా చేసుకున్నది. ఆయన శాఖలో కమీషన్ల పర్వం నడుస్తున్నదంటూ లీకులు వదిలింది. అటు సోషల్ మీడియాలోనూ ఆయనను బలహీనపరిచే పనులు మొదలుపెట్టింది. పైనుంచి కిందిదాకా ఈ విషయం ప్రచారమయ్యేలా చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల ఆర్థికశాఖ చాంబర్ ముందు దాదాపు 200 మందికిపైగా కాంట్రాక్టర్లు నిరసన తెలిపారు. 20 శాతం కమీషన్ అడుగుతున్నారంటూ ముందు విలేకరుల సమావేశం పెట్టి మరీ సచివాలయానికి వచ్చి రగడ సృష్టించారు.
ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ‘ఇదంతా చూస్తుంటే ఢిల్లీకి డబ్బు వసూళ్లంటూ వ్యవహారాన్ని దళిత మంత్రికి అం టగట్టారు. పథకం ప్రకారం లంచం కాంట్రాక్టర్లతో ధర్నా చేయించారు’అని ఓ దళిత సంఘం నేత ఆరోపించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రధాన సమాచార సాధనాల్లో రావడంతో అధిష్ఠానం నివ్వెరపోయింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వయంగా దీనిపై ఆరా తీసి నివేదిక తెప్పించుకున్నారు. గుట్టుగా గుంభనంగా చేయాల్సిన వ్యవహారాలను ఇలా ఎలా రోడ్డుకెక్కిస్తారని, ఈ వ్యవహారంతో ప్రభుత్వా న్ని అప్రతిష్ట పాలు చేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్టు మరోసారి బయటకు లీకులు వచ్చాయి. ‘అసలు గుట్టంతా ఇందులోనే ఉన్నది.
సచివాలయానికి ఐదంచెల భద్రతా వ్యవస్థ ఉన్నది. అందునా ఆ మంత్రి చాంబర్ ఉన్న ఫ్లోర్‌కు అదనపు భద్రత కూడా ఉన్నది. అలాంటప్పుడు ఇంత పటిష్ట భద్రత ఉన్న మంత్రి చాంబర్ వద్దకు ఏకంగా 200 మంది కాంట్రాక్టర్లు ఎలా వెళ్లగలిగిండ్రు? అదికూడా ఒకవైపు బిల్లులపై గొడవ జరుగుతున్న సమయంలో! కాంట్రాక్టర్లు విలేకరులు సమావేశం నిర్వహించి మరీ సచివాలయానికి వెళ్లగలిగితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది? ఇదంతా అనుమానాస్పదంగా కనిపించడం లేదా? కొంచెం పొలిటికల్ బ్రెయిన్ ఉన్న ఎవరైనా దీని వెనుక ఏం జరిగిందో సులువుగా అర్థమవుతుంది’ అని ఒక అసలు కాంగ్రెస్ ముఖ్యుడు ఒకరు విశ్లేషించారు.
సచివాలయం అనేది నిషిద్ధ ప్రాంతమని, అందులోకి వెళ్లి ధర్నాలు చేయడం చట్ట వ్యతిరేకమని, అయినా ధర్నా నిర్వహించిన కాంట్రాక్టర్లపై ఎలాంటి కేసులూ ఎందుకు నమోదు కాలేదని ఆయన ప్రశ్నించారు. చిన్నచిన్న విషయాలపై పెద్ద సెక్షన్లు పెట్టి జర్నలిస్టులను సైతం జైలుకు పంపుతున్న పోలీసులు, ప్రభుత్వ ప్రతిష్టకు ఇంత మచ్చ తెచ్చిన అంశం మీద ఎందుకు స్పందించలేదని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. దీని వెనుక ఎవరున్నారనేది అర్థమవుతుందని పేర్కొన్నారు.
కాంట్రాక్టర్ల మెరుపు ధర్నాపై అనుమానాలు ఇలా కొనసాగుతుండగానే ఢిల్లీలో కీలక పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఎప్పుడూ ముఖ్యమంత్రి వెంట ఢిల్లీకి వెళ్లే దళిత మంత్రికి బదులు ఆ అవకాశం శ్రీధర్‌బాబుకు, తర్వాత ఉత్తమ్‌కు దక్కింది. మరోవైపు ముఖ్యనేత వర్గం తన శిబిరానికే చెందిన ఒక సన్నిహిత మంత్రి, మరికొందరు ఎమ్మెల్యేల ద్వారా దళిత మంత్రిపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారంటూ ఢిల్లీలోని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆ మంత్రి వ్యవహారాల వల్ల, రాష్ట్రంలో పార్టీ ప్రతిష్టకు, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలుగుతున్నదని, అధిష్ఠానం జోక్యం చేసుకొని వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం బయటకు పొక్కింది. మరోవైపు దళిత మంత్రి క్యాబినెట్ నుంచి తప్పించబోతున్నారంటూ తెలంగాణ మీడి యా, కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో ప్రచారం మొదలైంది. ‘ఇదంతా స్ట్రాటజీ ప్రకారం జరుగుతున్నది. ప్రభుత్వంలో అవినీతి లేనిదెక్కడ? పైనుంచి కింది దాకా అందరిపైనా అవినీతి ఆరోపణలు, సెటిల్మెంట్ల విమర్శలు ఉన్నాయి. అయినా ఒక్కరినే టార్గెట్ చేయడం వెనుక ఆయనకు చెక్ పెట్టే కుట్ర దాగి ఉన్నట్టు కనిపిస్తున్నది.
క్యాబినెట్లో ఉన్నత స్థానంలో ఉండటం కొందరికి నచ్చుతున్నట్టు లేదు..ఓర్చుకోలేకపోతున్నారు. మొదటి నుంచీ అధిష్ఠానం పెద్దలకు సన్నిహితంగా ఉండడం, ఎప్పుడంటే అప్పుడు ఆయనకు ఆపాయింట్మెంట్ ఇవ్వడం కొందరు ఓర్వలేకపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించిన ఒక దళిత నాయకుడి ప్రాధాన్యాన్ని తగ్గించే కుట్రలు పన్నుతున్నారు’అని ఆయనకు సన్నిహితంగా ఉండే ముఖ్య నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, దాంట్లో తమ నేత శాఖను మారుస్తారనే ప్రచారం వెనుక పెద్ద కుట్రనే దాగి ఉన్నదని ఓ దళిత నేత సందేహం వ్యక్తంచేశారు. పార్టీలో ప్రస్తుతం ఎవరినీ నమ్మే పరిస్థితి లేదని, ఈ కోవర్టు రాజకీయంలో తమ నాయకుడు నష్టపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వెలిబుచ్చారు.