హత్నూర, ఆగస్టు 29: సంగారెడ్డి జిల్లా హత్నూర రైతువేదికలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పంపిణీ చేశారు. తొలుత లబ్ధ్దిదారులకు చెక్కులు పంపిణీ చేస్తుండగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు అడ్డుకోబోయారు.
బీఆర్ఎస్ నాయకులు స్టేజీపైకి ఎలా వెళ్తారని కాంగ్రెస్, స్థానిక ఎంపీ రఘునందన్‌రావుకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని బీజేపీ నాయకులు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ క్రమంలో ఎమ్మెల్యే చెక్కుల పంపిణీ నిలిపివేయాలని సభలో నినాదాలు చేశారు. ప్రజా సంక్షేమానికి కృషిచేయాలి తప్ప కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని ఎమ్మెల్యే సూచించారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు రాక ఏడాది గడుస్తున్నదని, వచ్చిన చెక్కులను పంపిణీ చేయొద్దనడం సమంజసం కాదని, ప్రొటోకాల్ పాటించడంలో నేను ఎప్పుడూ ముందుంటా’ అని తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళన చేస్తున్న నాయకులకు నచ్చజెప్పడంతో చెక్కుల పంపిణీ సాఫీగా సాగింది.