హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అడుగడుగునా నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. కొన్నాళ్లుగా ప్రజలకు శాంతి లేదు.. భద్రత అసలే లేదనే వాదన వినిపిస్తున్నది. వరుస వైఫల్యాలు, ఆరోపణలు చూస్తుంటే ‘ఈ పోలీసు వ్యవస్థకు ఏమైంది?’ అని పలువురు సందేహం వ్యక్తంచేస్తున్నారు. సిబ్బంది పనితీరును పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు అలసత్వం వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
అసెంబ్లీకి, డీజీపీ ఆఫీస్ సమీపంలోనే మంగళవారం మధ్యాహ్న నుంచి సాయంత్రం వరకు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లు, గుడ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఇరువర్గాల కార్యకర్తలకు రక్తమోడింది. ఇంత గొడవ జరిగినా సమయానికి బలగాలను దింపి, అల్లరిమూఖలను చెదరగొట్టడంతో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీపై బీజేపీ ఢిల్లీ నాయకుడు చేసిన వ్యాఖ్యలే ఘర్షణకు దారితీశాయి. ధీటుగా స్పందించామని చెప్పుకునేందుకు ప్రభుత్వలోని ముఖ్యమైన నేతలే బీజేపీ ఆఫీస్‌పై దాడి చేయించి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. దాడుల వార్తలు జాతీయ మీడియాలో ప్రసారమయ్యాయి. బీజేపీ నేతలు కూడా గాంధీభవన్ వద్ద హంగామా సృష్టించారు.