హైదరాబాద్ జూన్ 6 (నమస్తే తెలంగాణ): నాడు ఓట్ల కోసం ఉద్యోగులకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు నట్టేట ముంచిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలను చర్చించకుండా నాన్చివేత ధోరణి అవలంబించిందని శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఐదు డీఏలు ఇస్తామని, పీఆర్సీ అమలుచేస్తామని చెప్పి, ఇప్పుడు రెండు డీఏలే ఇస్తామనడం విడ్డూరమని పేర్కొన్నారు.
ఇందులో ఒక డీఏ వచ్చే ఏప్రిల్‌లో ఇస్తామనడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనమని దుయ్యబట్టారు. రెండు నెలలు గడిస్తే మరో డీఏ ఇవ్వాల్సి ఉంటుందని, అంటే కాంగ్రెస్ సర్కారు మళ్లీ నాలుగు డీఏలను పెండింగ్‌లో పెడుతున్నదని విమర్శించారు. నెలకు రూ.500 కోట్లు కేటాయిస్తామని చెప్పి మాట తప్పిన ప్రభుత్వం, ఇప్పుడు రూ.700 కోట్లు ఇస్తామంటే నమ్మేదెలా అని ప్రశ్నించారు.