BC Reservations | హైదరాబాద్, నవంబర్25 (నమస్తే తెలంగాణ): దేశ జనాభాలో దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా ఆయా ప్రభుత్వాలు రిజర్వేషన్లను అమలు చేస్తూ వస్తున్నాయి. బీసీలకు కేవలం ఉద్యోగ, ఉపాధి రంగాలకే రిజర్వేషన్లను పరిమితం చేశారు. వాటికే చట్టబద్ధత ఉన్నది. రాజకీయ అవకాశాల్లో బీసీలకు రిజర్వేషన్లు అనేవే లేవు. అయితే స్థానిక సంస్థల్లో మాత్రం ఆర్టికల్ 243-డీ(6), ఆర్టికల్ 243-టీ(6) ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారంగా బీసీలకు రిజర్వేషన్లను కలిస్తూ వస్తున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనేది నిబంధన.
అయినప్పటికీ ‘రాష్ట్రంలో కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న 23శాతం రిజర్వేషన్లను 42 శాతానికి పెంచి 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అమలు చేస్తాం’ అని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లోనూ అంతకు ముందే ప్రకటించింది. రూ.160 కోట్లతో కులగణన నిర్వహించి, 42% రిజర్వేషన్ల అమలు కోసం అసెంబ్లీలో బిల్లులను ఆమోదించి, జీవోలను విడుదల చేసి, తీరా ఇప్పుడు వెన్నుపోటు పొడిచింది. 42% దేవుడెరుగు, గతంలో అమలైన 23% కోటాకే కాంగ్రెస్ సర్కార్ ఎసరుపెట్టింది. ప్రస్తుతం బీసీల ప్రాతినిధ్యాన్ని కేవలం 17శాతానికే పరిమితం చేసి ఆ వర్గాన్ని దారుణంగా వంచించింది.
గతంలో 2,404 స్థానాలు.. నేడు 2,176
2019 బీఆర్ఎస్ హయాంలో జిల్లా, మండల పరిషత్, గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డ్ సభ్యుల స్థానాలకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 2011 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఆ మేరకే బీసీలకు 22.79%, ఎస్సీలకు 20.53, ఎస్టీలకు 6.68% చొప్పున సీట్లను రిజర్వ్ చేశారు. ఆ ప్రకారమే ఎన్నికలు నిర్వహించారు. నాడు మొత్తం సర్పంచ్ స్థానాలు 12,687కాగా, అందులో 2,404 స్థానాలు (22.79%) బీసీలకు దక్కాయి. కానీ ప్రస్తుతం మొత్తం 12,735 సర్పంచ్ స్థానాల్లో బీసీలకు దక్కింది మాత్రం 2,176 మాత్రమే. 2019తో పోల్చుకుంటే సర్పంచ్ స్థానాలు 48 పెరగగా, బీసీల సీట్లు మాత్రం మొత్తంగా 228 వరకు కోతపడటం గమనార్హం.
7 జిల్లాల్లో 10% కూడా దాటలె
రాష్ట్ర ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా బీసీ సర్పంచ్ స్థానాలు గతంలో కంటే తక్కువ రిజర్వ్ అయ్యాయి. అది 17.08 శాతానికే పరిమితమైంది. మొత్తం 31 జిల్లాల్లో దాదాపు 7 జిల్లాల్లో బీసీల రిజర్వేషన్ 10% కూడా దాటలేదు. భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో 471 స్థానాలు ఉండగా, అందులో ఒక్కటీ బీసీలకు దక్కలేదు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 508 స్థానాలకు 136 స్థానాలే బీసీలకు రిజర్వ్ అయ్యాయి. పర్సంటేజీ ప్రకారం చూస్తే జోగుళాంబ గద్వాల జిల్లాలో బీసీలకు అత్యధికంగా 27.45 శాతం స్థానాలు దక్కాయి. కామారెడ్డి జిల్లాలోనూ గతం కంటే 8 స్థానాలు బీసీలకు తగ్గిపోవడం గమనార్హం. కామారెడ్డి జిల్లాలో 526 సర్పంచ్ స్థానాలు ఉండగా, 2019లో 131స్థానాలు బీసీలకు రిజర్వ్ అయ్యాయి. ప్రస్తుతం 123 మాత్రమే బీసీలకు రిజర్వ్ కాగా, 8 సీట్లకు కాంగ్రెస్ కోత పెట్టింది.
రేవంత్ సర్కార్‌పై బీసీల ఫైర్
బీసీల కోటాను గతం కంటే కుదించిన రేవంత్‌రెడ్డి సర్కార్‌పై నయవంచనకు పాల్పడిందని బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లను , అదికూడా బీసీ ఉపకులాల వారీగా కల్పించిన అనంతరమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అల్టిమేటం జారీచేశాయి. లేదంటే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీని పాతరేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక ఎంత మాత్రం సహించేది లేదని బీసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు పాతర: బీసీ రాజ్యాధికార సమితి
పంచాయతీలకు రిజర్వేషన్ల కేటాయింపులో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను కాంగ్రెస్ సర్కారు పాతరేసిందని, ఫలితంగా రాష్ట్రంలోని 27 మండలాల్లో కనీసం ఒక గ్రామ పంచాయతీకి కూడా బీసీ కోటా దకలేదని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ మండిపడ్డారు. లోపాలను సరిదిద్దిన తర్వాతే నామినేషన్ల ప్రక్రియ చేపట్టాలని ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
బీసీలను నమ్మించి మోసం చేసింది: వీరస్వామిగౌడ్
బీసీలను కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందని సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడసంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జకే వీరస్వామిగౌడ్ మండిపడ్డారు. రాజకీయంగా అణచివేసే కుట్రలో భాగంగానే ఇప్పుడు పార్టీ కోటా అంటున్నదని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. చట్టబద్ధంగానే 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఆ తర్వాతే స్థానిక ఎన్నికలను నిర్వహించాలని, లేదంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదని హెచ్చరించారు.
అంతన్నాడింతన్నాడే గంగరాజు.. అంతిమంగా లేదన్నాడే గంగరాజు..
బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కారు చేసిందిదే! స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి, 23,973 మందికి ప్రాతినిధ్యం కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో నాడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రెండేండ్లుగా ఊదరగొట్టి, సర్వేలు, నివేదికలు, జీవోల పేరిట హడావుడి చేసి, అమలు చేసినట్టే పోజులు కొట్టింది. రాజ్యాంగ సవరణ అంటూ ఊదరగొట్టి.. ఢిల్లీ ధర్నాలంటూ డ్రామాలాడింది. పార్టీ కోటా అంటూ చివరికిదాకా సాగదీసి.. ఇప్పుడు బీసీ కోటాను కాటగలిపింది. గతంలో ఉన్న 23% కోటాను కూడా ఇవ్వకుండా కోత పెట్టి బడుగులకు వెన్నుపోటు పొడిచింది. పంచాయతీ స్థానాల్లో కేవలం 17.08 శాతానికి బీసీల ప్రాతినిధ్యాన్ని కుదించిన కాంగ్రెస్.. తన నయవంచన నైజాన్ని చాటుకున్నది. నిలువునా ముంచిన రేవంత్ ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాలు, కులసంఘాలు, మేధావులు నిప్పులు చెరుగుతున్నారు.
