నాంపల్లి క్రిమినల్ కోర్టులు, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే అక్రమ కేసులు బనాయించి పోలీసులు చిత్రహింసలకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి కొణతం దిలీప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ హైకోర్టు స్పష్టంగా తనకు రిలీఫ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసినా పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. నాంపల్లి కోర్టు ప్రాంగణంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై కేసులు నమోదు చేయడమే తప్పనీ, వరుసగా కేసులు నమోదు చేసి నిర్బంధిస్తున్నారని ఆరోపించారు.
హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా తనను నిర్భందంలోకి తీసుకున్నారని తెలిపారు. ‘నా మీద పెట్టిన ఏ ఆరోపణలను నేను ఓప్పుకోవట్లేదు. నేనేమీ నేరం చేయలేదు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే కేసులు పెడుతున్నారు అని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా ఇట్లే పోరాడుతా’ అని తేల్చిచెప్పారు. పోలీసులు బలవంతంగా వాహనంలోకి ఎత్తుకెళ్తున్న సమయంలో జై తెలంగాణ అంటూ నినాదం చేస్తూ వాహనంలో కూర్చున్నారు.