తెలంగాణ రైతన్నపై కాంగ్రెస్ కత్తిగట్టిందా? ఇప్పుడిప్పుడే తెరిపినపడుతున్న వ్యవసాయంతో ముఖం తెల్లగైన అన్నదాతను మళ్లీ ఆగం పట్టించాలనుకొంటున్నదా? కేసీఆర్‌ను ఎదుర్కొనే క్రమంలో రాష్ట్ర రైతాంగంపై పగ పెంచుకున్నదా? కొద్దిరోజులుగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు దీనినే బలపరుస్తున్నాయి. రైతుల్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ చేస్తున్న వరుస దాడులు.. సాగునే కాదు, రాష్ట్ర భవితనూ దెబ్బతీసేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకటికాదు, రెండు కాదు.. 24గంటల ఉచిత విద్యుత్తు మొదలుకొని రైతుబంధు వరకు అన్నింటిపైనా కాంగ్రెస్ ముఖ్యనాయకులు వ్యూహాత్మకంగా విషం చిమ్ముతున్నట్టు తెలుస్తున్నది. రెండునెలలుగా వారు చేస్తున్న వాఖ్యలు దీనినే ధ్రువపరుస్తున్నాయి.
– స్పెషల్టాస్క్ బ్యూరో
మూడు గంటల కరెంటు
తెలంగాణలో ఎక్కువగా ఉన్నవి చిన్న కమతాలే. వ్యవసాయానికి గంటసేపు కరెంటు ఇస్తే ఒక ఎకరం పొలం తడుస్తది. రైతులకు మూడునాలుగు గంటల కరెంటు సరిపోతుంది. 24 గంటల కరెంటు అవసరం లేదు.
-రేవంత్‌రెడ్డి (11.07.2023)
10 హెచ్‌పీ మోటర్లు
బావులు, బోర్లకు 10 హెచ్‌పీ మోటర్లు బిగించుకొంటే మూడు గంటల్లో పొలం పారుతుంది. కాబట్టి, పొలం తడిపేందుకు రైతులు 10 హెచ్‌పీ మోటర్లు బిగించుకోవాలి.
-రేవంత్‌రెడ్డి (14.11.2023)
ధరణి రద్దు
ధరణిపై ఫిర్యాదులు వస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని రద్దుచేస్తాం. దాన్ని బంగాళాఖాతంలో పడేస్తాం.
-భట్టి విక్రమార్క (26.05.2023)
రెవెన్యూ రివర్స్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో భూమాత తెస్తాం. ఇప్పుడున్న ధరణి ఒక సాఫ్ట్వేర్. ఇందులో పట్టాదార్ కాలం ఒక్కటే ఉన్నది. దాన్ని మొత్తం తీసేస్తాం. భూమాత పోర్టల్‌లో పాత రెవెన్యూ రికార్డుల్లో ఉన్న కాలమ్స్ అన్నీ మళ్లీ చేరుస్తాం.
-భట్టి విక్రమార్క (17.11.2023)
రైతుబంధు దుబారా!
రైతులకు రైతుబంధు ఇవ్వడం దుబారా ఖర్చు. తెలంగాణ ప్రజల అమూల్యమైన సొమ్మును, పన్నుల ద్వారా కట్టే పైసలను కేసీఆర్ రైతులకు రైతుబంధు రూపంలో ఇస్తూ దుబారా చేస్తున్నారు.
-ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (26.10.2023)
రైతుబంధుకు మోకాలడ్డు!
రైతుబంధు డబ్బులు జమ కాబోతున్నాయని ఆలేరు ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే. దీనిపై ఈసీ చర్య తీసుకోవాలి. (ఈసీకి లేఖలో..)
-నిరంజన్ (26.11.2023)
కౌలుదారు చట్టం
2011లో కాంగ్రెస్ పార్టీ కౌలుదార్ల చట్టం తీసుకొచ్చింది. దాని ప్రకారం.. రైతు భరోసా కోసం కౌలుదార్లను గుర్తిస్తం. యజమాని, కౌలుదారు ఏదైతే మాట్లాడుకుంటారో అదే కౌలుదారు ఒప్పందం.
-రేవంత్ రెడ్డి (25.11.2023)
గ్రామసభల్లో కౌలు ఒప్పందాలు!
రైతు భరోసా లబ్ధిదారుల కోసం గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతాం. కౌలుదార్లు ఎవరు? ఏ భూమి కౌలుకు తీసుకొన్నరు? వారి కౌలు ఒప్పంద పత్రాలను పరిశీలిస్తం. గ్రామ సభల్లో కౌలు ఒప్పందాలు ఆమోదించిన తర్వాతే రైతు భరోసాపై ముందుకు వెళ్తాం.
-రేవంత్ రెడ్డి (25.11.2023)
రైతు భరోసా ఒక్కరికే!
రైతు భరోసా సాయం రైతు (భూ యజమాని)కు వస్తే కౌలు రైతుకు రాదు. కౌలు రైతుకు వస్తే, రైతుకు రాదు. యజమాని, కౌలుదారుల్లో ఎవరో ఒక్కరికే రైతు భరోసా ఇస్తాం.
-రేవంత్ రెడ్డి (25.11.2023)
మన కరెంటు కర్ణాటకకు!
హైదరాబాద్‌లోని ఫాక్స్‌కాన్ కంపెనీని కర్ణాటకకు తరలించుకుపోయేందుకు ప్రయత్నించినట్టుగానే, లోపాయికారి ఒప్పందాలతో కర్ణాటకకు తెలంగాణ విద్యుత్తును తరలించుకుపోయేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నది. కాంగ్రెస్‌పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి ఒప్పందాలే జరిగాయి.
-రాజకీయ విశ్లేషకులు (26.11.2023)