పరకాల, నవంబర్ 5: ఎన్నికల ప్రచార సరళిలో కాంగ్రెస్ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారు. తమ ఎన్నికల ప్రచారానికి ప్రజాదరణ లేకపోవడంతో ఇతర పార్టీలపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. కావాలని కవ్విస్తూ.. శాంతిభద్రతల సమస్యలకు తెరలేపుతున్నారు. హనుమకొండ జిల్లా పరకాలలో బీఆర్ఎస్ ప్రచార రథంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణంలో ఆదివారం ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్లో కార్నర్ మీటింగ్ నిర్వహించింది.
కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి మాట్లాడుతుండగా అటువైపుగా బీఆర్ఎస్ ప్రచార వాహనం వచ్చింది. ప్రజలు వాహనం వెళ్లేందుకు దారి ఇస్తున్న క్రమంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి బీఆర్ఎస్ ప్రచార వాహనాన్ని అడ్డుకొని దాడికి యత్నించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టేందుకు యత్నించగా దురుసుగా ప్రవర్తించారు.
ఎస్సై రమేశ్నాయక్ కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టి ప్రచార వాహనాన్ని అక్కడి నుంచి పంపిస్తుండగా.. మరికొంత మంది ప్రచార రథం వద్దకు చేరుకొని వాహనంపై ఉన్న ఫ్లెక్సీని చించివేశారు. ఎన్నికల ప్రచారంలోనే ఇన్ని ఆగడాలు, గూండాయిజం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు.. అధికారంలోకి వస్తే ఇంకెన్ని అరాచకాలు చేస్తారోనని అక్కడే ఉన్న స్థానికులు చర్చించుకోవడం వినిపించింది.