CM Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): అదానీతో ఒప్పందాల వ్యవహారంలో సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం గట్టిగానే క్లాస్ పీకినట్టు తెలిసింది. రేవంత్‌రెడ్డికి శుక్రవారం ఫోన్ చేసిన అధిష్ఠానం పెద్దలు గట్టిగానే హెచ్చరికలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ‘ఇదేం పద్ధతి?’ అని ఘాటుగానే వ్యాఖ్యానించినట్టు తెలిసింది. తామేమో జాతీయ స్థాయిలో అదానీ అక్రమాలపై కొట్లాడుతుంటే.. నువ్వేమో రాష్ట్రంలో ఆయనతో కుమ్మక్కవుతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ‘మేం అదానీపై ప్రశ్నిస్తుంటే.. బీజేపీ నేత లు నీ ఒప్పందాలను చూపుతున్నారు. మేం ఏం సమాధానం చెప్పాలి. మా ము ఖం ఎక్కడ పెట్టుకోమంటావ్.’ అంటూ మండిపడినట్టు తెలిసింది. వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిసింది.
రేవంత్ తీరుతో ఇరకాటం
సీఎం రేవంత్‌రెడ్డి తీరుతో కాంగ్రెస్ అధిష్ఠానం ఇరకాటంలో పడింది. ఓవైపు రా హుల్‌గాంధీ జాతీయస్థాయిలో అదానీ-మోదీ అవినీతిని ఎండగడుతుంటే.. ఇక్క డ మాత్రం రేవంత్‌రెడ్డి అదానీతో అంటకాగుతూ ఒప్పందాలు చేసుకున్నారు. దావోస్‌లో అదానీతో భేటీ అయిన రేవంత్‌రెడ్డి రూ.12,400 కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఇటీవల అదానీ నుంచి స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం అందుకున్నారు. అంతకుముందు అదానీ కుమారుడు కరణ్ అదానీతోనూ రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. మ రో మంత్రి పొంగులేటి అదానీతో, అదానీ కొడుకుతో కూడా రహస్యంగా భేటీ అయినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం పరిస్థితి కుడితిలో పడిన ఎలకలా తయారైంది. అదానీపై అమెరికాలో కేసు నమోదుతో.. బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్నది. కాంగ్రెస్ చేస్తున్న వి మర్శలకు బీజేపీ నేతలు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అదానీతో చేసుకున్న ఒప్పందాలను చూపుతూ కౌంటర్ ఇస్తున్నారు. దీం తో అధిష్ఠానం ఇరకాటంలో పడింది.
ప్లేట్ ఫిరాయించిన నేతలు..
మొన్నటివరకు అదానీతో రేవంత్‌రెడ్డి చేసుకున్న ఒప్పందాలను సమర్థించిన కాంగ్రెస్ కీలక నేతలు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు. చట్టవిరుద్ధంగా ఉంటే అదానీ ఒప్పందాలను రద్దు చేస్తామని, రాహుల్ మాటే తమ మాట… ఆయన బాటే తమ బాట అంటూ సూక్తులు చెప్తున్నారు. అదానీతో ఒప్పందాలపై వరుస ప్రెస్మీట్లు పె డుతున్నారు. గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అదానీపై అంశంపై మాట్లాడగా… శుక్రవారం టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టారు. మొన్నటివరకు అదానీతో ఒప్పందాలను సమర్థించిన వీరంతా ఇప్పుడు ఖండించే విధంగా మాట్లాడడంపై కాంగ్రెస్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.