
తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తొలినాళ్లలో పాలమూరుకు జలసాధన లక్ష్యంగా 2003 మే 20-25 వరకు కేసీఆర్ అలంపూర్ నుంచి గద్వాల వరకు పాదయాత్ర చేపట్టారు. అలంపూర్‌లో పాదయాత్ర ప్రారంభం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న కేసీఆర్, సభకు అశేషంగా తరలివచ్చిన పాలమూరు ప్రజానీకం

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో నీటిని తొలుత అంజనాగిరి (నార్లాపూర్) రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు, తర్వాత వట్టెం, కరివెనకు తరలించాల్సి ఉంటుంది. రిజర్వాయర్లు, కాలువలు పూర్తయ్యాయి. నార్లాపూర్- ఏదుల మార్గంలో 800 మీటర్ల మేర రాయి తొలగింపు పనులు రెండేండ్లుగా కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో పెండింగ్‌లో ఉన్నాయి.
హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడమే తెలంగాణకు పెనుశాపమైందని, మరీ ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్రాతి తీవ్రమైన అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టంచేశారు. పాలమూరుకు తీరని ద్రోహం చేసింది ఆ రెండు పార్టీలేనని మండిపడ్డారు. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత 20 ఏండ్లు పాలించిన తెలుగుదేశం పార్టీ పాలమూరును తిరిగి కోలుకోలేని దెబ్బకొట్టాయని ధ్వజమెత్తారు. జిల్లా మొత్తం కృష్ణా నది పారుతున్నా ఆ జిల్లాకు నీళ్లివ్వకుండా ఎండబెట్టారని, కరువు జిల్లాగా మార్చారని నిప్పులు చెరిగారు. కృష్ణా నది పారే జిల్లాను గంజి కేంద్రాలు పెట్టే జిల్లాగా మార్చారని నిప్పులు చెరిగారు. అప్పటికే మంజూరైన ప్రాజెక్టులను ఎస్ఆర్సీ నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వాలు రద్దు చేశాయని తెలిపారు.
ఆదివారం తెలంగాణ భవన్లో కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే ‘పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో తెలంగాణకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్న ద్రోహం, తలపెట్టిన దుర్మార్గం.. అన్యాయం గురించి చాలా మందికి తెలియదు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత దారుణ వివక్షకు గురైన జిల్లా పాత మహబూబ్‌నగర్. వనరులు లేక కాదు.. వసతులు లేక కాదు. కృష్ణా నది ప్రవేశించేదే మహబూబ్‌నగర్ జిల్లాలో. ఈ జిల్లాలో అత్యధికంగా 308 కిలో మీటర్ల దూరం కృష్ణానది పారుతుంది. అయినా 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, ఆ తర్వాత 20 ఏండ్లు పాలించిన తెలుగుదేశం పార్టీ పాలమూరుకు తీరని అన్యాయం చేసినయ్. అప్పర్ కృష్ణా, భీమా, తుంగభద్ర ఎడమకాలువ ప్రాజెక్టు ద్వారా 174 టీఎంసీల నీళ్లు పాలమూరు జిల్లాకు రావాల్సి ఉండె.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడమే తెలంగాణ పాలిట పెనుశాపమైంది. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్రాతి తీవ్రమైన అన్యాయం జరిగింది. స్టేట్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ (ఎస్ఆర్సీ)లో ప్రతిపాదించి, ఇప్పటికే పనులు జరుగుతున్న ప్రాజెక్టులను మార్చకూడదని, వాటిని తప్పనిసరిగా కొనసాగించాలని చట్టం ఉన్నా వాటన్నింటిని పక్కనపెట్టిండ్రు. దేవునూరు, ఇచ్చంపల్లి ఇట్ల అనేక ప్రాజెక్టులను రద్దు చేసిండ్రు. మహబూబ్‌నగర్‌కు ఇచ్చే పాలమూరు ఎత్తిపోతల పథకం కొత్త స్కీం కాదు. గతంలోనే 174 టీఎంసీల నీళ్లతో ప్రాజెక్టులకు రూపకల్పన జరిగింది. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ వస్తే కూడా ఆ ట్రిబ్యునల్‌ను కలిసి చాలా ప్రయత్నాలు చేసినం. ఉద్యమ సమయంలో ఉపన్యాసాలు, జల సాధన ఉద్యమ సందర్భంలో క్యాసెట్లు, కరపత్రాలు, పోస్టర్ల రూపంలో చాలా రకాలుగా మా గొంతు వినిపించినం. అయితే ట్రిబ్యునల్ అనేది రాష్ర్టాల మధ్య పంచాయితీలు తీరుస్తది. కానీ ఒక రాష్ట్రంలోపల ప్రాంతాల మధ్య వివాదాలను పట్టించుకోదు.
బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటైనప్పుడు నీటి పంపకాలు చేసిండ్రు. అందులో పలు కీలక అంశాలు పొందుపరిచిండ్రు. బచావత్ సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి .. ఆయనే స్వయం గా ఈ ప్రాంతంపై ఆందోళన వ్యక్తంచేసిండ్రు. ఈ ప్రాంతం నిజంగానే తీవ్ర నిరాదరణకు గురైంది. ఇప్పటికీ అవుతూనే ఉన్నది అన్నరు. ఇక్కడ మరో విపత్కర, దుర్భర పరిస్థితేందంటే.. అప్పుడు పాలమూరు గురించి గంటె డు నీళ్లు అడిగేవాడే లేడు. కరువు జిల్లాకు నీళ్లు కేటాయించాలని అడిగేవాళ్లే లేరు. ఇది ఆనాటి సమైక్య ప్రభుత్వం చేసిన ద్రోహం. పాలమూరు గోసను చూసిన బచావత్.. సమైక్య ప్రభుత్వం ప్రతిపాదించకపోయినా సుమోటోగా స్వీకరించి 17 టీఎంసీల నీళ్లను జూరాల ప్రాజెక్టుకు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించిండ్రు. ఈ జూరాల ప్రాజెక్టును ఇక్కడి నుంచి (మహబూబ్‌నగర్) తరలించకుండా చేయా లి, ఇక్కడే కట్టి తీరాలి. అందుకే 17 టీఎంసీలు కేటాయిస్తున్నట్టు కండీషన్ పెట్టిండ్రు. ఈ విషయాల్ని ట్రిబ్యునల్‌లోనూ రికార్డు చేసిండ్రు.
1974లో బచావత్ ట్రిబ్యునల్ నీళ్లు కేటాయిస్తే ఆ తర్వాత జూరాల ప్రాజెక్టును ముట్టినోడు లేడు.. పట్టినోడు లేడు. సీఎంగా అంజయ్య వచ్చి శంకుస్థాపన చేసిండ్రు. అది తెలంగాణ ప్రాజెక్టు కాబట్టి దాని గురించి మాట్లాడినోడు లేడు.. దానికి అయ్యలేడు.. అవ్వలేడు కాబట్టి అనాథలా బరాజ్ వరకు కట్టి వదిలేసిండ్రు. దానికి కాల్వలు తవ్వలే.. నీళ్లు రావు.. పొలాలు పారేదిలేదు. కృష్ణా నది నీళ్లు వచ్చినై వచ్చినట్టే పోతుంటయ్. ఈ తతంగం 2001లో గులాబీ జెండా ఎగిరే వరకు కొనసాగింది. ఇక్కడ ఇంకా గమ్మతైన విషయం ఏందంటే అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకున్నరు. అది చేస్తా, ఇది చేస్తా, పొడిచేస్తా అని మాటలు చెప్పి ఇష్టమొచ్చినన్ని పునాది రాళ్లు వేసిండ్రు.
ఉద్యమంలో నేను ఈ పునాది రాళ్లపై ప్రశ్నించేది. ఈ పునాది రాళ్లన్నీ ఎందు కు? చూసుక మురుసుడు, పట్టుక ఏడ్చేందుకా? అని నిలదీసే వాడిని. వీటితో ఏం లాభం? కనీసం ఈ శంకుస్థాపన రాళ్లన్నీ తీసుకెళ్లి కృష్ణా నదిలో అడ్డమేస్తే ఓ చెక్ డ్యామ్ అయితదని చెప్తే ప్రజలు నవ్వేవాళ్లు. చుక్క నీళ్లు కూడా పొలాలకు రాలేదు. దీని ఫలితంగా పాలమూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి ఇలా అన్ని తాలూకాల నుంచి బొంబాయికి డైరెక్ట్ బస్సులు నడిపేవాళ్లు. ప్రజలు పొట్ట చేతపట్టుకొని వలస పోవడం తప్ప గతిలేదు. ఆ జిల్లా నుంచి అనేక మంది కవులు అనేక పాటలు రాసిండ్రు. గోరటి వెంకన్న ‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా’ అనే పాట రాసిండ్రు. తెలంగాణ ఉద్యమంలో మోగిన పాట అది.
సమైక్య రాష్ట్రంలోనే సమగ్రాభివృద్ధి అంటూ చంద్రబాబు నాయడు అప్పట్లో స్లోగన్ ఇచ్చిండ్రు. మహబూబ్‌నగర్ టౌన్లో భారీ స్థాయిలో ప్రథమ మహాసభ పెట్టినం. దాదాపు 70-80 వేల మంది ఆ సభకు వచ్చిండ్రు. జూరాల ప్రాజెక్టులో కొంత ముంపు ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. రూ.13 కోట్లు ఆ రాష్ర్టానికి పరిహారం కింద ఇవ్వాల్సి ఉండె. కానీ చంద్రబాబు ఆ డబ్బులు కట్టడం లేదు. ఒక్క రూపాయి కట్టడం లేదు. దీంతో ఆ సభలో నాకు బాగా కోపం వచ్చి ఏమయ్యా చంద్రబాబు నాయుడూ? పాలమూరును దత్తత తీసుకున్నవు. డైలాగులు చెప్తున్నవు. ఇక్కడ జనాలు సచ్చిపోతున్నరు.
ముంబయికి వలస పోతున్నరు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కర్ణాటకకు కట్టేందుకు నీ దగ్గర డబ్బుల్లేవా? ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి అంటే? గోడలెక్క బరాజ్ కట్టి వదిలేస్తే చూసుకుంటూ ఉండాల్నా అని ప్రశ్నించిన. నా విమర్శలకు, ప్రశ్నలకు, నా దాడికి తట్టుకోలేక నాడు చంద్రబాబు నాయుడు మొకాళ్లమీద పరుగెత్తి మరీ కర్ణాటకకు పరిహారం డబ్బులు చెల్లించిండు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఆర్డీఎస్ వద్ద బాంబులు పెట్టి పేల్చేసిండు. రెండు, మూడు సార్లు బాంబులు పెట్టి పేల్చిన విషయం అందరికీ తెలుసు.
తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత ఉద్యమంలో నేను ఎంచుకున్న ఎజెండాలో మొదటిది జోగులాంబ-గద్వాల పాదయాత్ర. ఈ అన్యాయం సంగతిని ప్రజల్లో ఎండగట్టాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు చేస్తున్నామో లోకానికి తెలువాలని జోగులాంబ నుంచి గద్వాలకు పాదయాత్ర చేసిన. 85 వేల ఎకరాలకు నీళ్లు పారాల్సిన ఆర్డీఎస్ కెనాల్ 10 వేలు, 20 వేల ఎకరాలకు తగ్గిపోయింది. అయినా అడిగే నాథుల్లేడు. అయితే ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ కర్ణాటకలో రాయచూర్ దగ్గర ఉంటయి. ఉమ్మడి పాలమూరు నాయకులతో కలిసి మేమంతా అక్కడికి వెళ్లి ఆ కాలువ మొత్తం తిరిగి ఆర్థం చేసుకొని ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినం. ఆ తర్వాత మళ్లీ గొడవ చేస్తే జూరాల టు ఆర్డీఎస్కు లింక్ కెనాల్ మొదలు పెట్టారు. ఇట్ల చంద్రబాబు నాయుడు ప్రతిసారీ తెలంగాణ ప్రజలను ఏమార్చడం, డ్రామా చేయడం తప్ప ప్రాజెక్టులు పూర్తి చేసింది లేదు.. చుక్క నీళ్లు వచ్చింది లేదు.
గమ్మతైన విషయం ఏందంటే అప్పటి సీఎం చంద్రబాబు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నరు. అది చేస్తా.. ఇది చేస్తా.. పొడిచేస్తా.. అని మాటలు చెప్పి ఇష్టమొచ్చినన్ని పునాది రాళ్లు వేసిండ్రు. ఉద్యమంలో నేను ఆ పునాది రాళ్లపై ప్రశ్నించేది. ఈ పునాది రాళ్లన్నీ ఎందుకు? చూసుక మురుసుడు, పట్టుక ఏడ్చేందుకా? అని నిలదీసే వాడిని. వీటితో ఏం లాభం? కనీసం ఈ శంకుస్థాపన చేసిన రాళ్లన్నీ తీస్కపోయి కృష్ణానదికి అడ్డమేస్తే ఓ చెక్ డ్యాం అయితదని చెప్పిన.
-కేసీఆర్
అలా కొట్లాడుతూ పోయినం.. ప్రజలు కలిసి వచ్చిండ్రు.. సందర్భం కలిసి వచ్చింది.. తెలంగాణ అదృష్టం బాగుండి రాష్ట్రం ఏర్పడింది. పాలమూరు జిల్లా దరిద్రం, ఆ దరిద్రంలోకి పాలమూరు నెట్టివేయబడ్డ పరిస్థితి. అందుకే నేను ఎప్పుడూ మొత్తుకునేటోడిని.. తెలంగాణ వెనుకబడిన ప్రాంతంకాదు. వెనుక పడేయబడ్డ ప్రాంతం. వెనుకకు నెట్టివేయబడ్డ ప్రాంతంమని చాలాసార్లు చెప్పిన. ఈ కరువు పరిస్థితి ఎక్కడి వరకు వెళ్లిందంటే.. ఎండకాలం వచ్చిందంటే పాలమూరు కేంద్రాల్లో గంజి కేంద్రాలు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. దీన్ని చూసి మేమంతా ఓ రోజు ఏడ్చినం. తిండి దొరక్క ముసలోళ్లు చచ్చిపోయేటోళ్లు. కమ్యునిస్టులు, ఇతరులు కొందరు గంజి కేంద్రాలు పెట్టి కడుపు నింపేటోళ్లు. 308 కిలోమీటర్ల కృష్ణా నది పారే ఈ జిల్లాలో ఇంత దారుణ పరిస్థితులు ఏర్పడ్డయి. సీఎం దత్తత ప్రాంతమైనా ఏమీ ఇవ్వలే. ఇక అందంగా ఈ ప్రాజెక్టులకు ‘పెండింగ్ ప్రాజెక్టులు’ అనే టైటిల్ పెట్టిండ్రు. ఇదేదో గొప్పతనంలెక్క! పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలో వాటిని తోచేసే పాలమూరు పరిస్థితిని దిగజార్చిండ్రు.
రాష్ట్రం వచ్చిన తర్వాత నదులు, ప్రాజెక్టులపై మొత్తం సమీక్ష చేసినం. గోదావరి ఏంది? కృష్ణా ఏంది?, మనకు రావాల్సిన వాటా ఎంత? దగా జరిగింది ఎక్కడ? ఎలా ముందుకెళ్లాలి? ఏం చేయాలనే దానిపై తీవ్రంగా మథనపడ్డం. ఇక్కడ అత్యంత భయంకరమైన కరువు ఉన్నది కాబట్టి పాలమూరు జిల్లాను టాప్ ప్రయారిటీలో ఆదుకోవాలని నిర్ణయించినం. మొదట యుద్ధ ప్రాతిపదికన చంద్రబాబు పేరు పెట్టిన పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్‌లో పెట్టినం. నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ఇలా అన్ని ప్రాజెక్టులను లైన్లోకి తీసుకొచ్చి పనులు మొదలుపెట్టినం. మా ప్రభుత్వంలోనే వీటి ద్వారా జిల్లాలో నికరంగా 6.5 లక్షల ఎకరాలకు సాగు నీళ్లు అందించినం. అంతకు ముందు కనీసం 30 వేల ఎకరాలకు కూడా పారకం లేదు.
పాలమూరుకు వలసల జిల్లా అని పేరెందుకు వచ్చింది? ప్రజలు ఎందుకు వలస పోతరు? ఎంత బాధ, ఎంత దుఃఖం ఉంటే పోతరు? మిషన్ కాకతీయపథకంలోనూ టాప్ ప్రయార్టీ ఇచ్చి మైనర్ ఇరిగేషన్లో వాటి సామర్థ్యం పెంచి 1.5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు ఉపయోగపడింది. చాలా వాగులపై వందల సంఖ్యలో చెక్‌డ్యాంలు నిర్మించినం. ఇక ఆర్డీఎస్ కెనాల్ది మోసం జరిగింది కాబట్టి మధ్యలో తుంగభద్రపై పెట్టి తుమ్మిళ్ల లిఫ్ట్ పెట్టించి పూర్తి చేసినం. నీళ్లు పారిచ్చినం’ అని ఈ సందర్భంగా కేసీఆర్ వివరించారు.