నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, ఏప్రిల్ 29: రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సొంతంగా చేయించుకునే సర్వేల్లోనూ బీఆర్ఎస్కు అనుకూలంగానే ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం వెంకటాపురంలో శనివారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. ఏ రకంగా చూసినా కాంగ్రెస్, బీజేపీకి కలిపి కనీసం 20 సీట్లు కూడా రావని తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మున్ముందు దేశరాజకీయాల్లో చక్రం తిప్పుతారని చెప్పారు. యావత్ దేశం కేసీఆర్ పాలన కోరుకుంటున్నదని పేర్కొన్నారు. అందుకు ఇటీవల మహారాష్ట్రలో నిర్వహించిన బీఆర్ఎస్ సభలే నిదర్శనమని అన్నారు. ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ హైదరాబాద్‌లోని అభివృద్ధిని చూసి ఒకింత ఆశ్చర్యపోయారని, స్వయంగా ఇటీవల ఓ సభలో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. సమావేశంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే సమన్యాయం
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలు, ప్రాంతాల వారికి సమన్యాయం జరుగుతుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని ఠాగూర్ స్టేడియంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి విప్ బాల్క సుమన్, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. సింగరేణి సంస్థను అమ్మేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికే మోదీ సర్కారు దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతూ వస్తున్నదని, అందులో భాగంగానే లాభాల్లో ఉన్న సింగరేణిని..
నష్టాల్లో ఉన్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేట్‌పరమైతే రిజర్వేషన్లు రద్దవుతాయని, ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ రామకృష్ణాపూర్ పట్టణాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నామని, గడిచిన నాలుగున్నరేండ్లలో రూ.203.50 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కప్రాయిపల్లి గ్రామంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా ఇన్చార్జి యాదవరెడ్డి, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.