హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రెండు ప్రధాన జాతీయ పార్టీలు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఒకటి రెండేండ్లుగా రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిని నియమించలేకపోగా, మరొకటి ఏడాదిన్నర నుంచి ధైర్యంగా మంత్రివర్గాన్ని విస్తరించలేకపోతున్నది. ఆ రెండు పార్టీలు ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ‘ఢిల్లీ’ ఆదేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముహుర్తాలు మారుతున్నాయే తప్ప.. మోక్షం కలగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్ణయాల్లో నాన్చివేత ధోరణిపై రెండు పార్టీల్లోనూ కార్యకర్తలు, నేతలు అసహనం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. రాష్ట్ర నేతలు కాళ్లు అరిగేలా ఢిల్లీ చుట్టు తిరుగుతున్నా.. ఇప్పుడు అప్పుడు అంటూ నాన్చడమే తప్ప నిర్ణయాలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధ్యక్ష పదవి కోసం బీజేపీ నేతలు, మంత్రివర్గ విస్తరణ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి క్యూ కడుతున్నారు.
రెండేండ్లయినా తేలని బీజేపీ కొత్త సారథి…
బండి సంజయ్ తరువాత ఆయన స్థానంలో 2023, జూలైలో రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని తాత్కాలిక ప్రాతిపదికన బీజేపీ అధిష్ఠానం నియమించింది. త్వరలోనే కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని ప్రకటించింది. కిషన్‌రెడ్డి కూడా తాను టైమ్ గ్యాప్ కోసమే వచ్చానని, రెండు మూడు నెలల్లో కొత్త అధ్యక్షుడు వస్తారని వెల్లడించారు. మరో రెండు నెలలు గడిస్తే కిషన్‌రెడ్డి అధ్యక్షుడై రెండేండ్లు గడుస్తాయి. రోజుకో వివాదం.. రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తుండటంతో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై బీజేపీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతున్నది. బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ మధ్య పోటీ నెలకొన్నట్టు తెలుస్తున్నది. వారిలో ఎవరికి పదవి కట్టబెట్టినా ఇతరులు సహకరించే పరిస్థితి ఉండదని, దీంతో కొత్త వివాదానికి తెరతీసినట్లవుతుందని అధిష్ఠానం భావిస్తున్నదని సమాచారం.
మంత్రివర్గాన్ని విస్తరించలేని కాంగ్రెస్
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావొస్తున్నది. కానీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఇంకా ఆరు పదవులను భర్తీ చేయాల్సి ఉన్నది. దీనిపై నేడో రేపో మంత్రివర్గ విస్తరణ అంటూ ఏడాదిన్నర నుంచి ప్రచారం సాగుతున్నా.. కార్యరూపం మాత్రం దాల్చడం లేదు. గత నెలలో మంత్రివర్గ విస్తరణకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఏప్రిల్ 3వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారమే మిగిలింది అని ప్రచారం చేశారు. కానీ అదంతా ఉత్తదేనని తేలిపోయింది. ఆశావాహులు ఎక్కువగా ఉన్నారని, ఒకరిపై వ్యతిరేకంగా మరొకరు లేఖలు రాశారనే సాకుతో విస్తరణను పక్కకు పెట్టినట్టు తెలిసింది. ఈ విధంగా జనవరి కానుక, సంక్రాంతి కానుక, చివరికి ఉగాది కానుక కూడా అందకుండా పోయింది. ఈ విధంగా ముహుర్తాలు మారుతున్నాయి… పండుగలు పోతున్నాయే తప్ప ఆశించిన వారికి మంత్రి పదవి మాత్రం దక్కడం లేదు.
పదవులే భర్తీ చేయలేనోళ్లు.. పరిపాలన ఏం చేస్తరు ?
బీజేపీ, కాంగ్రెస్ తీరుపై అన్ని వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. పార్టీలో త్వరగా నిర్ణయాలు తీసుకోలేని వీళ్లు రాష్ట్రంలో పరిపాలన ఏం చేస్తారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధ్యక్షుడిని నియమించేందుకు రెండేళ్లు, మంత్రివర్గ విస్తరణ చేసేందుకు ఏడాదిన్నర పడుతుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వీరికి రాష్ట్రంలో అధికారం ఎందుకు అని నిలదీస్తున్నారు. చీటికి మాటికి ఢిల్లీ నిర్ణయంపై ఆధారపడే పార్టీలు.. ఇక్కడ ప్రజలకు స్వతంత్రంగా సేవలు ఎలా అందిస్తారని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.