డోర్నకల్: కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సాగు నీటిపై పన్నులు వసూలు చేస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో నీళ్లపై పన్నులను రద్దు చేసిందని, దేశంలో నీటి తీరువా వసూలు చేయనిది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనేనని సీఎం కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా డోర్నకల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. కాబట్టి ప్రజలు బాగా ఆలోచించి మేలు చేసే పార్టీకే ఓటేయాలని కోరారు.
‘ప్రజల సంక్షేమం కోసం పెన్షన్లు పెంచుకున్నం. కళ్యాణ లక్ష్మి పెట్టుకున్నం. అమ్మ ఒడి వాహనాలు పెట్టుకున్నం. ప్రసవానికి డబ్బులు ఇస్తున్నం. కేసీఆర్ కిట్లు ఇస్తున్నం. రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టుకున్నం. వాటిని కాలేజీలు చేసుకున్నం. ఇట్ల అనేక కార్యక్రమాలు చేసినం. రైతుల కోసం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినం. దాంతో ఇయ్యాల కాలువల్లోకి నీళ్లు వస్తున్నయ్. మీ వెన్నవరం కాలువ అయితదని ఎవడూ అనుకోలే. ఏ కాంగ్రెసోడూ ఆ ఆలోచన చేయలే. మీ రెడ్యా నాయక్, మహబూబాబాద్ శంకర్ నాయక్ నా వెంటబడి పట్టుబట్టి దాన్ని మంచిగ చేసిండ్రు. వెన్నవరం కాలువతోటి ఇయ్యాల డోర్నకల్ నియోజకవర్గం మొత్తం బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నయ్. ఆ నీళ్లపై మీకు పన్నులు లేవు. కాంగ్రెస్, బీజేపీ పాలించే ప్రతి రాష్ట్రంలో నీటి పన్నులు ఉన్నయ్. కానీ ఒక్క తెలంగాణలనే నీటి తీరువా లేదు’ అని చెప్పారు.
రైతుబంధు వేస్ట్ అనే కాంగ్రెస్ గెలిస్తే మనం మునిగిపోతం
‘అంతేగాదు, మోటార్లు కాలిపోయేటట్టు గాకుండా 24 గంటలు మంచిగా ఉచిత కరెంటు ఇస్తున్నం. రైతుబంధు ఇస్తున్నం. రైతులు పండించిన పంటను 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి కొంటున్నం. ఇవన్నీ మీ కండ్ల ముందు జరిగినయ్. కంటి వెలుగు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మూడు కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించి 80 లక్షల మందికి కండ్లద్దాలు పంపిణీ చేసినం. మరె 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనల ఇలాంటి ఆలోచన చేసిండ్రా..? ఇది మీరు ఆలోచించాలి. కాంగ్రెస్ నాయకులు రైతుబంధు దుబారా అంటున్నరు. రైతుబంధు దుబారనా..? దుబారా కాదు గదా..? కాబట్టి ఇక్కడ రెడ్యా నాయక్‌ను గెలిపించండి రైతుబంధును ఎకరానికి రూ.16 వేలు చేస్తం. యుద్ధం చేసేటోని చేతులనే కత్తి పెట్టాలె. కత్తి ఒగని చేతుల పెట్టి యుద్ధం ఒగన్ని చేయమంటే అయితదా..? రైతుబంధు వేస్ట్ అనే కాంగ్రెస్ గెలిస్తే మనం మునిగిపోతం. కాబట్టి రైతుబంధు ఉండాలంటే రెడ్యా నాయక్ గెలువాలె’ అన్నారు.
రూ.30 వేల కోట్లు ఎవడియ్యాలె..?
‘కాంగ్రెసోళ్లు 24 గంటల కరెంటు వేస్ట్ అంటున్నరు. మూడు గంటలే సాలు అంటున్నరు. మూడు గంటల కరెంటు సరిపోతదా..? మరె కాంగ్రెస్ గెలిస్తే పొలాలు ఎట్ల పారాలె. అందుకే పంట పొలాలు నిండుగ పారాలంటే రెడ్యా నాయక్ గెలువాలె. కాంగ్రెసోళ్లు ఇంకేమంటున్నరు..? 10 హెచ్‌పీ మోటర్తోటి గంటకు ఎకరం పారుతది అంటున్నరు. మరె 10 హెచ్‌పీ మోటర్లు రైతులకాడ ఉన్నయా..? తెలంగాణల ఉన్న 30 లక్షల మోటార్లను 10 హెచ్‌పీకి మార్చాలంటే రూ.30 వేల కోట్లు గావాలె. మరె ఆ రూ.30 వేల కోట్లు ఎవడియ్యాలె..? కాంగ్రెసోళ్లు ఇంకేమంటరు..? ధరణిని తీసి బంగాళాఖాతంల వేస్తరట. దానికి బదులు భూమాతను తీసుకొస్తరట. ఈ భూమాత దేని కోసం భూమి మేత కోసం. అది భూమాత కాదు.. భూమేత. ధరణితోటి భూముల క్రయవిక్రయాల్లో అక్రమాలకు తెరదించినం. ధరణిని తీసేస్తె మళ్ల ఏమైతది..? మళ్ల లంచాలు ఇచ్చి పనులు చేయించుకోవాల్సి వస్తది. రైతులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తది. కాబట్టి కాంగ్రెస్‌ను నమ్మితే కైలాసం ఆటల పెద్ద పామును మింగినట్లు అయితది. రైతుబంధు తీసేస్తం అనేటోడు కావాల్నో.. రైతుబంధును రూ.16 వేలకు పెంచుతం అనేటోడు కావాల్నో ప్రజలే నిర్ణయించాలె. దయచేసి ఆగమాగం కావద్దు’ అని సీఎం కోరారు.