ఓ సినిమాలో శ్రీహరితో కోట శ్రీనివాస్‌రావు పదేపదే ‘నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనమేంట్రా?’ అని అంటుంటాడు. ఈ డైలాగ్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అంటారా? తెలంగాణ ఎన్నికల సమరంలో కాంగ్రెస్, బీజేపీ నేతల కవరింగ్ మాటలు కోటావారి మాటలను జ్ఞప్తికి తెస్తున్నాయి. అసలు కథేంటంటే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ పార్టీలు నిర్వహిస్తున్న సభలు ఘోరంగా ఫ్లాప్ అవుతున్నయి. దుబ్బాకలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీటింగ్ పెడితే మనుషుల కంటే ఖాళీ కుర్చీలే ఎక్కువ కనిపించాయి. రేవంత్ సభ ఫెయిలయిందని బాధ పడుతున్న ఆయన అనుచరులు.. ‘మా అన్న రాష్ట్ర అధ్యక్షుడే.. నల్లగొండలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ మా అన్న సభ కంటే భారీగా ఫ్లాప్ అయ్యింది.
మా అన్నదేముంది!’ అంటూ అనునయిస్తున్నారట. ఇక, నల్లగొండలో మీటింగ్ పెట్టిన కాంగ్రెసోళ్లు.. ‘మా పార్టీ అధ్యక్షుడి మీటింగే కాదు నిజామాబాద్‌లో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మీటింగ్ మాకంటే ఘోరంగా అట్టర్‌ఫ్లాప్ అయ్యింది’ అంటూ కవర్ చేసుకుంటున్నరట. ఇట్లా మా సభ కంటే వాళ్ల సభ ఎక్కువ ఫెయిలైంది, వాళ్లకన్నా మాది కాస్తోకూస్తో బెటర్ అనుకుంటూ ఉభయ పార్టీల లీడర్లూ.. వంతపాడుకుంటున్నారు. వీళ్ల తీరు చూస్తుంటే కోట శ్రీనివాస్‌రావు డైలాగ్ గుర్తుకు రావడం సహజమే కదా!
– వరుణ్