Minister Errabelli | మునుగోడు నియోజకవర్గం చండూరు మున్సిపాలిటీ అంతంపేట గ్రామ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు, కార్యకర్తలు గురువారం టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. వారికి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ దేశంలోనే టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రజాదరణ, పార్టీ సభ్యత్వం కలిగిన పార్టీ అన్నారు. ఈ పార్టీలో చేరడం పట్ల మనమంతా గర్వ పడాలని చెప్పారు. కేసీఆర్ అనుభవంతో కూడిన దిశా నిర్దేశం, యంగ్ అండ్ డైనమిక్ కేటీఆర్ లీడర్షిప్ గల పార్టీ అని అన్నారు.
భవిష్యత్తు లేని, ప్రజల అభిమానం లేని ప్రతిపక్ష పార్టీలతో అయ్యేది ఏమి లేదని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ పార్టీలకు రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడానికి యువత ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లకు మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. వారికి తగిన గుర్తింపు దక్కుతుందని అన్నారు. చండూరు మున్సిపాలిటీలోని బీజేపీ నేతలు ఎస్కే ఖాసిం, ఎస్ కే సయ్యద్, కాంగ్రెస్ నుండి ఎస్ కే చంద్, ఎస్ కే జాని, అవుల స్వామి, ఎస్ కే చిన్న సయ్యద్, ఎస్ కే నాగూర్ వలీ, చొప్పరి యాదయ్య, ఈద వెంకటేశం, 50 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.
కార్మికుల పక్షపాతి సీఎం కేసీఆర్ హయాంలోనే కార్మికులకు తెలంగాణలో ఎక్కువ న్యాయం జరుగుతుందని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం ఆయన చండూరులో జరిగిన ఉప్పరి (భవన నిర్మాణ) కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కార్మికులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందువల్లే ఆయా రాష్ట్రాల్లోని కార్మికులు తెలంగాణకు వలస వస్తున్నారని చెప్పారు. స్థానికంగా పరిష్కారమయ్యే భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. కార్మికుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకుందామన్నారు. వివిధ ప్రభుత్వ పథకాల్లో అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామన్నారు. భవన నిర్మాణ కార్మికుల డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఎరుకల వారు అత్యంత పేదరికంలో మగ్గుతున్నారని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. చండూరులో గురువారం జరిగిన ఎరుకల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ప్రపంచానికి ఎరుక (తెలవనిది తెలియ) చెప్పేది ఎరుకలేనన్నారు. హైదరాబాద్లో అందరితోపాటు ఎరుకలకు ఒక ఎకరం స్థలం కేటాయించి వారికి ఆత్మగౌరవ భవనాన్ని సీఎం కేసీఆర్ నిర్మిస్తున్నారని చెప్పారు. అన్ని రకాల సంక్షేమ పథకాలను ఎరుకలకు అందిస్తున్నారని తెలిపారు. ఉపాధి కల్పనకు ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఎరుకలను అన్ని విధాల ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్కు అండగా నిలవాలని, ఎరుకలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటారని అన్నారు.