కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కోసినిలో ఆదివారం ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతున్న సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులు
స్థానిక ఎన్నికల వేళ బీఆర్ఎస్లోకి వలసల వరద కొనసాగుతున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను వీడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆయా పార్టీల శ్రేణులు ప్రతిపక్ష పార్టీలోకి క్యూ కడుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం పల్లెల్లో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. ఎన్నికల వేళ అధికార పార్టీ కాంగ్రెస్ వలసలతో డీలా పడుతున్నది.
హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చి చివరికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని, ప్రజల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని భావిస్తున్న గల్లీ లీడర్లు మొదలు జిల్లా లీడర్ల దాకా అధికార పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తున్నారు. వెళ్లే వారిని ఎలా నిలువరించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్‌లో వలసల ముసలంఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే పుట్టింది. చిన్న నందిగామ నుంచి 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరడంతో చేరికల పరంపర మొదలైంది. అప్పటి నుంచి భారీగా వలసలు కొనసాగుతున్నాయి.
గత శనివారం కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, బీజేపీ నుంచి దాదాపు 100 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరారు. వలసలను ఆపేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రకటనలు ఉత్తివేనని కార్యకర్తలే చెప్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మేకపోతు గాంభీర్యమేనని, గ్రామాల్లో కనీసం వార్డు సభ్యుడి స్థాయి నాయకులు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో అన్ని పార్టీల కార్యకర్తలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపించారని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారిందని చెప్తున్నారు.
ఊరూరా ఏకగ్రీవ తీర్మానాలు
ప్రభుత్వం స్థానిక ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు ‘నమస్తే తెలంగాణ’ ప్రయత్నించింది. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి ప్రశ్నించగా అన్నివర్గాల ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తేటతెల్లమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో చెయ్యి గుర్తుపై నిలబడిన అభ్యర్థులకు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయవద్దని ఉత్తర తెలంగాణలో అనేక గ్రామాలు ఏకగ్రీవ తీర్మానాలు చేసుకుంటున్నాయి. మార్పు, మార్పు అని ఓటేస్తే యూరియా బస్తాల కోసం చెప్పుల వరుసపెట్టి పడిగాపులు కాయాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. హామీల ఆశ చూపి ఇంటింటికీ వెళ్లి ఓటేయాలని అడిగినందుకు తమ ఇండ్లు కూలేకాడికి వచ్చిందని కాంగ్రెస్ కార్యకర్తలే వాపోతున్నారు.
ఎమ్మెల్యేల వసూళ్లతోనే ఈ దుస్థితి
ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేలు గ్రామా ల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోటీలో నిలబడి గెలువగలిగే గ్రామీణ నేతల కోసం ఆరా తీస్తున్నారు. అయితే ఈ సమావేశాలకు గ్రామస్థాయి నేతలు, కార్యకర్తల నుంచి తగినంత స్పందన లేదని చెప్తున్నారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎమ్మెల్యేలకు రూపాయి నిధులు లేవని, గ్రామాల్లో అభివృద్ధి పనుల కింద తట్టెడు మట్టి కూడా పోయలేదని కాంగ్రెస్ శ్రేణులే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యేలు గ్రామీణ వనరులపై కూడా దృష్టి పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నట్టు చెప్తున్నారు. గ్రామం, మండలం, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు చేయగలిగిన ప్రతి పనికో రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. రైతులు తోడుకునే ఇసుక, మట్టికి కూడా ట్రిప్పుకు రూ.1,000 చొప్పున వసూలు చేస్తున్నట్టు కరీంనగర్ జిల్లా తిమ్మాపురం మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ నేత చెప్పారు.
గతంలో ట్రిప్పుకు రూ.200 నుంచి రూ.300 వరకు గ్రామ సర్పంచులు వసూలు చేసేవారని, ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే స్థాయి నేతలే తెగబడుతున్నారని చెప్పారు. చిన్న చిన్న పంచాయితీలను తీర్చేందుకు, పోలీస్‌స్టేషన్‌లో మాట సాయం చేసేందుకు కూడా ‘ఏమన్నా ఇస్తారా?’ అని అడుగుతున్నారని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ కార్యకర్త వాపోయారు. సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే మద్యం సిండికేట్ నుంచి అక్రమ వసూళ్ల బేరం మాట్లాడుతున్న వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వసూళ్ల దందా వల్లే కాంగ్రెస్‌కు ఈ దుస్థితి వచ్చిందని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు చెప్పినా ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదని, కాంగ్రెస్‌లో కొనసాగితే రాజకీయ జీవితం ఆగం అయినట్టేనన్న నిర్ణయానికి నేతలు వచ్చారని అంటున్నారు.
గుర్రుగా బీసీ యువత
బీసీ సామాజికవర్గ యువకులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ‘నమస్తే’ పరిశీలనలో తేలింది. బీసీ సంక్షేమం కోసం 65 హమీలు ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని చెప్పారని, ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్, నిర్వహణ కాంట్రాక్టుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారని గుర్తు చేస్తున్నారు. కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షల కంటే తక్కువ ఉన్న బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్, స్వయం ఉపాధి, ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు వడ్డీ రహిత తాకట్టు లేని రుణాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పారని బీసీ యువత మండిపడుతున్నది. చట్టబద్ధమైన హోదాతో కూడిన మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సబ్‌ప్లాన్‌కు హామీ ఇచ్చారని, రూ.50 కోట్లతో అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యభవన్లు నిర్మిస్తామని, ఆ భవన్‌లోనే జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని చెప్తున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే యువత, రైతులు, మహిళలు ఓట్లు వేసే పరిస్థితి లేదని, అందుకే బీఆర్ఎస్లోకి వెళ్తున్నారని నాగర్‌కర్నూల్ జిల్లా రాకొండకు చెందిన ఓ గీత కార్మికుడు చెప్పారు.
బిల్లులూ వదులుకునేందుకు సిద్ధమై
రాష్ట్రవాప్తంగా దాదాపు 12 వేల మంది మాజీ సర్పంచులు, ఎంపీటీల రూ.650 కోట్ల మేరకు గ్రామ పంచాయతీ కాంట్రాక్టు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరితే బిల్లులు చెల్లిస్తామని ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులు వారికి ఆశ చూపుతున్నట్టు సమాచారం. లేదంటే బిల్లులు ఆపేస్తామని ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. బిల్లులు ఇప్పుడు కాకుంటే ఎప్పుడైనా వస్తాయని, కానీ రాజకీయ జీవితం ఒక్కసారి సమాధి అయితే మళ్లీ కోలుకోవడం కష్టమేనని మాజీ ప్రజాప్రతినిధులు సన్నిహితులతో చెప్తున్నారట.
ఇదీ వలసల వరుస
బీఆర్ఎస్లోకి వలసల జాతర
జహీరాబాద్/బెల్లంపల్లి/ఆసిఫాబాద్ టౌన్/కాగజ్‌నగర్/దండేపల్లి, అక్టోబర్ 5 : బీఆర్ఎస్లోకి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి వలసల జాతర కొనసాగుతున్నది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో హైదరాబాద్‌లో బీఆర్ఎస్లో చేరారు. 35 మంది బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరగా హరీశ్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలో బీజేపీకి చెందిన తానాజీరావు, అమెరికాకు చెందిన కిషోరెడ్డితో పాటుగా పలువురు కమలం పార్టీ లీడర్లు బీఆర్ఎస్లో చేరగా వారికి కండువా కప్పి స్వాగతించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలానికి చెందిన నాయకుడు బొడ్డు రాజ్‌కుమార్ తిరిగి బీఆర్ఎస్లో చేరారు.
ఎమ్మెల్యే కోవ లక్ష్మి గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కోసిని గ్రామంలో శనివారం రాత్రి సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులు బీఆర్ఎస్లో చేరారు. కార్మికులకు, కార్మిక సంఘాల నాయకులకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ప్రవీణ్‌కుమార్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిన సీనియర్ నాయకులు సేదం బాపు, ఏదుల బుచ్చన్న, మార్నేని చిన్న ఆదివారం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, యువ నాయకుడు విజిత్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు మాలోతు రాజశేఖర్, మాలోత్ సురేశ్ బీఆర్ఎస్లో చేరారు.