నల్లగొండ, జూన్ 10 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): ‘సొంత పార్టీల్లో ఆధిపత్య పోరుతోనే కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు పాదయాత్రలంటూ హడావిడి చేస్తున్నారు. గతంలో బండి సంజయ్ యాత్రలు చేసి అలిసిపోయిండు. రేవంత్‌రెడ్డి మధ్యలోనే ఆపేసిండు. ఇప్పుడు భట్టి విక్రమార్క వంతు వచ్చింది. వీళ్లంతా పగటి వేషగాళ్ల మాదిరిగా మారి ఎన్నికల స్టంట్ యాత్రలు చేస్తున్నరు. ఇవి ప్రజల కోసం చేస్తున్నవి కాదు’ అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే సీఎం ఎవరో తేల్చుకోలేరని, దమ్ముంటే ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో ముందు చెప్పగలరా? అని సవాల్ చేశారు. శనివారం ఆయన నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో ముగ్గురు సీఎం అభ్యర్థులు ఉన్నారని, రాష్ట్రంలోనైతే డజన్‌కుపైగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
నిత్యం తన్నులాటలు, కొట్లాలకు మారుపేరైన కాంగ్రెస్‌తో రాష్ర్టానికి ఒరిగేదేమీ లేదని అన్నారు. నల్లగొండలో సాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్రలోనూ ఆ పార్టీ నేతలు కొట్లాడుకున్నారని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తాను, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ఏమీ చేయలేదంటూ, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ భట్టి విక్రమార చేసిన ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మధిర నియోజకవర్గం తప్ప రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎన్ని ప్రాజెక్టులు, వాగులు, వంకలు ఉన్నాయో తెలియని తిక్కల భట్టి కూడా ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.
జిల్లాలో ఏఎంఆర్పీ ఎత్తిపోతల పథకం పూర్తి, మూడు లక్షల ఎకరాలకు సాగునీరు, 600 గ్రామాలకు తాగునీటి వసతితోపాటు హైదరాబాద్‌లో భట్టి నివాసానికి అందుతున్న కృష్ణా జలాల్లోనూ ఎంపీగా తన కృషి ఉన్నదని తెలిపారు. కాంగ్రెస్ అసంపూర్తిగా వదిలేసిన కల్వకుర్తి, కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. కల్వకుర్తి ద్వారా వస్తున్న నీళ్లతోనే డిండి ప్రాజెక్టు కింద రెండు పంటలకు నీరందిస్తున్నామని, తమ కృషితో వచ్చిన రోడ్లపైన, సాగైన పంట పొలాల వెంట భట్టి పాదయాత్ర సాగుతున్నదని చురక అంటించారు.