యాదాద్రి భువనగిరి/నేరేడుచర్ల, జనవరి 23 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ను బలహీన పరిచేందుకు కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ అయ్యాయి. బయటకు బద్ధ శత్రువులమని నటిస్తున్న ఆ రెండు పార్టీలు.. యాదా ద్రి భువనగిరి జిల్లాలో కలిసికట్టుగా ఉండి భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ను పడగొట్టాయి. బీఆర్ఎస్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్యకు వ్యతిరేకంగా జట్టు కట్టి అవిశ్వాస తీర్మానంలో నెగ్గాయి.
మంగళవారం భువనగిరి పట్టణంలోని మున్సిపాలిటీలో నిర్వహించిన అవిశ్వాస తీర్మాన సమావేశానికి ఆర్డీవో అమరేందర్ హాజరయ్యారు. మున్సిపాలిటీలో మొత్తం 35 మంది సభ్యులు, ఒక ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. అవిశ్వాసం నెగ్గడానికి 24 మంది కౌన్సిలర్లు కావాలి. మొత్తం 31 మంది చేతులెత్తారు. వీరిలో 16 మంది బీఆర్ఎస్, తొమ్మిది మంది కాంగ్రెస్, ఆరుగురు బీజేపీ కౌన్సిలర్లు చేతులెత్తారు. నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాలేదు.
మొదట చైర్మన్, తర్వా త వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం నెగ్గింది. అలాగే.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్ చైర్మ న్ చందమళ్ల జయబాబుపై పెట్టిన అవిశ్వా సం నెగ్గింది. స్థానిక మున్సిపల్ కార్యాలయం లో హుజూర్నగర్ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నీలిగొండ వెంకటేశ్వ ర్లు సమక్షంలో అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేశారు. మొత్తం 16 మందికిగానూ.. అవిశ్వా స సమావేశానికి చైర్మన్ జయబాబు, ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులు గైర్హాజరయ్యారు. మిగిలిన 13 మంది కౌన్సిలర్లు సమావేశానికి హాజరై అందరూ అవిశ్వాసానికి చేతులెత్తి మద్దతు తెలపడంతో అవిశ్వాసం నెగ్గిందని ఆర్డీవో తెలిపారు. కాగా.. మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం నెగ్గడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలు చేశారు. పటాకులు కాలుస్తుండగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అరిగెళ్ల రవి చేతిలో ఉన్న బాంబు పేలి చేతివేళ్లు నుజ్జునుజ్జయ్యాయి.