Medigadda | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 18 (నమస్తే తెలంగాణ): మేడారం, అన్నారం, సుందిల్ల బరాజ్‌ల ఎగువన, దిగువన ఏయే సమయంలో ఎంత వరద వచ్చింది? ఎంత దిగువకు విడుదల చేశారు? (గేజ్ అండ్ డిశ్చార్జి). సుందిల్ల బరాజ్ పరిధిలో సముద్రమట్టానికి 100 మీటర్ల వద్ద ఐదు కిలోమీటర్ల వరకు గోదావరి నది ప్రవాహస్థాయి (రివర్ క్రాస్ సెక్షన్) ఎలా ఉంది? ఇవీ.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏడాది క్రితం తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులను అడిగిన వివరాలు. ఈ వివరాలన్నీ నీటిపారుదల శాఖ రికార్డుల్లో దశాబ్దాల తరబడి భద్రంగా ఉన్నాయి.
అయి నా, కేంద్రానికి ఆ వివరాలు ఎందుకు ఇవ్వడం లేదు? ఎన్డీఎస్ఏ అధికారులు ఆ బాధ్యతను రాష్ట్రం మీదనే ఉంచి ఎందుకు చేతులు దులుపుకుంటున్నారు? ఎందుకంటే, ఎన్డీఎస్ఏ అడిగిన వివరాలన్నీ ఇస్తే తుది నివేదిక వస్తుంది. తద్వారా కాళేశ్వరం బరాజ్‌లు వినియోగంలోకి వస్తాయి. కేసీఆర్ కట్టిన బృహత్తర ప్రాజెక్టుతో తెలంగాణ రైతాంగం బాగుపడుతుంది. ఇది జరగకూడదనేదే బరాజ్‌లను ఎండబెట్టడం వెనక అసలు కుట్ర. అందుకే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర భుత్వం కేంద్రానికి వివరాలు ఇవ్వదు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తుది నివేదిక అందించదు. ఇదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి-బనకచర్ల లింకును తెరపైకి తెస్తారు.
యాదృశ్చికమో… ఉద్దేశపూర్వకమో… కారణమేదైనా! ఏడాదికిపైగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు మేడిగడ్డపై ముప్పేట దాడిని తలపిస్తున్నాయి. బరాజ్ కుంగుబాటు తెరపైకి వచ్చినప్పుడు గంటల వ్యవధిలోనే ఉరుకులు పరుగులు పెట్టిన ఎన్డీఎస్ఏ 15 నెలలు గడుస్తున్నా నేటికీ తుది నివేదిక ఇవ్వడం లేదు. ఇదేమంటే, తెలంగాణ నీటిపారుదల శాఖ అడిగిన వివరాలు ఇచ్చిన రెండు నెలల్లోనే ఇస్తామంటది. మరి… ఆ వివరాలేమైనా క్లిష్టతరమైనవా? అంటే కాదని నిపుణులు చెప్తున్నారు. ఏడాదికిపైగా సాగుతున్న హైడ్రామాతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ-అన్నారం-సుందిల్ల బరాజ్‌లు ఎండుతున్నాయి. తెలంగాణకు ప్రాణాధారమైన ప్రాణహిత జలాలు దిగువకు పరుగులు పెడుతున్నాయి. యాసంగిలో తెలంగాణ రైతాంగం సాగునీటి కోసం అరిగోస పడుతున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల వినియోగంలో తెలంగాణ దశ-దిశ మారిందనేందుకు 2019 నుంచి రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణమే ఉదాహరణ. దశాబ్దాలుగా తెలంగాణ బీడు భూములకు అందకుండా దిగువకు పరుగులు పెడుతున్న ప్రాణహిత జలాలను రైతులకు అందించడంతోపాటు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా పదేండ్లలో ఏకంగా వందల టీఎంసీల కొద్ది నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అస్త్రంలా ఉపయోగపడింది. కానీ, దురదృష్టవశాత్తు మేడిగడ్డ బరాజ్‌లోని 20వ పిల్లర్ కుంగుబాటునకు గురైంది.
ఆ ఒక్క సమస్యను ఆసరాగా చేసుకొని కాంగ్రెస్-బీజేపీ రాజకీయ లబ్ధికి దానిని వాడుకోవడమే కాకుండా మూడు బరాజ్‌లను కాలగర్భంలో కలిపేందుకు ప్రయత్నిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఏడాదికిపైగా చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలే ఇందుకు బలాన్నిస్తున్నాయి. మేడిగడ్డ పిల్లర్ కుంగినప్పుడు మరుసటి రోజే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాయగా, ఆ మరుసటిరోజే ఆగమేఘాల మీద రాష్ర్టానికి వచ్చిన నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు క్షేత్రస్థాయి అధ్యయనం చేయకుండానే ప్రాథమిక నివేదిక ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్-బీజేపీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు రాజకీయ యాత్ర చేశారు. రాహుల్‌గాంధీ సైతం హెలికాప్టర్లో మేడిగడ్డను సందర్శించారు.
ఆపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేంద్ర జల సంఘం చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఏర్పాటైంది. ఒకవైపు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, మరోవైపు ఎన్డీఎస్ఏ అధికారులు కాళేశ్వరం పరిధిలో అనేకస్లారు పర్యటించి పరిశీలన చేశారు. అధ్యయనాలు కొనసాగించారు. పరీక్షలు చేపట్టారు. నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో ఎన్డీఎస్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ పదుల సంఖ్యలో సమావేశాలు నిర్వహించింది. జలసౌధలో మేధోమథనం నిర్వహించారు. తుది నివేదిక మాత్రం బయటికి రావడం లేదు.
మేడిగడ్డ బరాజ్‌లో ఒక్క పిల్లర్ కుంగుబాటుకు గురైతే, ఆపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త అధ్యయనంలో మూడు బరాజ్‌లను బలిపీఠంపైకి ఎక్కించారు. సీపేజీలు, లీకేజీలు అంటూ మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిల్ల బరాజ్లనూ ఖాళీ చేయించి ఎండబెట్టారు. అప్పటినుంచి మూడు బరాజ్‌ల వద్ద పరీక్షల కోలాహలమే తప్ప వాటిని వినియోగంలోకి తీసుకురావాలనే చిత్తశుద్ధి కనిపించడం లేదు. బరాజ్‌లను ఎండబెట్టి ఇసుకను తోడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించడం గమనార్హం. ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబర్‌లో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సభ్య కార్యదర్శి చైర్మన్ అయ్యర్‌కు రాసిన లేఖ… ఆపై చైర్మన్ వాటిని జోడిస్తూ తెలంగాణ నీటిపారుదల శాఖకు రాసిన లేఖతో అసలు గుట్టు బయటపడింది.
వాస్తవానికి ఎన్డీఎస్ఏ అధికారులు మేడిగడ్డకు సంబంధించి 12, అన్నారం,సుందిల్లకు సంబంధించి ఏడేసి అంశాలపై తెలంగాణ నీటిపారుదల శాఖ నుంచి వివరాలు కోరారు. అందులో కేవలం ఏడు అంశాలకు సంబంధించి ఇప్పటికీ (దాదాపు ఏడాది కాలంగా) వివరాలు ఇవ్వలేదని నిపుణుల కమిటీ పేర్కొన్నది. అయితే, ఆ ఐదు అంశాలకు సంబంధించిన వి వరాలు చాలా సులువైనవిగా ఇంజినీరింగ్ నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మూడు బరాజ్‌ల దగ్గర ఎగువ, దిగువ స్ట్రీమ్‌లకు సంబంధించిన వరద (గేజ్ అండ్ డిశ్చార్జి) వివరాలు ఉన్నాయి. ఈ వివరాలు నీటిపారుదల శాఖ రి కార్డుల్లో ఎలాగూ ఉన్నాయి. కానీ, వాటిని ఎన్డీఎస్ఏకు ఎందుకు ఇవ్వడంలేదనేది విస్మయం కలిగిస్తున్నదని రిటైర్డ్ ఇంజినీర్ ఒకరు అన్నారు.
ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు సర్వే దశలో కేసీఆర్ ప్రభుత్వం గోదావరి-ప్రాణహిత-ఇంద్రావతి ఇలా ఆద్యంతం లైడార్ సర్వే చేపట్టింది. ఒక సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి లైడార్ సర్వే చేపట్టడం దేశంలోనే మొదటిసారి. అత్యం త అధునాతనమైన లైడార్ సర్వే వివరాలు నీటిపారుదల శాఖ వద్ద అందుబాటులో ఉన్నాయి. ఇందులో నుంచి ఎన్డీఎస్ఏ అడిగిన వివరాలు సులువుగా ఇచ్చే అవకాశం ఉన్నది. కానీ, ఈ వివరాలు ఇవ్వనందుకే తాము తుది నివేదిక ఇవ్వలేకపోతున్నామని నిపుణుల కమిటీ చెప్పడం, వాటిని ఇచ్చిన రెండు నెలల్లోనే తుది నివేదిక ఇస్తామని స్పష్టంచేయడం, ఇదే సమయంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ఆ వివరాలు సమర్పించకపోవడంతో ఉద్దేశపూర్వకంగానే ‘బరాజ్‌లను బలిపీఠంపై నిలిపారు’ అనే అనుమానాలకు బలాన్నిస్తున్నాయి.
మేడిగడ్డ బరాజ్‌ను పునరుద్ధరించకుండా ప్రాణహిత జలాలను దిగువకు వదులుతున్న నేపథ్యంలో గత ఏడాది యాసంగిలో తెలంగాణ రైతాంగం సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో తాత్కాలిక ఏర్పాట్లతోనైనా కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలనే డిమాండ్ వచ్చింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అన్నది. ‘ఎవరి మాటలూ వినం.. న్డీఎస్ఏ ఆదేశాలు, సూచనలు మాత్రమే అమలుచేస్తాం’ అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనేక సందర్భాల్లో కుండబద్దలు కొట్టారు. కానీ, ఎన్డీఎస్ఏ కమిటీ నీటిపారుదల శాఖకు రాసిన లేఖలో ఇదంతా ఒట్టి బూటకం అని తేలిపోయింది.
ప్రాణహిత జలాలను ఎత్తిపోసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ బరాజ్ పిల్లర్ కుంగుబాటును సాకుగా చూపుతున్నది. నిరుడు చుక్కనీటిని కూడా ఎత్తిపోయలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రానున్న సీజన్లోనూ నీటిని ఎత్తిపోయకుండా ఉండేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నది. ఈ క్రమంలో నీటిని ఎత్తిపోతల నిలిపివేతకు బరాజ్ కారణమైతే, దేవాదుల వద్ద ఏ బరాజ్ ఉన్నదని నీటిని ఎత్తిపోస్తున్నారు? అని పలువురు నిపుణులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆపై వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం కింద ఆ ప్రాజెక్టును చేపట్టి పనులు నిర్వహించింది.
గోదావరిలో 71 మీటర్ల ఎత్తులో నీటి ప్రవాహం ఉన్నప్పుడు జలాలను మళ్లించేందుకు ఇన్‌టేక్ వెల్ (ఒక చిన్న బావి)లోని నీటిని మోటర్ల ద్వారా ఎత్తిపోసేలా దేవాదుల డిజైన్ చేశారు. బరాజ్ లేకుండానే చిన్నబావి ఏర్పాటు ద్వారా నీటిని మళ్లిస్తున్నారు. అలాంటప్పుడు మేడిగడ్డ బరాజ్‌తో సంబంధం లేకుండా కన్నెపల్లి వద్ద ఇన్‌టేక్‌వెల్‌ను ఏర్పాటుచేసి ప్రాణహిత జలాలను ఎత్తిపోసేందుకు అవకాశం ఉన్నది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నది. మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగుబాటుకు గురైందే తప్ప అన్నారం, సుందిల్ల బరాజ్‌ల వద్ద సమస్య లేదనేది బహిరంగ రహస్యం. కానీ, మేడిగడ్డ మాటున ప్రభుత్వం ఈ రెండు బరాజ్‌లను కూడా బలిపీఠంపై పెట్టి ప్రాణహిత జలాల ఎత్తిపోతల ప్రక్రియను విస్మరిస్తున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వెనక అసలు ఉద్దేశం.. ప్రధాన గోదావరిపై ఉన్న శ్రీరాంసాగర్‌కు ఏడాది పొడవునా ఇన్‌ఫ్లోలు ఉండవు. బాబ్లీ నుంచి భారీ వరద ఉన్నా అది వర్షాకాలానికే పరిమితం. శ్రీరాంసాగర్‌లో సామర్థ్యానికి అనుగుణంగా నిల్వ చేసుకొని ఆపై మిగిలిన వరదను దిగువకు వదలాల్సిందే. గరిష్ఠంగా 10-15 రోజులే ఈ పరిస్థితి ఉంటుంది. దీంతో యాసంగికి శ్రీరాంసాగర్ ఆయకట్టుకు సాగునీరు అందించడం కాళేశ్వరం అందుబాటులోకి వచ్చేదాకా ఒక సవాల్‌గా ఉండేది. 2019 తర్వాత ఎస్సారెస్పీ నుంచి దిగువన సూర్యాపేట దాకా రెండు పంటలకు పుష్కలంగా సాగునీటిని అందించిన చరిత్ర ఉన్నది. కేవలం గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంను పక్కకుపెట్టడంతో తిరిగి యాసంగిలో పంటలు ఎండిపోయాయి. ఈ దుస్థితికి శాశ్వత పరిష్కారంగానే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టింది.
ప్రాణహితలో సీజన్లో లక్షల క్యూసెక్కుల వరద రావడమే కాదు… మండు వేసవిలోనూ అక్కడ కనిష్ఠంగా 5-10వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోలు నమోదవుతాయి. అందుకే కేసీఆర్ హయాంలో మే నెలలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన గోదావరి-బనకచర్ల అసలు లక్ష్యంగా ఇదేననే సందేహాలు సాగునీటి రంగ నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఇటీవల ఇచ్చిన ప్రజంటేషన్ సందర్భంగా నాలుగు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని వినియోగించుకునేందుకే ఈ లింకు ప్రాజెక్టు అని చెప్పారు. కానీ, గోదావరిలో వరద డైనమిక్‌గా ఉంటుందని రిటైర్డ్ ఇంజినీర్ ఒకరు చెప్పారు.
రోజుల వ్యవధిలోనే వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తాయి. చంద్రబాబు చెప్తున్న నాలుగువేల టీఎంసీల్లో 80-90% వరద రెండు నెలలకే పరిమితమవుతుంది. మిగిలిన 10-20 శాతమే అన్‌సీజన్‌లో దిగువకు పోతుంది. ఆ కొద్దిపాటి పరిమాణమే పంటలకు ప్రాణాధారంగా నిలుస్తుంది. వర్షాకాలంలో వచ్చే భారీ వరదను ఒడిసిపట్టడం అసాధ్యం. పైగా వర్షాకాలంలో నిల్వ సామర్థ్యం మేరకు వరదను ఒడిసిపట్టి, ఆపై దిగువకు వదలాల్సిందే. పోలవరం పూర్తయిన తర్వాత కూడా ఇదే పరిస్థితి. ప్రధానంగా యాసంగి పంటలకు సమృద్ధిగా నీటిని అందించడంతోపాటు వర్షాకాలం పంటలకు ముందుగానే నాట్లు వేసుకునేందుకు సాగునీటిని ఇవ్వడమనేది కీలకమైన అంశాలు.
అది ఏడాది పొడవునా ఇన్‌ఫ్లోలు ఉండే ప్రాణహితతోనే సాధ్యమవుతుందని కేసీఆర్ గుర్తించారు. అందుకే ప్రధాన గోదావరిలో వరద నిలిచిపోయినా ప్రాణహితలో నిత్యం వచ్చే ఇన్‌ఫ్లోలను ఎత్తిపోసుకొని ఎప్పటికప్పుడు రిజర్వాయర్లను నింపుకునేలా డిజైన్ రూపొందించారు. కానీ,మేడిగడ్డ బరాజ్‌ను పడావు పెట్టి… కన్నెపల్లి వద్ద ఎత్తిపోతలను అటకెక్కించడంతో ఎండాకాలంలోనూ ప్రాణహితలో వచ్చే కొద్దిపాటి ఇన్‌ఫ్లోలు నేరుగా దిగువకు పోతాయి. ఆ నీటిని లింకు ప్రాజెక్టు ద్వారా మళ్లించుకునేందుకు ఆస్కారముంటుందని సాగునీటిరంగ నిపుణుడు ఒకరు వివరించారు.
2023 అక్టోబర్ 21: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ వద్ద 20వ పిల్లర్ కుంగుబాటునకు గురైంది.
2023 అక్టోబర్ 22: ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెంటనే నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కు లేఖ రాశారు.
2023 అక్టోబర్ 23: ఆగమేఘాలపై ఎన్డీఎస్ఏ అధికారులు హైదరాబాద్‌కు చేరుకున్నారు.
2023 అక్టోబర్ 24: ఎన్డీఎస్ఏ అధికారులు హైదరాబాద్ నుంచి మేడిగడ్డ బరాజ్ మీదనే ఉండి పరిశీలన చేశారు.
2023 అక్టోబర్ 29: కనీసం ఎలాంటి పరీక్షలు, కనీస అధ్యయనం లేకుండానే ‘ఇది డిజైన్, నాణ్యత లోపం’ అంటూ ఎన్డీఎస్ఏ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను అడ్డం పెట్టుకుని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీ రాజకీయ లబ్ధి పొందేందుకు ఒకే రాగాన్ని ఆలపించాయి. ఆపై మార్చి వరకు ఎన్డీఎస్ఏ నుంచి ఉలుకూపలుకూ లేదు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మళ్లీ హడావుడి చేశారు. గత ఏడాది మార్చిలో ఎన్డీఎస్ఏ ఇంజినీర్లతో నిపుణుల కమిటీ వేసి, అదే నెలలో వరుస పర్యటనలు చేపట్టారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కేవలం ఉత్తర ప్రత్యుత్తరాలు తప్ప ఎలాంటి హడావుడి లేదు. ఘటన జరిగి 15 నెలలు అవుతున్నది. కానీ, ఇప్పటివరకు బరాజ్‌ల పునరుద్ధరణపై ఎన్డీఎస్ఏ ఒక కార్యాచరణ ఇచ్చింది లేదు.. నివేదిక కోసం రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టిందీ లేదు.