హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 25సార్లు ఢిల్లీకి ఎవరి కాళ్లు మొక్కడానికి వెళ్లారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ రెండుమూడు రోజులు అక్కడే మకాం వేశారని, ఢిల్లీకి చక్కర్లు కొట్టడానికే 50-60 రోజులు సరిపోయిందని ఎద్దేవాచేశారు. రేవంత్‌రెడ్డి ఇన్నిసార్లు వెళ్లి కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేయలేకపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భయపడి ఢిల్లీ వెళ్లారంటూ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ విమర్శించడంపై సుధీర్‌రెడ్డి భగ్గుమన్నారు. అమృత్ టెండర్ల విషయంలో కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ ముందే చెప్పి వెళ్లారని గుర్తుచేశారు. తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై బీఆర్ఎస్ను డ్యామేజ్ చేయాలని కుట్రపన్నాయని, కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేయాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. ఏదో ఒక కేసులో కేటీఆర్‌ను ఇరికించాలని చూస్తున్న రేవంత్‌రెడ్డికి.. ‘మలేషియా వెళ్లలేదు.. ఇక్కడే ఉన్నాను. ఎప్పుడైనా వచ్చి అరెస్టు చేసుకోవచ్చు..’ అని సవాల్ విసిరిన ధైర్యశాలి కేటీఆర్ అని పేర్కొన్నారు. కాళ్లబేరానికి రావాల్సిన ఖర్మ తమకు లేదని, కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయడానికి కేటీఆర్ వెళ్లారని స్పష్టం చేశారు.
మంత్రి పొంగులేటి ఇంట్లో జరిగిన ఈడీ దాడులపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరుమెదపడం లేదని సుధీర్‌రెడ్డి నిలదీశారు. దాడులపై ప్రెస్‌నోట్ ఇచ్చే ఈడీ అధికారులు ఇన్నిరోజులైనా వివరాలు వెల్లడించకపోవడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. ఢిల్లీలో బీజేపీతో రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయాలని కాంగ్రెస్, బీజేపీ డిసైడ్ అయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి విమర్శలు చేయడం లేదని దుయ్యబట్టారు. ఫార్మాసిటీ కోసం 19 వేల ఎకరాలు సిద్ధంగా ఉన్నా, లగచర్లలో మరో 4 వేల ఎకరాల భూ సేకరణకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తున్నదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టినప్పుడు రైతులను, ప్రజలను ఒప్పించి భూములు సేకరించామని తెలిపారు. లగచర్ల ఘటన ప్రారంభం మాత్రమేనని, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.