హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై నిలదీస్తున్నందుకు కేటీఆర్‌పై కేసులు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే ఆరుసార్లు ప్రయత్నించిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. కేసులతోనే రాష్ర్టాన్ని నడపాలని రేవంత్‌రెడ్డి చూస్తున్నారని మండిపడ్డారు.
నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫార్ములా ఈ రేస్ ప్రపంచంలో కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమని, ఈ రేస్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని, రాష్ర్టానికి రూ.700 కోట్ల లబ్ధి కలిగిందని గుర్తుచేశారు. ఈ రేస్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని, అవినీతి జరిగి ఉంటే నిర్వహణ సంస్థ ఎఫ్ఈవోపై కేసు పెట్టాలి కదా అని ప్రశ్నించారు. కేటీఆర్ జైల్లో పెట్టాలన్నదే రేవంత్‌రెడ్డి లక్ష్యమని విమర్శించారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉన్నదని, న్యాయపరంగా పోరాడి గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు.
కాంగ్రెస్, బీజేపీల టార్గెట్ బీఆర్ఎస్సేనని మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ను రాష్ట్రంలో లేకుండా చూడాలని ఉమ్మడిగా కుట్రపన్నుతున్నాయని విమర్శించారు. తమ పార్టీ నాయకులను అక్రమ కేసుల్లో ఇరికించి పైశాచిక ఆనందం పొందుతున్నాయని మండిపడ్డారు. ‘కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి కక్షగట్టారు. ఏడాదిలోనే ఆరు కేసుల్లో ఇరికించాలని ప్రయత్నించారు. ఇందుకోసమేనా ఆయన ముఖ్యమంత్రి అయింది?’ అని ప్రశ్నించారు.
ఈ రేస్ రద్దుతో తెలంగాణ ప్రజలు నష్టపోయారని విమర్శించారు. కక్షసాధింపు ధోరణి వీడి ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడంపై దృష్టిపెట్టాలని హితవుపలికారు. ‘కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్పై కుట్ర చేస్తున్నాయి. కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేయాలని చూస్తున్నాయి. కక్షసాధింపు రాజకీయాలను తెలంగాణ సమాజం ఒప్పుకోదు. సియోల్ బాం బులు ఓపెన్ అయ్యాయని పొంగులేటి అం టున్నరు. బాంబులు పేల్చడానికి పొంగులేటి మంత్రి అయ్యారా?’ అని నిలదీశారు.