కౌడిపల్లి, ఏప్రిల్ 27 : బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలకు ముస్తాబుచేసిన పార్టీ జెండా గద్దెను కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేసిన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలో సోమవారం చోటుచేసుకున్నది. బీఆర్ఎస్ తునికి గ్రామ అధ్యక్షుడు తీగల శంకరయ్య, పార్టీ శ్రేణుల కథనం ప్రకారం..15 ఏండ్ల క్రితం తునికి ఎస్సీకాలనీ చర్చి వద్ద బీఆర్ఎస్ జెండా గద్దె ఏర్పాటు చేశారు. ఏటా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఎగురవేస్తున్నారు. ఆదివారం రాత్రి గద్దెకు బీఆర్ఎస్ రంగులువేసి సిద్ధం చేశారు. సోమవారం ఉదయం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు తలారి భూపాల్, ఆరేగూడం శ్రీశైలం, పంచమి దేవేందర్ గద్దెను ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
ఇరుపార్టీల కార్యకర్తల నడుమ వాగ్వాదం, తోపులాట జరిగింది. నర్సాపూర్ సీఐ జాన్‌రెడ్డి, ఎస్సై రంజిత్‌కుమార్‌రెడ్డి సిబ్బందితో గ్రామానికి చేరుకుని ఇరుపార్టీల శ్రేణులను చెదరగొట్టి, శాంతింపజేశారు. ధ్వంసం చేసిన బీఆర్ఎస్ గద్దె వద్దనే బీఆర్ఎస్ మండల నాయకులు జెండాను ఎగురవేసి, ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొన్నారు. బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు తీగల శంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గద్ద్దెను ధ్వంసం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.