తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌కు సొంత పార్టీ నుంచే నిరసన సెగ తాకింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలపై స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వడంలేదని సూర్యాపేట జిల్లా అర్వపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు చెప్పారు. సోమవారం జాజిరెడ్డిగూడెం పీఏసీఎస్ బ్యాంకు వద్ద రైతు భరోసా అభిప్రాయ సేకరణ, బొల్లంపల్లిలో ఆలయ వార్షికోత్సవానికి ఎమ్మెల్యే వస్తున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ మండల నాయకులు అర్వపల్లికి చేరుకున్నారు.
ముందుగా బొల్లంపల్లికి వెళ్తున్నారని తెలుసుకుని తానంచర్ల-నకిరేకల్ జాతీయ రహదారిపై బైఠాయించారు. ఎమ్మెల్యే కాన్వాయ్ ఆపకుండా రైతు భరోసా కార్యక్రమానికి వెళ్లారు. అనంతరం తిమ్మాపురంలో ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెళ్తుండగా అప్పటికే అర్వపల్లి వై జంక్షన్లో కాంగ్రెస్ శ్రేణులు మోహరించడంతో గంటసేపు ఆగిన సామేల్ యూటర్న్ తీసుకొని తిరుమలగిరికి వెళ్లిపోయారు. ఆందోళనలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిరెడ్డి రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మోరపాక సత్యం, కాంగ్రెస్ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు వేల్పుల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
-అర్వపల్లి
వేతనాలు ఇప్పించాలని మంత్రి సీతక్కకు వినతి
ఎంపీపీ, జడ్పీటీసీల గౌరవ వేతనాలను ఇప్పించాలని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, జడ్పీటీసీ రాథోడ్ చారులతలు డిమాండ్ చేశారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం సమర్పించారు.
-ఉట్నూర్
ధాన్యం డబ్బులు ఇప్పించాలని రైతుల ధర్నా
యాసంగిలో విక్రయించిన ధాన్యం డబ్బులు ఇప్పించాలని సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని పొనకల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో రైతులు ధర్నాకు దిగారు. బాదంపల్లి, చింతలపల్లెకు చెందిన 14 మంది రైతులు సహకార సంఘానికి ధాన్యం విక్రయించారని, వాటివి రూ.12 లక్షలు ఇప్పటికీ ఖాతాల్లో జమ కాలేదని చెప్పారు. గోల్మాల్ చేసిన అధికారులను సస్పెండ్ చేసి వెంటనే డబ్బులు ఇప్పించాలని కోరారు.
-జన్నారం
అప్రోచ్ రోడ్డును నిర్మించాలని నిరసన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ములకలపల్లి-తాళ్లపాయి గ్రామాల మధ్య ఆదివారం కురిసిన వర్షాలకు తెగిపోయిన అప్రోచ్ రోడ్డును వెంటనే నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. సోమవారం గ్రామస్థులు,ఆటో యూనియన్ నాయకులు అక్కడ నిరసన తెలిపారు. తాళ్లపాయి పంచాయతీలోని ఆరు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయని, ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
-ములకలపల్లి
ఇండ్ల స్థలాలు ఇవ్వాలని గిరిజనుల ఆందోళన
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ సోమవారం ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో బైఠాయించారు. ఐటీడీఏ పీవో చిత్రమిశ్రాకు సమస్యను విన్నవించారు. తమకు ప్రత్యేక గ్రామాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. పీవో చిత్రమిశ్రా.. గ్రామంలో ఎక్కడ ఖాళీ స్థలం ఉందో తెలుసుకుంటామని, ఎస్డీసీ, ఆర్డీవోతో చర్చిస్తామని చెప్పారు.
– ఏటూరునాగారం
మా భూములకు పట్టాలివ్వండి
మహబూబాబాద్ జిల్లా నారాయణపురం గ్రామ రైతులు తమ భూములకు పట్టాలివ్వాలని సోమవారం సచివాలయ వద్ద నిరసన తెలిపారు. 1960 నుంచి తమ పేరు మీదే భూములు ఉన్నా.. అధికారుల తప్పిదంతో ధరణిలో అటవీ భూములుగా నమోదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వారం రోజుల్లో సమస్యలను పరిషరిస్తామని చెప్పినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కొందరు రైతులను అధికారులు రెవెన్యూశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ వద్దకు పంపించగా, అక్కడ వినతిపత్రం అందించారు.
– హైదరాబాద్
డబుల్ ఇండ్లు ఇవ్వాలని ఆందోళన
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను అప్పగించాలని లబ్ధిదారులు సోమవారం కందకుర్తి-నవీపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ అక్కడకు చేరుకుని అర్హులకు త్వరలోనే ఇండ్లు అందజేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. -రెంజల్