హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు, బీఆర్ఎస్పై పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక కేటీఆర్‌ను ఏదో కేసులో ఇరికించాలని కుట్రచేస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డి.. కేటీఆర్‌పై కూడా బురద చల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సిండ్రోమ్, కేటీఆర్ ఫోబియా పట్టుకున్నదని విమర్శించారు. కేటీఆర్ బావమరిది తన సొంతింట్లో గృహ ప్రవేశం సందర్భంగా బంధుమిత్రులను పిలిచి దావత్ చేసుకోవడం తప్పా? అని నిలదీశారు. కేటీఆర్ గాని, ఆయన కుటుంబసభ్యులు గాని అక్కడ లేరని చెప్పారు. ఇదంతా సీఎం డైరెక్షన్లో జరుగుతున్నదని, ఇలాంటి కుట్రలు ఎన్నిచేసినా ఆత్మైస్థెర్యం కోల్పోబోమని హెచ్చరించారు. తెలంగాణభవన్‌లో ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, బీఆర్ఎస్ నేతలు వై సతీశ్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రజలకిచ్చిన హామీలు నెలవేర్చలేక, ప్రజల తిరుగుబాటును తప్పించుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే కేటీఆర్‌ను ఇరికించాలని సీఎం రేవంత్‌రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని ధ్వజమెత్తారు.
తమ ఎమ్మెల్యే ఇటీవల ప్రైవేట్ పార్టీకి వెళ్లి వస్తుంటే ఇరికించే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఎలాంటి వారెంట్ లేకుండా రాజ్ పాకాల ఇంటికి పోలీసులు, ఆబారీవాళ్లు వెళ్లి సెర్చ్ చేశారని, వారి వృద్ధ తల్లితోపాటు పిల్లలను, కుటుంబ సభ్యులను పోలీసులు అవమానించేలా, భయపెట్టేలా చేశారని, ఈ చర్యలను ఖండిస్తున్నామని చెప్పారు.పార్టీలో ఫారిన్ లిక్కర్ ఉండటం సహజమేనని, దానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చన్నారు. కానీ, హామీలు నిలబెట్టుకోలేక కేటీఆర్‌ను ఇరికించాలనే దుర్మర్గమైన చర్యలను సహించబోమని హెచ్చరించారు. ‘ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి.. తనపై బురద ఉన్నది.. కాబట్టి కేటీఆర్‌పై కూడా బురద చల్లాలని చూస్తున్నారు’ అని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఇలాంటివి ఎన్నో చూశామని చెప్పారు. ‘రాజ్ పాకాల ఇంట్లో జరిగిన పార్టీలో ఆయన తల్లి, అక్కలు, చెల్లెళ్లు, వాళ్ల పిల్లలు ఉన్నారు. అది రేవ్ పార్టీ అంటూ కొన్ని మీడియా చానళ్లు ప్రసారం చేస్తున్నాయి. ఇది మీకు తగునా?’ అని నిలదీశారు. కొందరు అధికారులు రేవంత్‌రెడ్డికి కీలుబొమ్మలుగా మారారని, మితిమీరి పనిచేసిన అధికారుల చిట్టాను రాసుకుంటామన్నారు. రిటైర్డ్ అయినా తాము అధికారంలోకి వచ్చాక వారిని వదలబోమని హెచ్చరించారు.
రేవంత్‌రెడ్డి చీకటి మిత్రుడు బండి సంజయ్ ముందుగానే ఎలా రియాక్ట్ అవుతున్నారని వివేకానంద నిలదీశారు. రైతులకు రుణమాఫీ, రైతుబంధుపై మాట్లాడని బండి సంజయ్, ప్రైవేట్ పార్టీపై వివరాలు అడుగుతున్నారంటే.. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా? అని ప్రశ్నించారు. ఇది ఆర్ఎస్ బ్రదర్స్ (రేవంత్, సంజయ్) కలిసి చేసిన కుట్ర అని ఎద్దేవా చేశారు. సంజయ్, రఘునందన్‌రావుతో రేవంత్‌రెడ్డి మాట్లాడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డికి సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారని ఎద్దేవాచేశారు. కేటీఆర్‌పై బురద చల్లే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.