Congress Govt | హైదరాబాద్, ఏప్రిల్14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చినా కాంగ్రెస్ 16నెలల పాలనలో హామీని విస్మరించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు 6వేలకు మించి ఉద్యోగాలను ఇవ్వలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు అసెంబ్లీ వేదికగా హడావుడిగా జాబ్‌క్యాలెండర్ ప్రకటించినా, అది జాబ్‌లెస్ క్యాలెండర్గానే మిగిలిపోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు.
నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు నిరీక్షిస్తుంటే ప్రభుత్వం పెద్దలు రేపుమాపు అంటూ దాటవేస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ సర్కారు బూటకపు జాబ్‌క్యాలెండర్ విషయమై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని పేర్కొంది. అయితే ప్రభుత్వ పెద్దలు మాత్రం సాంకేతిక అంశాలను కారణాలుగా చూపుతూ సమర్థించుకుంటున్నారు. కానీ అసలు కారణాలు వేరే ఉన్నాయని ప్రభుత్వవర్గాలు, నిరుద్యోగులు చెప్తున్నారు.
నోటిఫికేషన్ల విడుదల చేయాలంటే ప్రభు త్వ విభాగాల వారీగా ఖాళీలను సేకరించాలి. అవసరమైన మేరకు కొత్త పోస్టులను మంజూరు చేయడం, ఆర్థికశాఖకు పంపి ఆమోదం తీసుకోవాలి. ఆయా ఇండెంట్లు టీజీపీఎస్సీకి, ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు పంపాలి. ఆ తర్వాతే రిక్రూట్మెంట్ ఏజెన్సీలు నోటిఫికేషన్లు ఇచ్చే ప్రక్రియను ప్రారంభిస్తాయి. అందులో ఎక్కడ ఆలస్యం జరిగినా రిక్రూట్మెంట్ ప్రక్రియ ముందుకుసాగదు. అయితే త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తామని తాజాగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించినా వాస్తవ పరిస్థితి భిన్నంగా కనిపిస్తున్నదని నిరుద్యోగులు చెప్తున్నారు.
ఇటీవల ప్రభుత్వంలోని ఏ ఒక్క శాఖలో కూడా పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన దాఖలాలే లేవని వివరిస్తున్నారు. అంటే ఖాళీల గుర్తింపు, సం బంధిత ప్రతిపాదనలు ఆర్థికశాఖకు పంపడం వంటి ప్రాథమిక పనులే జరగలేదని గుర్తుచేస్తున్నారు. ఖాళీల వివరాలు ఇవ్వాలని టీజీపీఎస్సీ ఏడాదిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా ఇప్పటికీ ఇవ్వలేదంటే కాంగ్రెస్ చెప్తున్న మాటలు నమ్మశక్యం కాదని అంటున్నారు. నిరుద్యోగులను ఊరించడం కోసమే ఉత్తమ్ ప్రకటన చేశారని మండిపడుతున్నారు.