ఖైరతాబాద్, అక్టోబర్ 12: దేశంలో ఎంబీసీలను గుర్తించింది కేసీఆర్ సర్కారేనని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. బీసీల్లో వెనుకబడిన వర్గాలను గుర్తించి ప్రత్యేకంగా చేయూతను అందించటం సీఎం కేసీఆర్ మానవీయ దృక్పథానికి నిదర్శనం అని చెప్పారు. ఎంబీసీ కార్పొరేషన్ నూతన చైర్మన్‌గా నియమితులైన నందికంటి శ్రీధర్ అభినందన సభ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ.. మేదర కులానికి చెందిన ప్రజాప్రతినిధి అయిన నందికంటి శ్రీధర్‌ను ఎంబీసీ కార్పొషన్ చైర్మన్‌గా నియమించడం రాష్ట్ర ప్రభుత్వ ఉదాత్త లక్షణాన్ని చూపుతున్నదని తెలిపారు.
రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతున్నదని, ప్రతి సంక్షేమ పథకం పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయని వెల్లడించారు. అనంతరం ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ నందికంటి శ్రీధర్‌ను శాలువా, మెమొంటోతో సత్కరించారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కిశోర్‌గౌడ్, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, మేదర సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మురళీ కృష్ణ, రాష్ట్ర ఎంబీసీ సంఘం అధ్యక్షుడు బెక్కం వెంకట్, బీసీ సమాజ్ అధ్యక్షుడు సంగెం సూర్యారావు, వీరభద్రీయ సంఘం నాయకుడు వీరస్వామి, సంచార కులాల సంఘం జాతీయ అధ్యక్షుడు నరహరి, మేదర సంఘం రాష్ట్ర నాయకులు ప్యారసాని బాలరాజ్, వెంకట్రాములు, ఆరెకటిక సంఘం నాయకుడు నేతీకార్ ప్రేమ్‌లాల్, గంగిరెద్దుల సంఘం నాయకుడు నరసింహం, మేరు సంఘం నాయకుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.