KTR | హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ‘రేవంత్‌రెడ్డీ.. అప్పుల లెక్కలు కాదు.. హామీల లెకలు చెప్పు! వడ్డీల ముచ్చట్లు కాదు.. వాగ్దానాల ముచ్చట్లు చెప్పు! అప్పులపై అబద్ధాలాడటం కాదు.. దమ్ముంటే నీ అసమర్థ పాలనపై శ్వేతపత్రం విడుదల చెయ్యి!’ అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. తాము తొమ్మిదిన్నరేండ్లలో రూ.4,26,499 కోట్ల అప్పు చేస్తే రూ.7 లక్షల కోట్లు అని గ్లోబెల్స్ కూడా సిగ్గుపడేలా రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి పనుల మూలధన వ్యయానికే 74 శాతం నిధులు ఖర్చు చేసిందని, తద్వారా వనరులు పెరిగి ప్రజల ఆదాయం పెరిగిందని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆదాయం మొత్తం అప్పులకే పోతుందని రేవంత్‌రెడ్డి చెప్పడం దారుణమని, రూ.100లో అప్పులకు, వడ్డీకి రూ.47 మాత్రమే చెల్లిస్తున్నారని స్పష్టంచేశారు. 2014లో రూ.364 కోట్ల ఆర్థిక మిగులు ఉంటే, 2023 నాటికి రూ.5,944 కోట్లతో రాష్ర్టాన్ని అప్పగించామని, దేశంలోనే టాప్-2లో ఉంచామని గుర్తుచేశారు. అప్పుల పేరుతో ఇంకెవరైనా తప్పుడు కూతలు కూస్తే బడ్జెట్‌పై అవగాహన లేనట్టేనని స్పష్టంచేశారు. కేవలం 11 నెలల్లో సుమారు రూ.లక్ష కోట్లకు పైగా అప్పు చేసిన రేవంత్‌రెడ్డి ఆ డబ్బును ఏం చేశారని నిలదీశారు. ప్రతి నెలా రూ.6,500 కోట్లు వడ్డీల కింద చెల్లిస్తున్నామని చెప్పడం కూడా అబద్ధమేనని, కాగ్ రిపోర్ట్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ నాటికి కట్టింది రూ.15,152 కోట్లేనని స్పష్టంచేశారు. ‘ఒక హామీని నెరవేర్చకుండా, ఒక ప్రాజెక్టు కూడా కట్టకుండా తెలంగాణ ఆదా యం ఎటుపోతున్నట్టు? ఎనుముల బ్రదర్స్ జేబుల్లోకి వెళ్తోందా? ఢిల్లీ పెద్దల ఖజానా నిండుతున్నదా?’ అని నిలదీశారు. తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాదిలో రాష్ట్రం అధోగతి పాలైందని, ప్రజలు తిప్పల పాలయ్యారని మండిపడ్డారు.
తెలంగాణ కాదు.. ఎనుముల రైజింగ్
‘రాష్ర్టానికి వెయ్యి కోట్ల పెట్టుబడులు ఇచ్చే స్థాయికి ఎనుముల బ్రదర్స్ ఎదిగారని ప్రజలు అనుకుంటున్నరు. వచ్చే ఏడాది ఫోర్బ్స్ జాబితాలో రిచెస్ట్ బ్రదర్స్ ఎవరంటే ఎనుముల బ్రదర్స్ అని వస్తదమో.. అదానీని కూడా దాటేస్తరేమో అని ప్రజలు అనుకుంటున్నరు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘కొత్త పరిశ్రమల మాట దేవుడెరుగు.. ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నయి. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు గండిపేటలో కలిపారు. తెలంగాణ రైజింగ్ అని కొత్త నాటకానికి తెర లేపారు. తెలంగాణ రైజింగ్ కాదు.. ఎనుముల బ్రదర్స్ రైజింగ్. తెలంగాణ ఫాలింగ్.. ఫైలింగ్!. మీడియా మేనేజ్మెంట్ తప్ప 11 నెలల్లో సీఎం చేసిందేమిటో చెప్పాలి’ అని విమర్శించారు.
సోషల్ మీడియా సైనికులకు ధన్యవాదాలు
‘తెలంగాణ అంటే కేసీఆర్ అంటూ అదే శ్రీరామరక్ష అని దేశంతో పాటు వివిధ దేశాల నుంచి పనిచేస్తున్న సోషల్ మీడియా సైనికులకు ధన్యవాదాలు. ఏడాది నుంచి ప్రభుత్వ అరాచకాలు, అక్రమాలు, సాంలపై ప్రజల తరఫున పోరాడిన పార్టీ లీడర్లు, శ్రేణులు అందరికీ అభినందనలు.
దేవుళ్ల ఒట్లు.. హామీలకు తూట్లు
‘నీ ఏలుబడిలో రాష్ర్టానికి రాబడి తెచ్చే తెలివిలేదు. సంపద పెంచే సోయిలేదు. పాజిటివ్ పని చేసిన ముఖం లేదు. తెల్లారి లేస్తే కాకికూతలు.. కేసీఆర్ మీద తిట్లు! దేవుళ్ల మీద ఒట్లు.. ఇచ్చిన హామీలకు తూట్లు! రాష్ట్ర ప్రతిష్ట పెంచాల్సింది పోయి.. దివ్యంగా ఉన్న రాష్ట్రం దివాలా తీసిందని ఆరోపణలు చేసిన దివాలాకోరు సీఎంవి నువ్వు!’ అంటూ నిప్పులు చెరిగారు. ఏడాది నుంచి కారుకూతలతో కుప్పిగంతులతో రేవంత్ టైం పాస్ చేసిండు. నీ శ్వేతపత్రానికి బీఆర్ఎస్ శ్వేతపత్రంతో సమాధానమిచ్చింది. అప్పులపైన చెప్పిన అబద్ధాలకు అసెంబ్లీలోనే సమాధానమిచ్చినం. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు మళ్లీ అప్పులపై డ్రామాలు. ఇకనైనా అప్పుల మీద కాకుండా ఇచ్చిన హామీల అమలు పైన మాట్లాడు. ఎన్నికల ముందు తెలంగాణ ఆర్థిక పరిస్థితి తెలుసని టీవీల ముందు చెప్పినవు. నాడు దొంగ మాటలు.. నేడు కారుకూతలు కూస్తున్నవు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు మీవని చెప్పుకొనే దివాలా కోరుతున్నం రేవంత్‌ది. రేవంత్ ప్రభుత్వం ఇచ్చింది 12 వేల ఉద్యోగాలే! రేవంత్ బండారం బయటపెట్టేలా రాహుల్‌గాంధీకి లేఖ రాస్తా. రేవంత్‌రెడ్డి ఎన్ని తప్పుడు కూతలు కూసినా వదిలిపెట్టను’ అని కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్రంలో రుణమాఫీ పాక్షికంగానే అమలైందని, భట్టి విక్రమార చెప్పిన ప్రకారం కేవలం 12-15 వేల కోట్లు కూడా రైతులకు అందలేదని విమర్శించారు.
అవి ప్రభుత్వ హత్యలే
రాష్ట్రంలో జరుగుతున్న రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని కేటీఆర్ స్పష్టంచేశారు. ‘రాష్ట్రంలో నేత కార్మికుల ఆత్మహత్యలు మొదలైనందుకు విజయోత్సవాలా? ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు విజయోత్సవాలా? ఎందుకు చేస్తున్నా రో సీఎం సమాధానం చెప్పాలి?’ అని నిలదీశారు. గురుకులాల విద్యార్థులను తాము ఎవరెస్టు శిఖరం ఎకిస్తే.. రేవంత్‌రెడ్డి పాడె ఎకిస్తున్నారని మండిపడ్డారు. నిర్వహణ చేతగాక తనపై, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై కుట్ర కేసులు పెడుతున్నారని విమర్శించారు.
5,944 కోట్ల మిగులుతో అప్పగించినం
‘రిజర్వ్ బ్యాంక్, సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం రాష్ట్రం ఆర్థిక మైలురాళ్లు దాటింది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.100 ఖర్చు పెడితే రూ.74 అభివృద్ధి పనులకు (మూలధన వ్యయం) ఖర్చు పెట్టింది. రూ.100కు రూ.53 ఆర్థిక ప్రగతికి అవైలబుల్ ఉంది. ఆదాయమం తా అప్పులకే పోతున్నదని రేవంత్ సర్కారు అబద్ధాలు చెప్తున్నది. రూ.100లో వడ్డీగా చెల్లిస్తున్నది రూ.47. 2014లో 364 కోట్ల రెవె న్యూ సర్క్యులేషన్ ఉండె. 2023లో 5,944 రెవెన్యూ సర్ప్లస్తో రాష్ర్టాన్ని అప్పజెప్పినం. రేవంత్ 7 లక్షల కోట్ల అప్పు అన్నది అతిపెద్ద అబద్ధం. అబద్ధానికి అంగీలాగు తొడిగితే అది రేవంత్‌రెడ్డి. కేసీఆర్‌కు వె య్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఉందంటున్న రేవంత్‌రెడ్డీ.. అధికారం మీ చేతుల్లోనే ఉన్నది కదా? విచారణ జరుపుకోండి’ అంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు.
అప్పులు, వాస్తవాలు
‘పెట్టుబడి, సంక్షేమం కోసం నెట్‌గా చేసిన అప్పు రూ.4,26,499 కోట్లే! బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 6,71,757 అప్పు చేసిందని పదేపదే చెప్తున్నరు. గత డిసెంబర్ 23న మీరు విడుదల చేసిన శ్వేతపత్రంలో 4 రకాల అప్పులు చూపించారు. రెండు రకాల అప్పు లు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదని శ్వేతపత్రంలో స్పష్టంగా చెప్పిండ్రు. గవర్నమెంట్ హామీ లేనివి, ప్రభుత్వం కట్టనివి రూ.59,414 కోట్లని చెప్పిండ్రు. ప్రభుత్వం హామీ ఉండి, ప్రభుత్వం కట్టాల్సిన అవసరం లేనివి రూ.95,462 కోట్లు అన్నరు. మొత్తంగా కట్టాల్సిన అవసరంలేని అప్పులు 1,54,876 కోట్లు! రాష్ట్రం ఏర్ప డే నాటికి ఉన్న పాత అప్పు 72,658 కోట్లు. ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికిల్స్ల ద్వారా గత ప్రభుత్వాలు చేసిన అప్పు 11,609 కోట్లు! కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పు 6,115 కోట్లు! అన్నీ కలిపిన ఈ ప్రభుత్వేతర, పాత అప్పుల మొత్తం 2,45,258 కోట్లను 6,71,757 కోట్ల నుంచి తీసేస్తే 4,26,499 కోట్ల నికర బడ్జెట్ అప్పు మిగులుతది’ అని కేటీఆర్ మరోసారి స్పష్టత ఇచ్చారు.
గోబెల్స్‌ను మించి ప్రచారం
‘60 ఏండ్లలో రాష్ట్రం చేసిన అప్పును రేవంత్‌రెడ్డి కేవలం 11 నెలల్లో దాటేశారు. 11 నెలల పాలనలో రేవంత్‌రెడ్డి లక్ష కోట్లపైనే అప్పు చేశారు. 2024 డిసెంబర్ మూడో తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర కార్పొరేషన్ల నుంచి 85 వేల కోట్ల అప్పు తీసుకున్నది. దీనికి అదనంగా రూ.29.87 వేల కోట్లు వివిధ కార్పొరేషన్లు తీసుకున్నయి. ఈ లెక కేవలం ఆగస్టు వరకే. ఆ తర్వాత కార్పొరేషన్లు తీసుకున్న అప్పుల వివరాలను ప్రభుత్వం మాయం చేసింది. రేవంత్‌రెడ్డి ప్రతినెలా రూ.6,500 కోట్లు వడ్డీలు, అప్పులకు కడుతున్నామని చెప్తున్న మాటశుద్ధ తప్పు’ అని కేటీఆర్ స్పష్టంచేశారు. ‘బడ్జెట్ పత్రాల ప్రకారం నెలకు రూ.2,900 కోట్ల చొప్పున 12 నెలలకు కట్టింది రూ.34,730 కోట్లు మాత్రమే. నెలకు రూ.3,600 కోట్లు ఎకడ పోతున్నాయో రేవంత్ ప్రభుత్వం చెప్పాలి. కాగ్ రిపోర్ట్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ నాటికి కట్టింది రూ.15,152 కోట్లే! ఈ లెక్కన నెలకు 2,164 కోట్లే చెల్లిస్తున్నరు. ఒక హామీ నెరవేర్చకుండా, ఒక ప్రాజెక్టు కట్టకుండా, తెలంగాణ ఆదాయం ఎటు పోతున్నట్టు? ఎనుముల బ్రదర్స్ జేబుల్లోకి వెళ్తున్నదా? ఢిల్లీ పెద్దల ఖజానా నిండుతున్నదా?’ అని నిలదీశారు. ‘అప్పుల పేరుతో తప్పుడు కూతలు కూస్తూ అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సీఎం వెంటనే రాజీనామా చేయాలి. కోకాకోలా కంపెనీని మేము తెస్తే ఫోజులు కొట్టి సీఎం ప్రారంభించారు. మరి ఈ రూ.లక్ష కోట్లు ఎకడ పోయాయో శ్వేతపత్రం విడుదల చేయాలి.. అని డిమాండ్ చేశారు.
నియంత పాలన
‘ముఖ్యమంత్రి నియంతలా పాలన చేస్తున్నారు. ఉన్న సిటీని నాశనం చేసి ఫోర్త్ సిటీ ఎందుకు? నడుస్తున్న ఎస్ఆర్డీపీని నాశనం చేస్తున్నారు. వాటర్ వర్స్ పనులన్నీ ఆగిపోయాయి. హైదరాబాద్‌ను పూర్తిగా నాశనం చేస్తున్నారని అధికారులే స్వయంగా చెప్తున్నారు. రేవంత్‌రెడ్డికి తెలిసింది రియల్ ఎస్టేట్ మాత్రమే. పాలన చేయడం చేతకావడం లేదు’ అని కేటీఆర్ మండిపడ్డారు.
25 లక్షలకు ఎకరం రేవంత్ ఇస్తారా?
‘భూసేకరణ ఎందుకు చేస్తున్నరో కూడా రేవంత్‌రెడ్డికి తెలియదు. 15 వేల ఎకరాలు అందుబాటులో ఉన్నప్పుడు మళ్లీ 15 వేల ఎకరాలు ఎందుకు? రేవంత్‌రెడ్డి కుటుంబానికి కొండారెడ్డిపల్లిలో, వెల్దండలో 500 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిని ఫోర్త్ సిటీ కోసం, ఫార్మా కోసం ఇస్తావా? ఎకరానికి రూ.20 లక్షలు ప్రభుత్వం దగ్గర తీసో.. ఇంకా 5 లక్షలు బీఆర్ఎస్ కలిపి ఇస్తుంది. ఎకరానికి 25 లక్షల చొప్పున రేవంత్ రెడ్డి వెల్దండలో ఉన్న భూములు ఇస్తాడా..? ఇస్తే అకడే ఫార్మా కంపెనీ పెడదాం. రేవంత్ కుటుంబానికి ఒక నీతి? గిరిజనులకు ఇం కొక నీతా?’ అని కేటీఆర్ నిలదీశారు. సమావేశంలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, మెతుకు ఆనంద్, దుర్గం చిన్నయ్య, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ పాల్గొన్నారు.
వాస్తవాలు ఎందుకు దాస్తున్నరు?
కాళేశ్వరం లేకుండా రికార్డు స్థాయిలో పంటలు పండించినమని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2014 ముందు ఎందుకు పంటలు పండించలేదని కేటీఆర్ నిలదీశారు. నాడు ప్రాజెక్టులు ఉన్నా పంటలు పండించని దానిపై ముఖ్యమంత్రి, మంత్రులు జవాబు ఇస్తారా? అని ప్రశ్నించారు. పదేండ్లలో రైతన్న ముఖచిత్రాన్ని మార్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే రికార్డు సన్నాళ్లకు బోనస్ ఇచ్చిమని చెప్పి రైతుబంధు ఎగ్గొట్టిన తీరు గురించి.. రాష్ట్రంలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రికి చెప్పాలని హితవుపలికారు. రాష్ట్ర ప్రభుత్వం నిజాలను దాచి పెడుతున్నదని, సమాచార హకు చట్టం కింద ఇచ్చిన అప్లికేషన్లను సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వాస్తవాలు బయటకు రావద్దన్న ఉద్దేశంతోనే గురుకులాల్లో బీఆర్ఎస్వీ నాయకులను పోనివ్వడం లేదని మండిపడ్డారు.
లగచర్ల ఫార్మా విలేజ్ ఒక్కటే రద్దా?
లగచర్ల ఏర్పాటుచేయబోయే ఫార్మా విలేజ్ ఒక్కదానినే రద్దు చేస్తున్నారా? రాష్ట్రంలో తలపెట్టిన 20 ఫార్మా విలేజీలను రద్దు చేస్తున్నారా? చెప్పాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘భూసేకరణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలసీనా లేదా కొడంగల్కేనా అనేది కూడా చెప్పా లి. రెండు పంటలు పండే భూములను భూసేకరణ చేయొద్దని రేవంత్‌రెడ్డి గతంలో అనేకసార్లు అసెంబ్లీలో చెప్పారు. 80 శాతం మంది రైతులు ఒప్పుకోకుంటే భూసేకరణ చేయాలని అన్నాడు. డీపీఆర్ లేకుండా భూసేకరణ చేయొద్దు అని చెప్పిండు. మరి కొడంగల్‌లో ఆదానీ వస్తాడా? అల్లుడి కంపెనీ వస్తుందా? తెలవకముందే భూసేకరణ ఎందుకు చేస్తున్నారు’ అని కేటీఆర్ నిలదీశారు.
మా లెక్క ఇదిగో..బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పులపై రేవంత్‌ది దుష్ప్రచారం. పదేండ్లలో మేం తెచ్చింది 4.26 లక్షల కోట్ల్లే. తీసుకొచ్చిన అప్పుల్లో 70-80 శాతం అభివృద్ధి పనులకు (మూలధన వ్యయం) కింద ఖర్చు చేశాం. వాటి ద్వారా నిర్మాణాత్మక ప్రగతి సాధించాం. తెలంగాణ స్వయం సమృద్ధికి బాటలు పరిచాం. అభివృద్ధిలో రాష్ర్టాన్ని అగ్రస్థానాన నిలబెట్టాం.
నువ్వేం చేశావ్?
60 ఏండ్లలో ఏ ప్రభుత్వమూ చేయనన్ని అప్పులను 11 నెలల్లోనే చేశావ్. లక్ష కోట్లకుపైనే రుణాలు తెచ్చినవ్. వాటితో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టినవా? కొత్తగా ఒక్క పథకమైనా ప్రారంభించినవా? మరి అప్పులు చేసి తెచ్చిన సొమ్ము ఏమైనట్టు? ఒక హామీ నెరవేర్చకుండా, ఒక ప్రాజెక్టు కట్టకుండా, తెలంగాణ ఆదాయం ఎటు పోతున్నట్టు? ఎనుముల బ్రదర్స్ జేబుల్లోకి వెళ్తున్నదా? – కేటీఆర్
11 నెలల్లో లక్ష కోట్ల అప్పు!
ప్రతినెలా వడ్డీలకు రూ.6,500 కోట్లు కడుతున్నామని రేవంత్ చెప్తున్న మాటశుద్ధ తప్పు. బడ్జెట్ పత్రాల ప్రకారం నెలకు 2,900 కోట్ల చొప్పున 12 నెలలకు కట్టింది 34,730 కోట్లు మాత్రమే. మరి నెలకు రూ.3,600 కోట్లు ఎటు పోతున్నయ్? -కేటీఆర్