హైదరాబాద్, జూలై 29 (నమస్తేతెలంగాణ): నర్సింగ్ కౌన్సెలింగ్‌లో గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దరఖాస్తు చేయకపోయినా కౌన్సెలింగ్‌లో పేరు వచ్చిందని ఏడో జోన్ పరిధిలోని 2021, 2022 బ్యాచ్‌లకు చెందిన పలువురు నర్సింగ్ ఆఫీసర్లు వాపోతున్నారు. మంగళవారం జరిగే కౌన్సెలింగ్‌కు సంబంధించి అధికారులు ఏడో జోన్‌లోని నర్సుల సీనియార్టీ జాబితాను విడుదల చేశారు. ఇందులో దాదాపు 25మంది 2021 బ్యాచ్ కు చెందినవారు ఉన్నారు. బదిలీ కోసం వారు రిక్వెస్ట్ చేసుకున్నట్టు అందులో పేర్కొన్నారు. జాబితాలో తమ పేర్లు చూసుకొని పలువురు అభ్యర్థులు అవాక్కవుతున్నారు. బదిలీ కోసం తాము దరఖాస్తు చేసుకోలేదని, అయినా తమ పేరు ఎలా వచ్చిందో తెలియదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఉద్యోగంలో చేరి కనీసం మూడేండ్లు కూడా పూర్తికాలేదని చెప్తున్నారు. ప్రొబేషనరీ కాలం కూడా పూర్తి కాని వీరు.. కౌన్సెలింగ్‌కు వెళ్లాలో, లేదో తెలియక సతమతం అవుతున్నారు.
డీపీహెచ్ పరిధిలో జరుగుతున్న బది‘లీల’ల్లో మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల విడుదల చేసిన ఏడో జోన్‌లోని ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 సీనియార్టీ లిస్ట్‌లో టీవీవీపీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా చేర్చారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సత్యానారాయణరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సంహిత కుమారి పేర్లను సీనియార్టీ జాబితాలో చేర్చారు. దీంతో వారు అవాక్కయ్యారు. తాము డీపీహెచ్ పరిధిలోకి రామంటూ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో డీఎంహెచ్‌వో స్పందించి.. వారిని సీనియార్టీ జాబితా నుంచి తొలగించాలంటూ డీపీహెచ్‌కు లేఖ రాశారు. మరోవైపు ఫార్మసిస్ట్ గ్రేడ్-1, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -1 ఉద్యోగుల బదిలీపై ఉత్కంఠ కొనసాగుతున్నది. గతంలో వారికి కౌన్సెలింగ్ ప్రారంభించినా.. మధ్యలోనే ఆపేశారని చెప్తున్నారు. వారికి తిరిగి కౌన్సెలింగ్ నిర్వహిస్తారో లేదో తెలియడం లేదని చెప్తున్నారు.