హైదరాబాద్, జూలై 16(నమస్తే తెలంగాణ) : పదోతరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రం ఎలా? ఉంటుంది. వ్యాసరూప ప్రశ్నలెన్ని? ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలెన్ని? అన్న అం శంపై స్పష్టత కొరవడింది. దేంట్లో ఎన్ని ప్రశ్నలిస్తారు.. వేటికి ఎన్ని మార్కులుంటాయన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఇదివరకు పదోతరగతిలో 80 మార్కులకు వార్షిక పరీక్షలు, 20 మార్కులకు ఇంటర్నల్స్ ఉండేవి. ఈ విధానం లో విద్యాశాఖ మార్పులు చేసింది. వార్షిక పరీక్షలను 100 మార్కులకు నిర్వహిస్తామని గతంలోనే ప్రకటించింది.
ఇంటర్నల్స్ యథావిధిగా నిర్వహిస్తామని విద్యాశాఖ పేర్కొన్నది. ఇంటర్నల్స్ నిర్వహించినా.. ఆయా మార్కులను పబ్లిక్ పరీక్షల్లో లెక్కలోకి తీసుకోబోమని స్పష్టంచేసింది. 100 మార్కులకు బ్లూప్రింట్ ఇంకా సిద్ధం కాలేదు. సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ)-1 పరీక్షలను అక్టోబర్ 24 నుంచి 31 వరకు నిర్వహించాల్సి ఉంది.
అంతలోపే ప్రశ్నపత్రాల బ్లూప్రింట్‌ను సిద్ధం చేయాలి. కానీ ఇంతవరకు బ్లూప్రింట్ విడుదల చేసిన దాఖలాల్లేవు. ఇదే విషయంపై క్షేత్రస్థాయి నుంచి అనేక ప్రశ్నలొస్తున్నాయి. పాత పద్ధతా.. కొత్త పద్ధతా? అంటూ హెచ్ఎం లు, ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్లు విద్యాశాఖ అధికారులను ఆరా తీస్తున్నారు. పరీక్షలకు ముందు హడావుడిగా ఇస్తే గందరగోళానికి దారితీసే ప్రమాదముంది.
ఇటీవల ఎస్సీఈఆర్టీ అధికారులు బ్లూప్రింట్ రూపకల్పనపై చర్చలు జరిపారు. 75 మార్కులకు థియరీ, 25 మార్కులకు ఆబ్జెక్టివ్ ప్రశ్నపత్రాలివ్వాలని అభిప్రాయపడినట్టు సమాచారం. అధికారులు పదోతరగతి ప్రశ్నపత్రాలపై ఏదో ఒక స్పష్టత ఇవ్వాలని, బ్లూప్రింట్‌ను త్వరగా విడుదల చేయాలని టీచర్లు కోరుతున్నారు.