Local Body Elections | హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై గందరగోళం నెలకొన్నది. జనవరి చివరి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి 15లోగా సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం అడుగు ముందుకుపడటం లేదు. జనవరి నెల మూడో వారం పూర్తికావస్తున్నా దానిపై స్పష్టత రావడం లేదు. రాష్ట్రంలో వివిధ కులాల జనాభా, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులు తెలుసుకునేందుకు చేపట్టిన కులగణన సర్వేకు మంత్రివర్గ ఆమోదం లభించలేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కేటాయింపు లక్ష్యంగా నియమించిన డెడికెటేడ్ కమిషన్ నివేదిక అందలేదు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేదు.
ఏడాదైనా సందిగ్ధమే..
సర్పంచుల పదవీకాలం ముగిసి దాదాపు ఏడాది కావస్తున్నది. అయినప్పటికీ ఎన్నికల నిర్వహణపై ఏర్పడిన సందిగ్ధ్దం తొలగడం లేదు. క్షేత్రస్థాయి నాయకత్వం నుంచి ఒత్తిడి పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం ఈ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు త్వరలోనే ఎన్నికలంటూ తరచూ ఊదరగొడుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. 42 శాతం బీసీ కోటా కేటాయింపు, కులగణన సర్వేకు చట్టబద్ధతపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నదని అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తే ఎదురుదెబ్బ తగలడం ఖాయమని లోలోన దిగులు పడుతున్నారు. దీంతో ఈ నెల 26 నుంచి రైతుభరోసా, రైతుకూలీలకు నగదు చెల్లింపు, ఇందిరమ్మ ఇండ్ల పథకం, రేషన్‌కార్డుల పంపిణీని పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే క్యాడర్ నీరుగారిపోకుండా ఉండేందుకే త్వరలోనే స్థానిక ఎన్నికలంటూ ఊదరగొడుతున్నట్టు తెలుస్తున్నది.
చట్టపరమైన చిక్కుముడులెన్నో..
రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా ఎన్నికలకు చట్టపరమైన చిక్కుముడులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రం అనుమతి లేకుండానే చేపట్టిన కులగణన నివేదికను బహిర్గతం చేయడం ద్వారా న్యాయపరమైన సమస్యలు ఎదురుకానున్నాయి. గతంలో బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో చేపట్టిన కులగణన కోర్టుల్లో నిలబడలేదు. ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రంలో చేపట్టిన కులగణన నివేదికను బహిర్గతం చేస్తే దానిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే సర్కారుకు చుక్కెదురయ్యే అవకాశాలు ఉంటాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. గతంలో వివిధ రాష్ట్రాల్లో ఎదురైన పరిస్థితులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను వారు ఉదహరిస్తున్నారు.
42 శాతం కోటా తేల్చడం కష్టమే..
బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఇందుకోసం బీసీ కమిషన్ ఏర్పాటుతో పాటు కులగణన చేపడుతున్నామని చెప్పింది. అయితే బీసీ కమిషన్‌కు రిజర్వేషన్లు ప్రతిపాదించే అధికారం లేదని బీసీ సంఘాలు, న్యాయకోవిదుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వం నవంబర్ 4న డెడికేటేడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి వివరాలు సేకరించింది. కానీ, ఇప్పటివరకు ప్రభుత్వానికి నివేదిక అందించలేదు. అయితే ఈ కమిషన్ 42 శాతం ఇవ్వాలని ప్రతిపాదించినా ఆచరణ సాధ్యంకాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో 50 శాతం కోటా దాటితే కోర్టుల్లో చెల్లుబాటు కాదని పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ట్రిపుల్ టెస్ట్ పాసయ్యే అవకాశం ఎంత మాత్రం లేదంటున్నారు.
ఆలస్యం అనివార్యం..
ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొనడం, మరోవైపు చట్టపరమైన చిక్కులు కొలిక్కివచ్చే అవకాశాలు లేకపోడంతో ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు వారాల్లో సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేస్తామని ఎలక్షన్ కమిషన్ అధికారులు చెబుతున్నా ప్రభుత్వం మాత్రం ఇందుకు సంసిద్ధత తెలపడం లేదు. ఎందుకంటే పథకాల ఫలాలు అందకపోవడం, చట్టపరమైన ఇబ్బందుల నేపథ్యంలో కక్కలేని, మింగలేని పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. ఈ వ్యవహారాలన్నీ కొలిక్కి వచ్చిన మీదటే స్థానిక ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది. ఇందుకు సుమారు మూడు, నాలుగు నెలలు పట్టే అవకాశం లేకపోలేదు.
రాజ్యాంగ సవరణ తప్పనిసరి..
ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం కోటాకు మించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరని న్యాయకోవిదులు చెబుతున్నారు. మరి కేంద్రం అందుకు అనుమతిస్తుందా? అనే విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక రాష్ట్రానికి అనుమతి ఇస్తే దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇదే డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో చట్ట సవరణకు అంగీకరించే పరిస్థితులు ఎంత మాత్రం కనిపించడం లేదు. ఒకవేళ బీసీ రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలకు వెళ్తే ఆయా వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు బీసీ వర్గానికి చెందిన మంత్రులు సైతం ఇందుకు ఒప్పుకొనే అవకాశాలు కపిపించడం లేదు.