Sankranti Holidays | హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సెలవులపై గందరగోళం నెలకొన్నది. ఇప్పటివరకు ఉన్న సెలవుల ప్రకారం పండుగ తెల్లారే బడులు పునఃప్రారంభం కావాల్సి ఉంది. దీంతో సెలవులు ముగిసిన వెంటనే బడులు రీ ఓపెన్ సాధ్యమేనా..? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. విద్యాశాఖ 2026 జనవరి 11 నుంచి 15 వరకు బడులకు సంక్రాంతి సెలవులు ఇచ్చింది. మొత్తం ఐదు రోజులపాటు సెలవులుగా అకాడమిక్ క్యాలెండర్లో ప్రకటించింది. జనవరి 10న రెండో శనివారం కావడంతో ఒక రోజు అదనంగా సెలవు రానున్నది. ఈ నెల 6న ప్రభుత్వం సెలవుల జీవో విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం జనవరి 15న సంక్రాంతి పండుగ ఉంది. జనవరి 16న కనుమ కాగా, ఈ రోజు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు.
ఏడాదిలో 26 ఆప్షనల్ హాలిడేస్ ఉండగా, వీటిలో ఏదైనా ఐదు మాత్రమే వాడుకునే వీలుంది. అంటే ఈ లెక్కన పండుగ తెల్లారే స్కూళ్లు రీ ఓపెన్ కావాల్సి ఉంది. జనవరి 16న స్కూళ్లు పునఃప్రారంభం కావడం కష్టమని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. విద్యార్థులు కూడా బడులకు రాలేరని, తల్లిదండ్రులు పంపించరని అంటున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు జనవరి 18 వరకు సంక్రాంతి పండుగ సెలవులు ఇచ్చి, 19న స్కూళ్లు రీ ఓపెన్ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ అధికారులను కోరుతున్నాయి.