Padi Kaushik Reddy | కరీంనగర్ కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించిన సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. రైతుల పక్షాన ప్రశ్నించినందుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి దిగారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ఆయన్ను పోలీసులు బలవంతంగా బయటకు లాక్కెళ్లారు.
ఆదివారం కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పథకాల గురించి చర్చ జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా.. ఆయన్ను కౌశిక్ రెడ్డి నిలదీశారు. ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావంటూ ప్రశ్నించారు. దళితులు, రైతుల పక్షాన కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. దీంతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య వాగ్వాదం నెలకొంది. అది కాస్త తోపులాటకు దారితీయడంతో కౌశిక్ రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు.
కాగా, బయటకు వచ్చిన అనంతరం పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ బీఫామ్‌తో గెలిచి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేని అంటూ చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ తరఫున మాట్లాడితే మేం చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్టా అని నిలదీశారు. వందల మంది పోలీసులతో నన్ను లాక్కొచ్చారని చెప్పారు. కచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన స్పష్టంచేశారు.
కరీంనగర్ జిల్లా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా మైక్ గుంజుకున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
సంజయ్‌ను “ఒరేయ్ ఏ పార్టీరా నీది” అంటూ సంబోధించిన కౌశిక్ రెడ్డి pic.twitter.com/yqoI3e0FWq
— Telugu Scribe (@TeluguScribe) January 12, 2025