సూర్యాపేట టౌన్: తెలంగాణ ఆడబిడ్డలైన అంగన్వాడీ టీచర్లపై (Anganwadi Teachers) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాటి రజాకార్లను తలదన్నెలా దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నాడని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంపటి గురూజీ అన్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని శాంతియుతంగా హైదరాబాద్ వెళుతున్న అంగన్వాడీ టీచర్లను అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టయిన అంగన్వాడీ టీచర్లను ఆయన సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగన్వాడీ వర్కర్లకు వేతనాన్ని రూ.20వేలకు పెంచుతామని హామీ ఇచ్చారని, మంత్రి సీతక్క సైతం రూ.18 వేలు చేస్తామని అసెంబ్లీలో చెప్పారన్నారు. అయినా నేటి వరకు పెంచకపోవడం దుర్మార్గమన్నారు.
ప్రస్తుతం ప్రజా ప్రతినిధుల రోజువారి ఖర్చుతో పోలిస్తే అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే వేతనం 100 రెట్లు తక్కువేనని చెప్పారు. అంగన్వాడీ టీచర్లతో వెట్టి చాకిరి చేయించుకుంటూ కనీస వేతనాలు ఇవ్వకపోగా, వారిని దొంగలుగా చిత్రీకరిస్తూ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని, వారి బ్యాగులు చెక్ చేయాలని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు నాటి రజాకార్ల ఆలోచనలను తలపిస్తున్నాయన్నారు. గుజరాత్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన విధంగా తెలంగాణలో కూడా అంగన్వాడీ వర్కర్లకు ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన సమస్యల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ వెళ్తున్న టీచర్లను అరెస్టు చేయడం దారుణమని, ఈ చర్యను ప్రజాసామిక వాదులంతా ఖండించాలన్నారు. అంగన్వాడీ టీచర్లు పోరుబాట పట్టారని సమస్యలు పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తారని హెచ్చరించారు. ప్రభుత్వం, మంత్రులు అంగన్వాడీల పట్ల ఆచితూచి మాట్లాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు తంతెనపల్లి సుజాత, గుద్దేటి శారద, జ్యోతి కలకోట జ్యోతి, గుండ గాని జానకమ్మ, ఉష, సంధ్యారాణి, ఆర్. జానకమ్మ, భాగ్యలక్ష్మి, పద్మ తదితరులు ఉన్నారు.