Telangana | హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, నియోజకవర్గం అభివృద్ధికి నిధులు అడుగుదామని ఇంటికి వచ్చిన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ఉల్టా క్లాస్ పీకి పంపినట్టు సమాచారం. నిధులు అడుగుదామని ఎమ్మెల్యేలు నోరు తెరిచేలోపే ముఖ్యమంత్రి అందుకొని, ముగ్గురు మంత్రులు, 35 మంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగాలేదని, వారు తమ నియోజకవర్గానికి, ప్రజలకు దూరంగా ఉంటున్నారని అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. అందరి ప్రోగ్రెస్ రిపోర్టులు తన దగ్గర ఉన్నాయని చెప్పడంతో ఎమ్మెల్యేలు అవాక్కైనట్టు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లటం లేదని, తమ బంధువర్గాలను ముందుపెట్టి నియోజకవర్గాల్లో పాలన కొనసాగిస్తున్నారని సీఎం హెచ్చరించినట్టు తెలిసింది. తన వద్ద నిఘా వర్గాల నివేదికలు, రాజకీయ వ్యూహకర్త రహస్య సర్వే నివేదికలు ఉన్నాయని, అందరినీ ఒకసారి పిలిచి నివేదికలు బయట పెడతానని చెప్పినట్టు తెలిసింది. దీంతో.. గెలిచిననాటి నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అభివృద్ధి నిధులు ఇవ్వలేదు కానీ, ఉల్టా ప్రజల్లోకి వెళ్లటం లేదని తమను నిలదీయటం ఏమిటంటూ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఏం సాధించామని ప్రజల్లోకి వెళ్లి చెపుకోవాలని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
మాకిచ్చిన హామీలు కూడా నెరవేరలేదు
మౌలిక వసతుల కల్పన, గ్రామాల్లో మురికి కాల్వల నిర్మాణం, చెడిపోయిన రోడ్ల మరమతులు, సీసీ రోడ్ల నిర్మాణం తదిరత అభివృద్ధి పనుల కోసం ఒక్కొక్క నియోజకవర్గానికి రూ.50 కోట్ల చొప్పున నిధులు ఇస్తామని గతంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు ఆవేదన వ్యక్తంచేశారు. గత ఆగస్టులో కొత్త రహదారుల నిర్మాణం, గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం రూ.50 కోట్ల విలువైన అంచనాలతో ప్రతిపాదనలు పంపాలని కోరారని, తాను నిజమేనని నమ్మి అప్పటికప్పుడు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించానని కానీ ఇంతవరకు ఆ మాటే ఎత్తడం లేదని సదరు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తన అనుభవాన్ని వివరిస్తూ.. అత్యంత వెనుకబడిన తన నియోజకవర్గానికి తక్షణమే రూ.200 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపగా.. ఆర్అండ్బీ, పంచాయితీరాజ్‌శాఖ అధికారులు పిలిపించి ఆ ప్రతిపాదనలను రూ.50 కోట్లకు కుదించాలని చెప్పారని అన్నారు. రెండు మూడు రాత్రులు కసరత్తు చేసి రూ.70 కోట్లకు కుదించామని, కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదని అసహనం వ్యక్తం చేశారు.
పంచాయతీరాజ్, రహదారులు-భవనాల శాఖకు రూ.12 వేల కోట్లు మంజూరు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదని వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువ ఎమ్మెల్యే వాపోయారు. గ్రామాలకు ధైర్యంగా వెళ్లి కనీస పనులకు శంకుస్థాపనలు చేసే పరిస్థితి లేదని ఖమ్మం జిల్లా నుంచి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే ఒకరు ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అభివృద్ధి నిధులు లేకుంటే.. కనీసం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పట్టుకొనైనా గ్రామాల్లోకి వచ్చేవారని, తమకు ఆ చెక్కులు కూడా అందటం లేదని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి, నిధులు అడుగుదామని వెళ్లిన తమకు సర్వే నివేదికలు అంటూ భయపెట్టడం సరైన పద్ధతి కాదని వారు అంటున్నారు. ప్రభుత్వమే నిధులు ఇవ్వనప్పుడు తామేం చేయగలమని, తమను బద్నాం చేస్తే ఏమొస్తుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఏం సాధించామని వెళ్లాలి?
ఆరు గ్యారంటీల అమలు కాలేదు, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, చేయూత, రూ 4 వేల నిరుద్యోగ భృతి, పెళ్లి చేసుకున్న ఆడబిడ్డకు తులం బంగారం, రూ. లక్ష ఏ ఒక్క పథకం కూడా ఇప్పటికీ ముందుకు సాగకపోవడంతో తాము ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారు. ‘హామీ ఇచ్చిన మేరకు సంక్షేమ పథకాలు అమలు జరిగి ఉంటే.. ఎమ్మెల్యేలుగా వారి వద్దకు వెళ్లి పథకాలు అందాయా? లేదా? అని అడుగుతూ.. ప్రజల్లోనే ఉండే వాళ్లం. గ్రామంలో ఓ ఐదు మందో.. పది మందో మాకు ఫలాన పథకం అందలేదని ఫిర్యాదు చేస్తే.. అక్కడే తాసీల్దారునో, ఎంపీవోనో పిలిపించి.. ఇగో.. మా వాళ్లకు అర్హత ఉన్నా కూడా పథకం అందలేదు ఎందుకు? అని నిలదీస్తే.. జనంలో మాకింత మంచి పేరు వచ్చేది. కానీ మేమే ఒక్క పథకం అమలు చేయనప్పుడు ప్రజల్లోకి ఎట్టా పోవాలి?’ అని నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు వాపోయారు.