హైదరాబాద్, ఏప్రిల్15 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్సభ, అసెంబ్లీ స్థానాల డీలిమిటేషన్లో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు తీరని నష్టం కలుగనున్నది. దేశవ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారమే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే ఆయా వర్గాల సీట్ల సంఖ్య పెద్దగా పెరిగే అవకాశం ఉండదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 2026లో చేపట్టనున్న కులగణన, జనాభా గణన లెక్కలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించ లేదు. ఈ విషయంలో స్పష్టతనివ్వడం లేదు.
ఒకవేళ 2011లెక్కలనే పరిగణనలోకి తీసుకొంటే ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పార్లమెంట్ సీట్లలో తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నది. దళిత, గిరిజనులు నష్టపోవాల్సి వస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 330 ప్రకారం లోక్సభ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారమే రిజర్వేషన్లు కల్పించాలి. అందులో భాగంగానే 2011లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీల జనాభా 24 శాతంగా ఉన్నది. ఈ మేరకు ఎస్సీల జనాభా 15.4 శాతం ప్రకారం లోక్సభలో 84 స్థానాలు కేటాయించారు.
గిరిజన జనాభా 8.6 శాతం ప్రకారం 47 సీట్లను వారికి రిజర్వ్ చేశారు. మొత్తం 543 స్థానాల్లో 131 స్థానాలు ఆయా వర్గాలకు రిజర్వ్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం 2011 లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే ఆ మేరకే స్థానాలు పెరుగుతాయి. ప్రస్తుతం కేంద్రం జనాభా దామాషా ప్రకారం కాకుండా 50 శాతం అదనంగా లోక్సభ స్థానాలను 850కు పెంచాలని భావిస్తున్నది. ఆ మొత్తంలో 24శాతం స్థానాలంటే 204 స్థానాలు లభిస్తాయి. ప్రస్తుతం అమలవుతున్న స్థానాల కంటే అదనంగా మరో 73 స్థానాలు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అదనంగా దక్కుతాయి. కానీ ఇది దళిత, గిరిజనులకు తీరని నష్టమే.
2011లెక్కలతో పోల్చినప్పుడు ప్రస్తుతం దేశంలో దళిత, గిరిజనుల జనాభా సైతం పెరిగింది. ఎస్సీ జనాభా 15.4 శాతం కంటే అధికంగా 20 శాతం వరకు, ఎస్టీ జనాభా 12 శాతానికి పైగా పెరిగినట్టు అంచనా. మొత్తంగా జనాభాలో 32 శాతం వరకు ఎస్సీ, ఎస్టీల జనాభా శాతం పెరిగిందనేది అంచనా. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అడ్డదిడ్డంగా నిర్వహించిన సమగ్ర ఇంటింటి సర్వే గణాంకాలు సైతం ఎస్సీ, ఎస్టీల జనాభా పెరుగుదలను స్పష్టం చేస్తున్నాయి. జనాభా దామాషా ప్రకారం లోక్సభలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను కల్పించాలి. అంటే 2011 లెక్కల ప్రకారమే సీట్లను కేటాయిస్తే ఎస్సీ, ఎస్టీలకు 24 శాతం మాత్రమే దక్కుతాయి.
ఒకవేళ తాజాగా సేకరించిన జనాభా గణాంకాలను ఆధారంగా చేసుకొంటే ఆ మేరకు ఆయా వర్గాల రిజర్వ్ స్థానాలు సైతం పెరుగుతాయి. ఒకవేళ అదే జరిగితే ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదించిన 850 సీట్ల పెంపుదలలో ఎస్సీ, ఎస్టీలకు 32 శాతం సీట్లను అంటే దాదాపు 272 స్థానాలు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుత స్థానాల కంటే ఇవి 141 స్థానాలు అధికం. 2011 లెక్కలనే పరిగణనలోకి తీసుకొంటే ఎస్సీ, ఎస్టీ వర్గాలు దాదాపు 68 స్థానాలను కోల్పోవాల్సి ఉంటుంది. ఇది దళిత, గిరిజనులకు తీరని అన్యాయం చేసినట్టే. కేంద్రం జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్నా కూడా 50 శాతం మాత్రమే లోక్సభ స్థానాల పెంపు నిర్ణయం వల్ల నష్టపోయేది దళిత, గిరిజనులే.