Farmers | ‘తలాపునే పారుతోంది గోదారి.. మన చేను, మన చెలక ఎడారి’ అన్నట్లుగా తయారయింది ఆయకట్టు రైతుల పరిస్థితి. పదేండ్లుగా పసిడి పంటలు పండించిన రైతులు మళ్లీ బీళ్లవుతున్న భూములను చూసి గుండెలు బాదుకుంటున్నారు. ప్రాజెక్టు కిందనే పొలాలు ఉన్నా సాగునీరు అందని దుస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రాజెక్టుల్లో నీళ్లు వదలకపోవడంతో పొట్టకొచ్చిన వరి పంటను కాపాడుకోవడానికి నానాకష్టాలు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు పదే పదే వినతులు సమర్పించినా పట్టించుకోకపోవడంతో, కడుపుమండి రోడ్డెక్కుతున్నారు. నీళ్లడిగితే కేసులు పెడతామని అధికారులు బెదిరించినా.. అదరకుండా పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. చివరి ఆయకట్టు వరకూ నీళ్లివ్వాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
-నమస్తే తెలంగాణ, న్యూస్ నెట్వర్క్
నాకున్న నాలుగున్నర ఎకరాల్లో వరి పంట వేసిన. రెండెకరాలు ఎండి పోయింది. నీళ్లు ఇవ్వక పోతే మిగిలింది కూడా పోతది. వేలకు వేలు ఖర్చు పెట్టి కాపాడుకుంటే పొట్టకచ్చినంక ఒక్క ఇత్తు కూడా ఇంటికి రాదు. దండంపెడుతున్నం సార్.. నీరందిస్తే బతుకుతం.
-రాజయ్య, ముంజంపల్లి, జగిత్యాల జిల్లా
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన దండరవేని రజినీకాంత్కు అన్నపూర్ణ ప్రాజెక్టు సమీపంలో మూడెకరాలు ఉన్నది. అందులో ఎనిమిదేండ్లుగా వరి సాగు చేస్తున్నాడు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సాగునీటికి కొదవలేకపోవడంతో పుట్లకొద్దీ వడ్లు పండేవి. ఈ సీజన్లో ప్రాజెక్టు నుంచి నీటిని వదలకపోవడంతో మూడెకరాల వరిపంట ఎండిపోయింది. దీంతో గొర్రెల కాపరులకు చెప్పడంతో వారు పొలంలో ఇలా గొర్రెలను మేపుతున్నారు.
-ఇల్లంతకుంట, మార్చి 7
కుమ్మరికుంట వద్ద డీ-83 మెయిన్ కాలువకు మాకు వచ్చే తూము 11ఎల్ ఉంటుంది. మా పొలాలు ఎండిపోతున్నయని తూము తీసి నీళ్లివ్వాలని అడిగితే, కింది రైతులకు నీరందించాలి.. మీరు తూం తీస్తే విధుల్లో ఉన్న మాపై దాడి చేసినట్లు పోలీస్ కేసులు పెడతామని బెదిరిస్తున్నరు.
-కనుకయ్య, మారేడుపల్లి, జగిత్యాల జిల్లా