కడ్తాల్, ఫిబ్రవరి 13 : ప్రభుత్వం పెండింగ్ పాల బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ పలుచోట్ల పాడి రైతులు గురువారం కూడా ఆందోళనకు దిగా రు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలోని హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై గురువారం పాడి రైతులు తమ పాలను పారబోసి నిరసన తెలిపారు. అనంతరం పాలశీతలీకరణ కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్తోపాటు బీజేపీ నాయకులు ధర్నా లో పాల్గొని మద్దతు పలికారు. ప్రభుత్వరంగ సంస్థ విజయ డెయిరీకి పాలుపోస్తున్నా, బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. 74 రోజులకు సంబంధించిన బిల్లు లు పెండింగ్‌లో ఉండటంతో పశు పోషణ భారమైందని, రోజు వారి ఖర్చులు, భోజనం, పిల్లల ఫీజులకు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు. ఇది రైతు ప్రభుత్వం కాదని, రైతులను వేధించే ప్రభుత్వమని వారు దుయ్యబట్టారు. తమ ఉసురు ప్రభుత్వానికి తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు. పాడి రైతులకు బిల్లులు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటని అన్నారు. బిల్లులు చెల్లించపోతే అసెంబ్లీని, సచివాలయాన్ని ముట్టడిస్తామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్న పాడి రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించనందుకు నిరసనగా శనివారం హైదరాబాద్‌లోని విజయ డెయిరీ ముందు రైతులంతా ఆందోళన చేపట్టనున్నట్టు విజయ డెయిరీ పరిరక్షణ సమితి నాయకులు స్పష్టంచేశారు. రైతులంతా తరలివచ్చి అధికారులకు వినతిపత్రాలు సమర్పించాలని పిలుపునిచ్చారు. ఏడాదిగా పాడి రైతులకు విజయ డెయిరీ పాల బిల్లులు చెల్లించడంలో జాప్యం చేస్తున్నదని మండిపడ్డారు. 3 నుంచి 5 బిల్లులు పెండింగ్‌లో పెడుతున్నారని, నెల క్రితం 2 బిల్లులు చెల్లించి, మళ్లీ బిల్లులను నిలిపివేశారని వాపోయారు. 5 బిల్లులకు సంబంధించి 120 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. బిల్లుల జాప్యంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు రైతు నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు.