మహబూబాబాద్ రూరల్, నవంబర్ 14: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకరబోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు పేరెంట్స్ ఆందోళనకు దిగారు. పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా శుక్రవారం పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించారు. ఓ విద్యార్థిని తండ్రి మాట్లాడుతూ.. తన కూతురు 8వ తరగతి చదువుతున్నదని తెలిపాడు.
సోషల్ సబ్జెక్ట్ బోధించే ఉపాధ్యాయుడు ఇనుగుర్తి రవి మూడు రోజుల క్రితం తమ పాపను అనుచితంగా తాకుతూ అసభ్యకరంగా మాట్లాడాడని, ఇంటి వద్ద ఎవరితో చెప్పొద్దని బెదిరించినట్టు తెలిపారు. ఇది జరిగి మూడు రోజులవుతున్నా హెచ్ఎం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన క్రమంలో హెచ్ఎంకు తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం జరిగింది. టౌన్ సీఐ మహేందర్రెడ్డి, ఎస్సైలు శివ, సూరయ్య పాఠశాలకు వచ్చి విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా తన కూతురి పట్ల కూడా పది రోజులుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని మరో విద్యార్థిని తల్లి ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు మహబూబాబాద్ టౌన్ సీఐ తెలిపారు.