భూపాలపల్లిలోని కారల్ మార్స్ కాలనీ 25వ వార్డులో తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం సీపీఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో మహిళలు ధర్నా నిర్వహించారు. తాగు నీటి సౌకర్యం లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ నాయకులు సతీష్, ప్రవీణ్ తెలిపారు.
వరద కాల్వకు నీళ్లివ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కుక్కడంలో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై 8 గ్రామాల రైతులు రాస్తారోకో చేశారు. 28 రోజుల క్రితం మంత్రులు వరద కాల్వ నీటిని విడుదల చేసినా నేటికీ చివరి భూములకు నీరందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాడ్గులపల్లి, దాచారం, చెరువుపల్లి, ఇందుగుల, మర్రిగూడెం, తోపుచర్ల గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని ఆవేదనచెందారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మరావుపేట శివారులోని ఓసీ-3 వద్ద కొండంపల్లి గ్రామస్థులు గురువారం ధర్నా నిర్వహించారు. తమ పిల్లలకు ఉపాధి, ఉద్యోగాలు వస్తాయనే ఆశతో విలువైన పంట భూములను సింగరేణి యాజమాన్యానికి అందిస్తే వారి భవిష్యత్‌ను అంధకారం చేస్తున్నదని వారు మండిపడ్డారు.
బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని వరంగల్ జిల్లా గీసుగొండలో రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమారస్వామి చేపట్టిన నిరాహార దీక్ష గురువారం నాటికి ఐదో రోజుకు చేరుకున్నది. ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ భిక్షపతి, కుడా మాజీ చైర్మన్ సుందర్రాజ్, బీఆర్ఎస్ నాయకుడు సాంబారి సమ్మారావు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.