Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 9(నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లలో పౌరసరఫరాల సంస్థ నిర్లక్ష్యం… రైతులకు శాపంగా మారుతున్నది. ఒకవైపు అకాల వర్షం ముప్పు పొంచి ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నా.. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం వస్తున్నది. అయినప్పటికీ కొనుగోళ్లు ప్రారంభించకుండా, ప్రారంభించిన చోట వేగం పెంచకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. దీంతో అకాల వర్షాలకు తమ ధాన్యం నీటి పాలవుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 1న సూర్యాపేట జిల్లా అడ్డగూడురులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు.
పది రోజులు కావొస్తున్నా అక్కడ ధాన్యం కొనుగోళ్లు మాత్రం మొదలుపెట్టలేదు. దీంతో అధికారులను బతిమాలి కోపోద్రిక్తులైన రైతులు రోడ్డుపై ధాన్యం పోసి నిప్పంటించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో సోమవారం కురిసిన వర్షానికి కేంద్రంలోని ధాన్యం తడిసి ముద్దయ్యాయి. ఇదీ క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు. కానీ పౌరసరఫరాల శాఖ అధికారులు మాత్రం 5,923 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రకటించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో ధాన్యం ముందుగా కోతకు వచ్చే ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ జిల్లాలోనే సమస్యలు వస్తున్నాయి. ఇక సోమవారం పౌరసరఫరాల శాఖ విడుదల చేసిన ప్రకటనలో 6 జిల్లాల్లో 556 కొనుగోలు కేంద్రాల నుంచి 72071 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అంటే 5,923 కేంద్రాలు ప్రారంభిస్తే కేవలం 556 కేంద్రాల్లోనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనట్లు చెప్పకనే చెప్పారు.
గతం కన్నా ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు పౌరసరఫరాల సంస్థ ప్రకటించింది. గతంలో 7037 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈ సీజన్లో మరో 112 అదనంగా 7149 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కానీ ఈ లెక్కలన్నీ అవాస్తవాలే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపాదిత కేంద్రాలు(ప్రపోజ్డ్ సెంటర్స్), ప్రారంభించిన కేంద్రాలు(ఓపెన్డ్ సెంటర్స్) లెక్కలను తారుమారు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత సీజన్లో కేసీఆర్ సర్కారు 7192 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ప్రతిపాదించింది. ఇందులో 7034 కేంద్రాలను ప్రారంభించి.. ధాన్యం కొనుగోలు చేసింది.
కాంగ్రెస్ సర్కారు ఈ సీజన్లో 7149 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రతిపాదించింది. ఇందులో ఇప్పటి వరకు 5923 కొనుగోలు కేంద్రాలను మాత్రమే ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిత కేంద్రాల సంఖ్య(7149)నే ప్రారంభించే కేంద్రాల సంఖ్యగా చెబుతున్నది. ఈ లెక్కన గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఈ సీజన్లో 112 కొనుగోలు కేంద్రాలను తక్కువగా ప్రతిపాదించింది. ఒకవేళ ప్రతిపాదించిన మొత్తం కేంద్రాలను ప్రారంభిస్తే పర్వాలేదు.. కానీ ప్రారంభించని పక్షంలో గత ప్రభుత్వం కన్నా ఈ సీజన్లో తక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ధాన్యం రైతుల్లో ఆందోళన మొదలైంది. ఓ వైపు వానముప్పు.. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం.. వెరసి ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అగచాట్లు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, ఇతర సౌకర్యాలను సర్కారు సమకూర్చలేదనే విమర్శలున్నాయి. పండించిన ధాన్యం నీళ్లపాలు కావొద్దని, అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, వర్షానికి ధాన్యం తడవకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తమకు ఆ దేవుడే దిక్కంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి 10 రోజులు దాటింది. నేటికీ అధికారులు కొనుగోళ్లు ప్రారంభిస్తలేరు. సింగిల్విండో వాళ్లు కొనుగోలు కేంద్రం మొదలుపెట్టి వదిలేసిండ్రు. రోజూ వడ్లను ఎండపోయడం, ఎదురుచూడటం.. ఇదే పని! కష్టపడి పండించిన రైతుకు వడ్లు అమ్ముకోవడం మరింత
కష్టమైతున్నది. వానలు పడితే మా పరిస్థితి ఆగమే.
– బండి విజయ, రైతు, గుండాల, భువనగిరి జిల్లా
వడ్లు తెచ్చి కొనుగోలు కేంద్రంలో పోసి మూడు రోజులైతంది. ఇక్కడ ఒక్క అధికారి కూడా కనిపిస్తలేరు. మా ఊరిలో కొనుగోలు కేంద్రం ఎవరికి వచ్చిందో అర్థం కావడం లేదు. పోయినసారి కొన్నోళ్లకు ఫోన్ చేస్తే మాకు రాలేదని చెప్తున్నారు. వ్యవసాయశాఖ వాళ్లకు ఫోన్ చేస్తే మాకేం తెల్వదు అంటున్నరు. ఈ ఎండకాలం మా వడ్లు అసలు కొంటరా కొనరా.. ఏం అర్థమైతలేదు. మా రైతుల కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో మాదిరిగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. అకాల వర్షాలు రాకముందే వడ్లు మిల్లుకు పోయేలా చూడాలి.
– కే శ్రీనివాస్, ఇటిక్యాల గ్రామం, లక్షెట్టిపేట మండలం.
సాగు నీళ్లు లేకపోవడంతో రెండెకరాల పొలంలో ఎకరం ఎండిపోయింది. ఉన్న ఎకరం పొలం కోసి వడ్లను చెన్నారం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి 15 రోజుల కింద తీసుకొచ్చిన. రెండు రోజుల క్రితం అధికారులు కోనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిండ్రు. అయినా కొనుగోళ్లు చేయడం లేదు. పండిన కొద్దిపాటి ధాన్యానికి ఎండలో కావలి కాయాల్సి వస్తున్నది. అధికారులను అడిగితే రేపు మాపు అంటున్నారు. అసలు కాంట వేస్తరో లేదో తెలియదు.
-చెన్నగోని యాదయ్య, తంగేళ్లవారిగూడెం, కనగల్ మండలం.
నాకున్న ఐదున్నర ఎకరాల్లో పొలం నాటు పెడితే నీళ్లు లేక ఎకరంన్నర ఎండిపోయింది. ఉన్న కొద్దిపాటి ధాన్యాన్ని పదిహేను దినాల క్రితమే కోసి అమ్ముకుందామని కేంద్రానికి తెచ్చిన. ఇప్పటికీ కొనుగోళ్లు మొదలు పెట్టలే. వర్షం నుంచి ధాన్యం కాపాడుకునేందుకు 25 పట్టాలు కిరాయికి తెచ్చిన. రోజుకు రూ. 300 ఖర్చవుతున్నది. ఇటు పంటలు ఎండిపోయి నష్టపోయినం. అటు కొనుగోళ్లు మొదలు పెట్టక పట్టాల ఖర్చుతో నష్టపోతున్నాం.
– ముత్తినేని యాదయ్య, రైతు, చిన్నసూరారం, నల్లగొండ మండలం.