మహబూబ్నగర్ : తడి చెత్త నుంచి కంప్రెస్డ్ బయో గ్యాస్ ఉత్పత్తి చేసే ప్లాంట్ను మహబూబ్నగర్లో నెలకొల్పుతామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఈ మేరకు రూ.16 కోట్ల వ్యయంతో రెండు ఎకరాల విస్తీర్ణంలో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర రేనివబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్తో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ అధికారులు మంత్రి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా తడి చెత్తను సేకరించి దాని ద్వారా కంప్రెస్డ్ బయో గ్యాస్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందుకుగాను ఒక టన్ను తడి చెత్తకు రూ. 150 చొప్పున మున్సిపాలిటీకి చెల్లిస్తారు. నిత్యం 40 నుంచి 50 టన్నుల చొప్పున తడి చెత్త సేకరిస్తే ప్రతి సంవత్సరం రూ. 22 లక్షల ఆదాయం మున్సిపాలిటీకి వస్తుందని మంత్రి వెల్లడించారు.
గతంలో చెత్తను ఎక్కడబడితే అక్కడ పడవేసేవారని, చెత్తను తొలగించేందుకు మున్సిపాలిటీ ద్వారా డబ్బులు ఖర్చు చేసే పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు అలా కాకుండా మున్సిపాలిటీకే ఆదాయం వస్తుందని తెలిపారు. దీనివల్ల మున్సిపాలిటీ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా ఎలాంటి కాలుష్యం లేకుండా ఉంటుందని, మున్సిపాలిటీకి అదనపు ఆదాయం వచ్చేలా అవకాశం ఉందని తెలిపారు.
ఈ యూనిట్ ఏర్పాటుకు అవసరమైన రెండెకరాల స్థలాన్ని కూడా తక్షణమే గుర్తించి ఇవ్వాలని ఆయన మున్సిపల్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ తర్వాత మహబూబ్ నగర్లోనే తడి చెత్తతో బయోగ్యాస్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను నెలకొల్పనున్నట్లు మంత్రి వెల్లడించారు.
కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, టీఎస్ రెడ్కో జిల్లా మేనేజర్ జేఎస్ఎన్ మూర్తి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.