హైదరాబాద్, నవంబర్12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో 2014 నాటి స్ఫూర్తి ఎక్కడా కనిపించడం లేదు. అడుగడుగునా అనేక లోపాలు వెక్కిరిస్తున్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్)తో పోల్చితే ఆనాటి స్ఫూర్తి నేడు కనిపించడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. నాడు సర్వేలో పాల్గొనేందుకు అమితాసక్తి చూపిన ప్రజలు.. నేడు వివరాల వెల్లడికి పూర్తి విముఖత చూపుతున్నారు. సర్వేలో పాల్గొంటున్న అధికార యంత్రాంగం సైతం తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నది. ప్రజలను ఆ దిశగా చైతన్యవంతం చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు సైతం ఎక్కడా దర్శనమివ్వకపోవడమే సర్వే కొనసాగుతున్న తీరుకు అద్దం పడుతున్నది.
నాడు ఒకేరోజు సమర్థంగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2014 ఆగస్టు 19న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో, దేశచరిత్రలోనే అపూర్వమైన రీతిలో ‘స్వయం నిర్ణయం-అర్హులకే సంక్షేమం’ లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ఏకకాలంలో సమర్థంగా నిర్వహించింది. ప్రజలను అన్నివిధాలుగా సర్వేకు సంసిద్ధులను చేసింది. అధికార యంత్రాంగానికి సైతం పకడ్బందీగా శిక్షణ ఇచ్చింది. మొత్తంగా ఒకేరోజున 3.85 లక్షల మంది ప్రభుత్వ సిబ్బందిని ఉపయోగించి, 1.3 కుటుంబాల వివరాలను విజయవంతంగా సేకరించింది. 8 అంశాలపై 94 ప్రశ్నలతో సామాజిక, విద్య, ఉపాధి, ఉద్యోగ, కులం, ఉపకులాల గణాంకాలన్నింటినీ సేకరించి దేశాన్నే అబ్బురపరిచింది. తెలంగాణ జనాభాలో బీసీ కులాలు 51.08%, ఉన్నత కులాలు 21.5%, దళితులు 17.5%, గిరిజనులు 9.91%, మైనారిటీలు 14.46% చొప్పున ఉన్నట్టు ఆ సర్వే తేల్చింది. దళితుల్లోని 56 ఉప కులాలు, గిరిజనుల్లోని 16 తెగలు, మైనారిటీల స్థితిగతులను సైతం వివరంగా వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న పరిమితులు, చట్టాలు, ఇతర న్యాయపరమైన వివాదాల నేపథ్యంలో మాత్రమే సర్వే ఫలితాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెల్లడించలేదు. కానీ, సర్వే ఫలితాల ఆధారంగానే దేశానికి ఆదర్శవంతమైన అద్భుత పథకాలనెన్నింటినో కేసీఆర్ రూపకల్పన చేశారు. కల్యాణలక్ష్మి, గురుకులాల ఏర్పాటు, విదేశీ విద్యానిధి, రైతుబంధు, రైతుబీమా, చేపలపంపిణీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు.
దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన ప్రజలు
నాడు సర్వేలో పాల్గొనేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రజలందరూ సర్వేలో పాల్గొనేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా సెలవు దినంగా ప్రకటించింది. సర్వేలో పాల్గొనేందుకు లండన్, గల్ఫ్ తదితర దేశాల్లో స్థిరపడినవారు, ఉపాధి కోసం వెళ్లిన తెలంగాణ వారంతా నాడు పల్లెలకు ఉత్సాహంగా తరలివచ్చారు.దూరప్రాంతాల నుంచి సైతం సైకిల్ తొకుకుంటూ వచ్చి వివరాలను అందించడం విశేషం. సర్వే సమయానికి ఇంట్లో లేకపోతే మనం తెలంగాణ వాళ్లం కాకుండా పోతాం అనేంతగా ప్రజలు భావించారు. ఒక్కమాటలో చెప్పాలంటే 2014 ఆగస్టు 19న రాష్ట్రవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. సర్వేలో పాల్గొన్న 1.3 కోట్ల కుటుంబాల్లో దాదాపు 91.38 లక్షల కుటుంబాలు తమ ఆదాయ, వ్యయాలు, ఇతర గోప్యతకు సంబంధించిన సమాచారాన్ని ఏ భయం, సంకోచం లేకుండా స్వతంత్రంగా డిక్లరేషన్ సమర్పించాయి.
నాడు పండుగ.. నేడు దండుగ..
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో పాల్గొంటున్న 87వేల మందికిపైగా ఎన్యూమరేటర్లకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వలేదు. ప్రజలకు కనీస అవగాహన కల్పించలేదు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ప్రజల్లో అనేక భయాలు నెలకొన్నాయి. నాడు స్వచ్ఛందంగా తరలివచ్చి, పేద, ధనిక తేడా లేకుండా సర్వేలో పాల్గొన్న ప్రజలే నేడు పూర్తిగా విముఖత చూపుతున్నారు. ఉన్న పథకాలు ఎక్కడ ఊడిపోతాయోనని, పన్నులు ఎక్కడ పెరిగిపోతాయోనని భయపడుతున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చని మేధావివర్గం, సామాజికవేత్తలు వివరిస్తున్నారు. పలుచోట్ల గ్రామాలకు గ్రామాలు సర్వేను బహిష్కరిస్తుండటం గమనార్హం. మొత్తంగా దిక్కు దిశ లేకుండా, అరకొర సమాచారాన్నే అధికారులు సేకరిస్తున్నారని, వెరసి ఈ సర్వే ద్వారా వచ్చే డాటాకు ఎలాంటి ప్రామాణికత, కచ్చితత్వం ఉండబోదని వివరిస్తున్నారు. ప్రజలే కాదు, ఎన్యూమరేటర్లు సైతం సర్వే తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాడు ఎనిమిది క్యాటగిరీల్లో 94 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించినా, నేడు అంత కంటే తక్కువగా ఉన్న 75 ప్రశ్నలకు ప్రజల నుంచి సమాధానం రాబట్టలేక డీలా పడిపోతున్నారు.
ప్రభుత్వ పెద్దలు ఎక్కడ?
ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన సర్వేపై ప్రజలేమో కానీ ప్రభుత్వ పెద్దలు కూడా శీతకన్ను వేశారని సామాజికవేత్తలు, రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడా సర్వేలో పాల్గొన్న దాఖలాలు లేకపోవడం అందుకు నిదర్శనమని ఉదహరిస్తున్నారు. తొలుత మంత్రులు, కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు తమ ఆస్తులు, ఆదాయ వివరాలను వెల్లడించి, సర్వే ఫారాల్లో నమోదు చేయించి స్ఫూర్తి నింపాల్సి ఉండగా ఆ దిశగా ఏ ఒక్కరూ ముందు నిలవకపోవడం గమనార్హం. సర్వే కొనసాగుతున్న క్రమంలోనూ మంత్రులు పొరుగు రాష్ర్టాల్లో, ఇతర పర్యటనల్లో ఉండటం, ప్రజాప్రతినిధులు పూర్తిగా భాగస్వాములు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
ఇంటింటి సర్వేపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించి, పగడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం కనీస అవగాహన కల్పించకపోవడం వల్లే ప్రజలు సర్వేలో పాల్గొనేందుకు నిరాసక్తి చూపుతున్నారని వివరించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో, ఉద్యోగాలకు, కూలి పనులకు వెళ్లిన సమయంలో ఎన్యూమరేటర్లు వస్తున్నారని, వారి వివరాలను ఎలా? ఎప్పుడు? నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సెలవు ప్రకటించాలని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు పత్రిక ప్రకటనలు ఇవ్వడంతోపాటు కులసంఘాల పెద్దలతో చర్చించాలని కోరారు.
-బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ