Rajanna Sircilla | ఇల్లంతకుంట, నవంబర్ 9 : తమ గ్రామ శివారు సమస్యను పరిష్కరించే వరకు సమగ్ర కుల సర్వేను బహిష్కరిస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లి గ్రామస్థలు స్పష్టం చేశారు. ఈ మేరకు సర్వే నిర్వహించడానికి సహకరించబోమంటూ చేసిన తీర్మాన పత్రాన్ని శనివారం గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని గొల్లపల్లి గ్రామ పంచాయతీ నుంచి వెంకట్రావుపల్లి 2018లో నూతన గ్రామ పంచాయితీగా ఏర్పడిందని, ఓటరు జాబితా ప్రకారం రెవెన్యూ సరిహద్దు నిర్ణయంలో సమస్య ఏర్పడి ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని తెలిపారు. దానిని వెంట నే పరిష్కరించాలని, లేనిపక్షంలో సమగ్ర సర్వే బహిష్కరణకు అన్ని కుల సంఘాల ప్రజలు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.