హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో 28 బార్లకు శుక్రవారం డ్రా పద్ధతిలో కొత్త యజమానులకు ఎంపిక చేశారు. హైదరాబాద్‌లోని గోల్కొండ నార్సింగ్ ప్రాంతంలోని ‘ది అడ్రస్ కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్ హాల్’లో నిర్వహించిన డ్రా కార్యక్రమంలో ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ డ్రా తీసి, లబ్ధిదారులను ఎంపిక చేశారు. దరఖాస్తుదారుల సమక్షంలో కమిషనర్ డ్రా తీయగా.. హెడ్ క్వార్టర్స్ జాయింట్ కమిషనర్ కేఏబీ శాస్త్రి ఆ నంబర్‌ను వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి ముందు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతిచెందిన వారి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. బార్లు గెలుపొందిన లబ్ధిదారులు అలాట్మెంట్ లెటర్ తీసుకొని, 90 రోజుల్లోగా బార్ల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కమిషనర్ కోరారు.
జీహెచ్ఎంసీతో పాటు నిజామాబాద్, బోధన్, మహబూబ్‌నగర్, జల్పల్లిలో కూడా ప్రశాంతంగా డ్రా ప్రక్రియ ముగిసిందని ఎక్సైజ్ కమిషనర్ వెల్లడించారు. డిప్యూటీ కమిషనర్లు పీ దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్, అనిల్ కుమార్‌రెడ్డి, జీవన్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, 28 బార్లకు నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఎక్సైజ్‌శాఖ అదనంగా రూ.36.68 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.