హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : ధూపదీప నైవేద్యం (డీడీఎన్) ఆలయాలపై దేవాదాయశాఖ థర్డ్‌పార్టీ విచారణ మొదలుపెట్టింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆదరణకు నోచుకోని ఆలయాల్లో ధూపదీపనైవేద్యం కోసం మొదలైన ఈ ప్రభుత్వ పథకం అమలు తీరులో వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5,800 దేవాలయాలకు ధూపదీప పథకం కింద ప్రతి నెల ఒక్కో ఆలయానికి రూ.10 వేలు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఆలయాల ఎంపిక విషయంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో డీడీఎన్ ఆలయాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని దేవాదాయశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ సర్వే కరీంనగర్, జగిత్యాల, ఖమ్మం, హైదరాబాద్‌లో ప్రారంభం కాగా దశలవారీగా అన్ని జిల్లాలకు విస్తరించనున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా ఈ సర్వేను నిర్వహిస్తున్నట్టు దేవాదాయశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ సర్వే నివేదిక ద్వారా తదుపరి చర్యలు ఉంటాయని ఆ అధికారి పేర్కొన్నారు.
డీడీఎన్ పథకం కింద ఎంపికైన దేవాలయాల్లో పూజలు సరిగా జరగడం లేదని, కొన్ని చోట్ల దేవాలయాలు మూతబడ్డాయని పేర్కొంటూ దేవాదాయశాఖకు ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని చోట్ల గ్రామస్తులు ఏకంగా తమ ఆలయాల ఫొటోలను కూడా పంపినట్టు తెలిసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకట్రెండు చోట్ల ఆలయాలు లేకుండానే డీడీఎన్ తీసుకుంటున్నట్టు ఫిర్యాదులు రావడంతో అక్కడ రద్దు చేశారు. కొన్నిచోట్ల ప్రభుత్వ ఉద్యోగులే డీడీఎన్ తీసుకున్నట్టు తేలింది. దీంతో వారిని పిలిచి మందలించారు. కొన్ని చోట్ల బినామీలుగా సంఘనేతలు ఉన్నారని, ఒక్కొక్కరికి మూడు నాలుగు దేవాలయాలున్నాయని ఫిర్యాదులొచ్చాయి. కొన్నిచోట్ల అర్హతలేని వారిని కూడా స్థానిక ఇన్స్పెక్టర్లు, ఏసీలు లబ్ధిదారులుగా చేర్చినట్టు తెలిసింది.
ఈ మొత్తం ఫిర్యాదులపై విజిలెన్స్ విభాగం సూచన మేరకు థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయించి ఆ తర్వాత బోగస్‌గా తేలినవాటిని రద్దు చేయాలని దేవాదాయశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. నెలరోజుల్లోగా మొత్తం ఆలయాలకు సంబంధించిన నివేదికలు అందించాలని, అందులో ప్రతి ఒక్క అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పినట్టు తెలిసింది. డీడీఎన్ ఆలయాలకు గ్రామ, పట్టణస్థాయిలో ముగ్గురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. ఇందుకోసం ఆయా ప్రాంతాలలో ఉన్న 20 నుంచి 25 డీడీఎన్ ఆలయాలను ఒక పరిధి కిందికి తెచ్చి వాటిని మండల్‌గా చేసి అక్కడ ఉన్న ఈవోల ద్వారా వివరాలు కావాలని కోరినట్టు సమాచారం. ఆ వివరాలు ఏసీ ఆఫీసుకు వచ్చిన తర్వాత అక్కడినుంచి కమిషనరేట్‌కు పంపి, ఎవరెవరిని ఎంపిక చేయాలనే నిర్ణయం తీసుకుంటామని దేవాదాయశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.
బాసర, జనవరి 12 : నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో రెండు రోజుల క్రితం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ స్థాయి విజిలెన్స్ అధికారి నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. విజిలెన్స్ అధికారు లు సామాన్య భక్తులుగా ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయం చుట్టుపక్కల గల దుకాణాలను పరిశీలించి, ప్రసాద కౌంటర్లో లడ్డూలు కొనుగోలు చేశారు.
అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. రీసైక్లింగ్ మ్యానువల్ టికెట్ల తీరును గమనించారు. ప్రసాదాల కౌంటర్లో లెక్కల్లో తేడాను గుర్తించా రు. ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టకుం డా కొందరు అధికారుల అవినీతి దందా పై ఆరా తీసినట్టు తెలుస్తున్నది. సత్రాల నిర్మాణంలో అక్రమాలు, రూ.3కోట్లతో నిర్మించిన పరిపాలన భవనంలో అవినీతి జరిగినట్టు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేయడం ఆసక్తి కలిగిస్తున్నది.