‘శివుడి వాహనం నందికి ప్రతిరూపంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు కట్టేస్తున్న కోడెలు కోతకు పోతున్నయా? వాటిని రైతులకు మాత్రమే.. అవీ రెండు చొప్పునే ఇవ్వాలన్న నిబంధన ఉన్నా.. కాంగ్రెస్ సర్కార్ ఉదాసీనత, అధికారుల నిర్లక్ష్యం, అక్రమాల కారణంగా కోల్లాగెలు వ్యాపారుల పాలవుతున్నాయా? గోశాలలో సంరక్షణ పేరిట వాటిని కబేళాలకు విక్రయిస్తూ సదరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారా?’ అంటే ‘అవును’ అనే తాజా పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి. ఇటీవల ఓ వ్యాపారి రాజన్న ఆలయం నుంచి 60 కోడెలను తీసుకెళ్లడం, అవి గోశాలకు కాకుండా కోతకు తరలిపోయాయని వరంగల్ జిల్లా గీసుగొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం, 60 కోడెల్లో 49 విక్రయించినట్టు పోలీసులు నిర్ధారించడం ఇందుకు బలం చేకూరుస్తున్నది. కాగా సదరు నిందితుడికి కోడెలు ఇవ్వాలని సాక్షాత్తూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సిఫారసు చేసిన లేఖ బయటకు రావడం చర్చనీయాంశమైంది..
Vemulawada | కరీంనగర్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) /వేములవాడ :. దేశంలోనే ఎక్కడా లేని విధంగా వేములవాడలో కోడె మొక్కుల సంప్రదాయం ఉన్నది. కష్టనష్టాల్లోంచి బయటపడ్డా, కోరికలు తీరినా ముందుగా మొక్కుకున్న మేరకు భక్తులు రాజరాజేశ్వరుడికి కోడెలు సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నది. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ర్టాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తమ ఇండ్ల నుంచి కోడెలాగెలను తెచ్చి రాజన్న సన్నిధిలో కట్టేసి వెళ్తుంటారు. ఆలయ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీనత వెరసి రాజన్న కోడెల ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఇందుకు గీసుగొండ పోలీసుస్టేషన్లో తాజాగా నమోదైన కేసే మరో ఉదాహరణగా నిలిచింది.
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మనుగొండకు చెందిన మాదాసి రాంబాబు తాను శ్రీరాజేశ్వర సొసైటీ నడుపుతున్నానని, తనకు గోశాల ఉన్నదని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని వేములవాడ గోశాలకు చెందిన కోడెలను తమకు కేటాయించేలా చూడాలని కోరుతూ పెట్టిన అర్జీపై స్వయంగా దేవాదాయ శాఖ మంత్రి ఎండార్స్మెంట్చేసి సిఫారసు చేశారు. ఈ సిఫారసును పరిగణనలోకి తీసుకోవాలని దేవాలయ ఈవోను లేఖలో అదేశించారు. ఈ లేఖను రాంబాబు ఆలయ అధికారులకు ఇవ్వడంతో అతడు రైతా? కాదా? అతనికి గోశాల ఉన్నదా? లేదా? నిజంగా ఆయనకు కోడెలు అవసరం ఉన్నాయా? లేవా? అన్న వివరాలేవీ తెలుసుకోకుండానే కోడెలు అప్పజెప్పిట్టు విమర్శలు వస్తున్నాయి. రాంబాబు వ్యవహారాన్ని గుర్తించిన ఆ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు, గత నెల 29న గీసుగొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాదాసి రాంబాబుపై కేసు నమోదు చేసినట్టు సీఐ మహేందర్ ఈ నెల 6న తెలిపారు. యువకుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని, అతడు అలయం నుంచి 60 కోడెలు తెస్తే వాటిలో 11 మాత్రమే ఉన్నాయని, మిగిలిన 49 లేకపోవంతో కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయంపై వేములవాడ ఆలయ దేవాదాయ శాఖ అధికారులను వివరణ కోరుతూ లేఖ రాసినట్టు వెల్లడించారు. కేసు విషయం వెలుగు చూడడంతో ఈ విషయం సోషల్మీడియాలో వైరల్ అయింది. వీటిన్నింటిని వివరిస్తూ ‘రాజన్న కోడెల దుర్వినియోగం!’ శీర్షికన శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ జిల్లా పేజీలో కథనం ప్రచురితమైంది.
ఈ నేపథ్యంలో వేములవాడ ఆలయ ఈవో శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాంబాబుకు అక్టోబర్ 4న రెండు కోడెలు మాత్రమే ఇచ్చినట్టు పేర్కొన్నారు. పత్రాలు పరిశీలించిన తర్వాతే ఇచ్చామని చెప్పిన ఈవో, ఇదే తరహాలో గీసుగొండ, మనుగొండ, అనంతారం, చలపర్తి, దుగ్గొండి, వరంగల్లోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులకు సైతం ఇచ్చామని తెలిపారు. అక్టోబర్ 4 నుంచి 13 వరకు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ‘నమస్తే’ కథనంపై విచారణ చేపట్టి తగుచర్యలు తీసుకుంటామని, ఇకముందు కోడెలను పంపిణీ చేసే సమయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని, రికార్డుల నిర్వహణలోనూ పొరపాట్లు జరకుండా చూసుకుంటామని తెలిపారు. అక్రమాలు జరిగియా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వకుండా కప్పిపుచ్చే దిశగా ఈవో వివరణ ఇచ్చినట్టు స్పష్టంగా తెలుస్తున్నది. ఆలయం నుంచి 60 కోడెలు తెచ్చానని రాంబాబే స్వయంగా చెప్పినట్టు గీసుగొండ సీఐ తెలిపారు. అందులో 49 లేవని, 11 మాత్రమే ఉన్నాయని అందుకే కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఆలయ అధికారులు చెప్తున్నదానికి, పోలీసులు చెప్తున్న విషయాలకు పొంతన లేకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును లోతుగా విచారిస్తే అక్రమాలు మొత్తం బహిర్గతమయ్యే అవకాశం ఉన్నా పోలీసులను ముందుకు వెళ్లకుండా తెరవెనుక కొందరు ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. అందుకే ఆలయ అధికారులు, పోలీసులు వేర్వేరు సమాచారం బయటకు ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
వేములవాడ రాజన్నకు భక్తులు సమర్పించిన నిజ కోడెలను గోశాలలకు అందజేసే విధానం ఉన్నది. గోశాల ఫెడరేషన్ ద్వారా గుర్తింపు పొందిన గోశాలకు గతంలో రాజన్న ఆలయ అధికారులు కోడెలు అందజేశారు. గత జనవరిలో రాజన్న గోశాల నుంచి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం దుబ్బతండాలోని శ్రీ సోమేశ్వర గోసంరక్షణ సేవా సంఘానికి 20 రాజన్న కోడెలు అందించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ఫూర్ పరిధిలో తనిఖీలు చేయగా 24 కోడెలు వెలుగు చూశాయి. ఆలయం నుంచి 20 మాత్రమే అందిచినట్టు లేఖలో ఉన్నా, నాలుగు అదనంగా ఉండడాన్ని గమనించిన పోలీసులు రాజన్న ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రాజన్న ఆలయ గోశాలలోనే అక్రమాలు జరుగుతున్నట్టు గుర్తించి గోశాల ఉద్యోగిపై కేసు నమోదు చేశారు. రాజన్న కోడెలు తరలి వెళ్తున్న శ్రీ సోమేశ్వర గోసంరక్షణ సేవా సంఘం కూడా లేనేలేదని, తప్పుడు లేఖలతో కోడెలు బయటికి తరలుతున్నాయని నిర్ధారించిన ఆలయ అధికారులు, గోశాలలకు కోడెలను అందించడం నిలిపివేశారు.
అక్రమాలు జరగకుండా ఉండేందుకు మార్చి నుంచి నేరుగా రైతులకే కోడెలు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సీఎం రేవంత్రెడ్డి ఓఎస్డీ వేముల శ్రీనివాస్ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి తీసుకోవాల్సిన విధివిధానాలపై రాజన్న ఆల య అధికారులతో చర్చించారు. కలెక్టర్, జి ల్లా పశు వైద్యాధికారి, జిల్లా వ్యవసాయ అధికారితోపాటు ఇతర స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులతో కలిసి కమిటీ వేశారు. కోడెలను తమ అవసరాలకు తీసుకెళ్లడానికి ఎవరు వస్తారో.. సదరు వ్యక్తి కచ్చితంగా రైతు అయి ఉండాల ని, అతనికి సంబంధించి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, వ్యవసాయ అధికారి ధ్రువీకరణ పత్రంతో ముందుగా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తుదారుల్లో అర్హులను గుర్తించి ఒక్కో రైతుకు కేవలం రెండు కోడెలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. నవంబర్ 14 వరకు రాజన్న ఆలయం నుంచి రైతుల పేరిట 1,734 కోడెలను పంపిణీ చేసినట్టు ఆలయ రికార్డులు చెప్తున్నాయి.
రాజన్న కోడెలను రైతులకు మాత్రమే, అదీ రెండే ఇవ్వాలన్న నిబంధన ఉన్నా రాంబాబుకు 60 కోడెలు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి అనుచరుడు, పైగా మంత్రి సిఫారసు లేఖ ఉన్నందునే ఒక్కరికే గంపగుత్తగా కోడెలు కట్టబెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా రికార్డుల్లో మాత్రం వరంగల్ జిల్లాకు చెందిన వివిధ గ్రామాల రైతులు వచ్చి కోడెలు తీసుకెళ్లినట్టు పేర్కొనడం గమనార్హం. రైతుల పేర్లను బినామీగా వాడుకొని సదరు వ్యక్తి రాంబాబు కోడెల క్రయ విక్రయాల వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వ ఉదాసీన వైఖరి, అధికారుల నిర్లక్ష్యం, అక్రమాల వల్లే కోడెల పంపిణీ వ్యవస్థ పక్కదారి పట్టినట్టు తాజా ఘటన బట్టి స్పష్టమవుతున్నది.