హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : గురుకుల పాఠశాలలపై కాంగ్రెస్ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఆరోపించారు. ఈ మేరకు గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఇందుకు కారణమైన అధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈనెల 21న సంగారెడ్డి జిల్లా మోర్గి ఆదర్శ పాఠశాలలో చికెన్ తిన్న అనంతరం విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై..
11మంది దవాఖానలో చేరారని, వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశా రు. మంచిర్యాల జిల్లాలోని గిరిజన పాఠశాలలో పురుగుల అన్నం తినడంతో విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారని పేర్కొన్నారు. దీంతో గురుకుల పాఠశాలల్లో భోజనం చేయాలంటేనే విద్యార్థులు జంకుతున్నారని, వారి తల్లిదండ్రులు కూడా భోజన ఏర్పాటుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోకపోవంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.