హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఆర్థిక శాఖలో ఓ అధికారికి అక్రమంగా ప్రమోషన్ ఇచ్చారంటూ ‘తెలంగాణ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ గెజిటెడ్ సర్వీస్ అసోసియేషన్’ ఆరోపించింది. ఆ ప్రమోషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఫైనాన్స్ విభాగంలో పనిచేస్తున్న ఎన్ మంగమ్మ అనే సెక్షన్ ఆఫీసర్‌ను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా (సీఏవో) నియమిస్తూ ఈ నెల 23న ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రమోషన్‌పై ఉద్యోగులు అభ్యంతరం చెప్తున్నారు. సర్వీస్ నిబంధనల ప్రకారం సెక్షన్ ఆఫీసర్‌ను బదిలీ లేదా ఉద్యోగోన్నతిపై పంపితే అకౌంట్స్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ డైరెక్టర్ లేదా జిల్లా ట్రెజరీ అధికారిగా పంపాల్సి ఉంటుందని, అంతేగానీ సీఏవో/డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించేందుకు అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. సీనియార్టీని పరిగణనలోకి తీసుకొని డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ నుంచి వచ్చిన సిఫారసుల మేరకే పదోన్నతులు కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ మంగమ్మకు సెక్షన్ ఆఫీసర్ నుంచి ఏకంగా సీఏవోగా ప్రమోషన్ కల్పించారని పేర్కొన్నారు. ఇది అన్యాయమని, ఈ చర్యతో సీనియార్టీ జాబితాలో ఉన్న ఏవోలు, ఏడీలు, డీటీవోలు తీవ్ర ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ ప్రమోషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శి పరశురాం, వైస్ ప్రెసిడెంట్ శిరీష, కోశాధికారి జగన్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఆర్థిక శాఖలో సంచలనంగా మారిన అక్రమ పదోన్నతి వెనుక ‘గట్టి’ సిఫారసు ఉన్నట్టు సచివాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి వివిధ కారణాలతో ఈ శాఖలో నాలుగేండ్లుగా ఎలాంటి పదోన్నతులు కల్పించడం లేదని ఉద్యోగులు చెప్తున్నారు. సర్వీస్ నిబంధనలు, ఇతర కారణాలు అంటూ సాకులు చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎంతో సీనియార్టీ ఉన్న ఉద్యోగులు సైతం పదోన్నతులు లేకుండా ఏవోలుగా, ఏడీలుగా, డీటీవోలుగా పదవీ విరమణ చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. కానీ.. మంగమ్మ విషయంలో నిబంధనలన్నీ తుంగలో తొక్కారని.. డీపీసీ సిఫారసులు లేకుండానే, సీనియార్టీకి మించి పదోన్నతి ఇచ్చారని మండిపడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని తొమ్మిది నెలల్లో నాలుగైదు సార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని వాపోతున్నారు.