తొర్రూరు, మార్చి 6 : పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా నిలబెట్టాలని శ్రమిస్తున్న కార్యకర్తలకు తీవ్ర నిరాశ ఎదురవుతున్నది. ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డి పార్టీపై పూర్తి అధికారం ప్రదర్శిస్తూ, ఇతర నేతల అభిప్రాయాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాయకత్వ లోపం వల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు కాంగ్రెస్ కార్యకర్తలు లేఖ రాశారు. ప్రస్తుత నాయకత్వ వైఫల్యం వల్ల పార్టీ భవిష్యత్‌లో ప్రమాదంలో పడుతుందని, తక్షణ జోక్యం అవసరమని కోరారు. పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతు కోల్పోతున్నదని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఝాన్సీరెడ్డి పార్టీ కార్యకర్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీకి అంకితమైన కార్యకర్తలకు అవకాశం లేకుండా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.