హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం కోసం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మహంకాళ్ గ్రామం పరిధిలోని 93, 94, 95, 770, 771, 772, 773, 778, 779 సర్వే నంబర్లలో సేకరించిన భూమూల్లో 97 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆ భూముల్లో నిర్మాణాలు చేపట్టేందుకు వర్టెక్స్ డెవలపర్స్ సంస్థ తప్పుడు పత్రాలతో హెచ్ఎండీఏ నుంచి అనుమతులు పొందిందని, ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు చేపట్టలేదని తుకుగూడకు చెందిన కే కృష్ణ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఆ భూముల ఆక్రమణను అడ్డుకోవాలని, అకడ జరిగే నిర్మాణాలను కొనుగోలు చేసిన వారు మోసపోకుండా చూడాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషనర్ గతంలో కలెక్టర్‌కు సమర్పించిన ఫిర్యాదులో వివరాలు అసమగ్రంగా ఉన్నాయని పేర్కొన్నది. కబ్జాకు సంబంధించిన పూర్తి ఆధారాలతో 4 వారాల్లోగా మరోసారి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని పిటిషనర్‌కు సూచించింది. ఆ ఫిర్యాదు స్వీకరించాక చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశిస్తూ.. పిటిషన్‌పై విచారణ ముగించినట్టు ప్రకటించింది.